Noah Lyles: రక్తంలో పరుగు.. బోల్ట్‌లా మెరుపు.. స్ప్రింటర్‌ నోవా లైల్స్‌ సింగర్‌ కూడా!

బహుముఖ ప్రజ్ఞ కలిగిన అథ్లెట్‌. ఇటు రన్నింగ్‌ ట్రాక్‌పై పరుగులు పెడతాడు. అటువైపు ర్యాప్‌ ట్రాప్‌పై అభిమానులను హుర్రూతలూగిస్తాడు. ఉసేన్ బోల్ట్‌ను మైమరిపించే పరుగుల వీరుడిగా మారడతాడనంలో సందేహం లేని స్ప్రింటర్‌ అతడు..

Published : 29 Aug 2023 17:40 IST

ట్రాక్‌పై అతని అడుగే సంచలనం. పరుగులో అతనో వీరుడు. నిజానికి అతని రక్తంలోనే పరుగు ఉంది. తల్లిదండ్రులు ట్రాక్‌పై సత్తాచాటినవాళ్లే. ఇక పరుగే కాదు అతనో గాయకుడు కూడా. ర్యాపర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. ఆల్బమ్‌లు కూడా రూపొందిస్తున్నాడు. దిగ్గజ స్ప్రింటర్‌ బోల్ట్‌ స్థానాన్ని భర్తీ చేసేలా సాగుతున్నాడు. తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల 100మీ, 200మీ. పరుగుతో పాటు 4×100మీ. రిలే పరుగులోనూ స్వర్ణాలు సాధించాడు. అతనే 26 ఏళ్ల అమెరికా అథ్లెట్‌ నోవా లైల్స్‌. ఒకే ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 100 మీటర్ల పరుగుతో పాటు 200 మీటర్ల పరుగులోనూ విజేతగా నిలిచి ‘డబుల్‌’ సాధించిన మూడో పురుష అథ్లెట్‌ అతను. 

పరుగుతో బంధం.. 

తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెడుతూ ట్రాక్‌పైకి మెరుపులా దూసుకొచ్చాడు లైల్స్‌. అతని తల్లిదండ్రులు కీష కెయిన్, కెవిన్‌ లైల్స్‌ కూడా ఒకప్పటి రన్నర్లే. కీష.. 4×400 మీటర్ల రిలేలో తొమ్మిది సార్లు అమెరికా, రెండు సార్లు ఎన్‌సీˆఏఏ ఛాంపియన్‌గా నిలిచారు. 1983లో 4×400మీ. రిలేలో అమెరికా పసిడి గెలవడంలో కెవిన్‌ కీలక పాత్ర పోషించారు. నోవా తమ్ముడు జోసెఫస్‌ 2014 జూనియర్‌ 4×400మీ.రిలే ఛాంపియన్‌. అంతర్జాతీయ పోటీల్లో 200మీ, 400మీ. పరుగులో అతను పోటీపడుతున్నాడు. మొదట జిమ్నాస్ట్‌గా నోవా లైల్స్‌ కెరీర్‌ మొదలైంది. ఆ తర్వాత 12 ఏళ్ల వయసులో ట్రాక్‌పైకి మనసు మళ్లింది. హైజంప్‌లోనూ మెరిశాడు. కానీ చివరకు పరుగుతోనే సాగుతున్నాడు.

Simone Biles: పడి లేచిన కెరటం.. సిమోన్‌ బైల్స్‌

2014 యూత్‌ ఒలింపిక్స్‌లో 200మీ. స్వర్ణంతో అతను వెలుగులోకి వచ్చాడు. 2016 ప్రపంచ అండర్‌-20 ఛాంపియన్‌షిప్‌లో 100మీ. పసిడి నెగ్గాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 2019లో రెండు స్వర్ణాలు (200మీ. 4×100మీ.రిలే), 2022లో ఓ స్వర్ణం (200మీ), ఓ రజతం (4×100మీ.రిలే) గెలిచాడు. డైమండ్‌ లీగ్‌లో అయితే అతనికి తిరుగే లేదు. 2019లో 100మీ, 200మీ. ఛాంపియన్‌గా నిలిచాడు. 2017, 2018, 2022లో 200మీ.లో పసిడి సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 100మీ. పరుగులో అతని అత్యుత్తమ టైమింగ్‌ 9.83 సెకన్లుగా ఉంది. అదే 200 మీటర్లలో అయితే 19.31 సెకన్లతో అమెరికా రికార్డు అతనిదే. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బోల్ట్‌ (19.19సె), యొహాన్‌ బ్లేక్‌ (19.26సె) తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. 

ట్రాక్‌ దిగితే..

పరుగు పూర్తి చేసి నోవా లైల్స్‌ ట్రాక్‌ దిగితే మరో ట్రాక్‌ ఎక్కుతాడు. గాయకుడిగా మారిపోతాడు. ర్యాపర్‌గా అలరిస్తాడు. అతనో రాక్‌స్టార్‌. పాటలు పాడతాడు. నోజో18 పేరులో ఆల్బమ్స్‌ రూపొందిస్తాడు. 2020 ఏప్రిల్‌లో వచ్చిన ‘ఏ హ్యూమన్‌ జర్నీ’ అతని తొలి ఆల్బం. యుఎస్‌ పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ సాండి మోరిస్‌తో కలిసి స్టేజ్‌ ప్రదర్శన ఇస్తాడు. సంగీతకారుడు బాబా శ్రింప్స్‌తో కలిసి పాటలు పాడతాడు. స్పాటిఫై లాంటి పాటల స్ట్రీమింగ్‌ యాప్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్‌పై పరంగానూ ముందుంటాడు. ట్రెండ్‌కు అనుగుణంగా దుస్తులు ధరిస్తాడు. ఎన్‌బీసీˆ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీలో కనిపించాడు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ రూపొందిస్తున్న 100మీ. సిరీస్‌లోనూ మెరవబోతున్నాడు. లైల్స్‌కు కామిక్‌ పుస్తకాలు, యానిమేషన్‌ సిరీస్‌లు అన్నా ఇష్టమే. 

బోల్ట్‌ బాటలో..

పరుగు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉసేన్‌ బోల్ట్‌. ఒలింపిక్స్‌ అయినా ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ అయినా ఈ కరీబియన్‌ వీరుడు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ట్రాక్‌పై చిరుతలా పరుగెడుతూ.. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 11 స్వర్ణాలు, ఒలింపిక్స్‌లో 8 బంగారు పతకాలు గెలిచాడు. కానీ 2017లో ట్రాక్‌కు వీడ్కోలు పలికినప్పటి నుంచి బోల్ట్‌ స్థానాన్ని భర్తీ చేసే పరుగు వీరుడు ఎవరంటూ ప్రపంచం ఎదురు చూసింది. ఇప్పుడు తానున్నానంటూ నోవా లైల్స్‌ వచ్చాడు. బోల్ట్‌లా ట్రాక్‌పై దూసుకెళ్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. బోల్ట్‌ రిటైరవడానికి ముందే ప్రొఫెషనల్‌ కెరీర్‌ మొదలెట్టిన లైల్స్‌.. ఇప్పుడు అత్యుత్తమ సాౖయికి చేరుకున్నాడు. 2020లో బోల్ట్‌ పేరు మీద ఉన్న 200మీ. ప్రపంచ రికార్డు (19.19సె)ను లైల్స్‌ బద్దలు కొట్టినట్లే కనిపించింది. కానీ ఆ తర్వాత నిర్వాహకుల పొరపాటు కారణంగా అతను 185 మీటర్లే పరుగెత్తాడని తేలింది. వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ 100మీ, 200మీ.పరుగులో ఛాంపియన్‌గా నిలవాలన్నది అతని లక్ష్యం. 2020 టోక్యో ఒలింపిక్స్‌ 200మీ.పరుగులో లైల్స్‌ కాంస్యం నెగ్గాడు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని