Simone Biles: పడి లేచిన కెరటం.. సిమోన్‌ బైల్స్‌

ఒలింపిక్స్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలో దిగిందా అమ్మాయి.. ప్రతి ఈవెంట్లోనూ ఆమెదే స్వర్ణం అన్న ధీమా కనిపించింది. కానీ మానసిక ఆందోళన కారణాన్ని చూపుతూ దాదాపు అన్ని ఈవెంట్ల నుంచి వైదొలిగింది.

Updated : 29 Aug 2023 11:31 IST

మూడేళ్ల క్రితం మాట..

ఒలింపిక్స్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలో దిగిందా అమ్మాయి.. ప్రతి ఈవెంట్లోనూ ఆమెదే స్వర్ణం అన్న ధీమా కనిపించింది. కానీ మానసిక ఆందోళన కారణాన్ని చూపుతూ దాదాపు అన్ని ఈవెంట్ల నుంచి వైదొలిగింది. కేవలం ఒకే ఒక్క కాంస్యంతో నిరాశగా నిష్క్రమించింది. ఇక ఈ అమ్మాయి పనైపోయింది. మళ్లీ కనిపించడం కష్టమే అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. కానీ మానసిక స్థైర్యం కోల్పోయినా.. ఆటకు దూరమైనా మళ్లీ ఆమె లేచింది. ఏకంగా 732 రోజుల విరామం తర్వాత తిరిగొచ్చి మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకుని అదరగొడుతోంది. ఆ సంచలన అథ్లెటే సిమోన్‌ బైల్స్‌ (Simone Biles). అమెరికా జిమ్నాస్ట్‌. 

జిమ్నాస్టిక్స్‌ (Gymnastics) లాంటి ఆటలో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు రెండేళ్లు ఆటకు దూరమై తిరిగి పునరాగమనం చేయడం అంత తేలికేం కాదు. కానీ బైల్స్‌ పట్టుదలగా పోరాడింది. మానసిక ఇబ్బందులు.. శారీరక సమస్యలను దాటి మళ్లీ బరిలో నిలిచింది. ఈ ఏడాది యుఎస్‌ క్లాసిక్‌ టోర్నీలో విజేతగా నిలిచింది. అంతేకాదు యుఎస్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ అదరగొట్టి వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌ ముంగిట ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది.

ట్విస్టీస్‌ అనే మానసిక సమస్య నుంచి కోలుకోవడానికి బైల్స్‌కు చాలారోజులే పట్టింది. ఏదో తెలియని భయంతో ఆమె ఎన్నోసార్లు ఆందోళనకు గురయ్యేదట. గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు.. ఊపిరి ఆడనట్లు ఫీల్‌ అయ్యేది. గాల్లో ఎగిరితే ప్రాణాలే పోతాయా అన్నట్లు భయపడేది. జిమ్నాస్టిక్స్‌ అనే పదం వింటేనే వణికిపోయేది. ఈ సమస్యను జయించడానికి ఈ అమెరికా స్టార్‌ మానసిక వైద్య నిపుణుల దగ్గర చికిత్స తీసుకుంది. సెరిబ్రల్‌ అనే యాప్‌ని వాడుతూ ఎప్పటికప్పుడు తన మానసిక పరిస్థితిపై అంచనాకు వచ్చేది. కోచ్‌ లారెంట్‌ పర్యవేక్షణలో ట్రాంపోలిన్‌పై గెంతుతూ ఒత్తిడిని తగ్గించుకునేది. 

ఈ ఏడాది మేలో ఎన్‌ఎఫ్‌ఎల్‌ స్టార్‌ జొనాథన్‌ ఓవెన్స్‌ను బైల్స్‌ పెళ్లాడడంతో ఈ అమెరికా తార ఇక ఆటకు గుడ్‌బై చెబుతుందా అనుకున్నారు. కానీ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ రెండేళ్ల విరామం తర్వాత యుఎస్‌ క్లాసిక్‌ టోర్నీలో అడుగుపెట్టింది. అయితే పోటీకి దిగినప్పుడు ఉద్విగ్న క్షణాలను ఎదుర్కొంది. మళ్లీ మానసిక ఆందోళన వెంటాడుతుందేమోనని భయపడింది. కానీ పోటీలో దిగాక లక్ష్యం మీదే దృష్టి పెట్టి మునుపటి ఫామ్‌ అందుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు బైల్స్‌ లక్ష్యం 2024 పారిస్‌ ఒలింపిక్స్‌పైనే ఉంది. టోక్యోలో పతకాల వెలితిని పారిస్‌లో తీర్చుకోవాలనే సంకల్పంతో బైల్స్‌ సిద్ధమవుతోంది. 32 ఒలింపిక్స్, ప్రపంచ పతకాలు ఖాతాలో ఉన్న బైల్స్‌.. పారిస్‌లోనూ వీలైనన్ని ఈవెంట్లలో బరిలో దిగి తన ముద్ర వేయాలనే సంకల్పంతో ఉంది. అయితే రియో ఒలింపిక్స్‌లో మాదిరిగా పారిస్‌ ఒలింపిక్స్‌లో వాల్ట్, ఫ్లోర్, ఆల్‌రౌండ్‌ విభాగాల్లో స్వర్ణాలు గెలవడం 26 ఏళ్ల బైల్స్‌కు తేలిక కాకపోవచ్చు. ఎందుకంటే ఆమె వయసు పెరిగింది.. ప్రత్యర్థులూ పెరిగారు. ఈ స్థితిలో పారిస్‌లో మునుపటి స్థాయిలో మెరవాలంటే బైల్స్‌ పూర్తి సామర్థ్యంతో రాణించాల్సి ఉంటుంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని