Mitchell Marsh: మార్ష్.. మారిపోయాడు.. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా మొదలుపెట్టి ఓపెనర్‌గా వీరవిహారం

క్రికెట్ చరిత్రలో కొందరు ఆటగాళ్ల ప్రస్థానం చిత్రంగా ఉంటుంది. బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా, మిడిలార్డర్ బ్యాటర్లుగా ప్రయాణం మొదలుపెట్టే ఆ క్రికెటర్లు.. తర్వాత టాప్ ఆర్డర్లోకి వచ్చి బ్యాటింగ్‌లో చెలరేగిపోతుంటారు. చివరికి స్టార్ బ్యాటర్లుగా రూపాంతరం చెందుతారు. ఈ జాబితాలోకి చేరిన మరో ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh).

Updated : 22 Oct 2023 15:13 IST

క్రికెట్ చరిత్రలో కొందరు ఆటగాళ్ల ప్రస్థానం చిత్రంగా ఉంటుంది. బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా, మిడిలార్డర్ బ్యాటర్లుగా ప్రయాణం మొదలుపెట్టే ఆ క్రికెటర్లు.. తర్వాత టాప్ ఆర్డర్లోకి వచ్చి బ్యాటింగ్‌లో చెలరేగిపోతుంటారు. చివరికి స్టార్ బ్యాటర్లుగా రూపాంతరం చెందుతారు. ఈ జాబితాలోకి చేరిన మరో ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh). ఒకప్పుడు ప్రధానంగా బౌలర్‌గా కొనసాగుతూ.. మిడిలార్డర్లో అప్పుడప్పుడూ కాస్త బ్యాటింగ్ చేసేవాడీ ఆల్‌రౌండర్. కానీ ఇప్పుడు బౌలింగ్ కూడా పక్కన పెట్టేసి ఆస్ట్రేలియా జట్టు ప్రధాన బ్యాటర్లలో ఒకడిగా మారిపోయాడు.

సనత్ జయసూర్య, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్.. ఈ ఆటగాళ్లందరూ మొదట బౌలింగ్ ఆల్‌రౌండర్లుగానే జట్టులోకి వచ్చారు. జయసూర్య, స్టీవ్ స్మిత్ ఇద్దరూ కూడా కెరీర్ ఆరంభంలో లోయర్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం గమనార్హం. కెరీర్ ఆరంభంలో వారిని కొంత బ్యాటింగ్ కూడా చేయగల ఉపయుక్తమైన స్పిన్నర్లుగానే చూశాయి ఆయా జట్లు. కానీ తమ బ్యాటింగ్ ప్రతిభతో టాప్ ఆర్డర్లో అవకాశం దక్కించుకుని మేటి బ్యాటర్లుగా పేరు తెచ్చుకున్నారు. వాట్సన్ సైతం మొదట్లో మిడిలార్డర్ బ్యాటరే. కానీ తర్వాత ఓపెనర్‌గా వీరవిహారం చేశాడు. కెరీర్ ముందుకు సాగేకొద్దీ వీళ్లు బౌలింగ్ పక్కన పెట్టేశారు. ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం మిడిలార్డర్ బ్యాటర్‌గానే కెరీర్‌ను ఆరంభించాడు. అప్పట్లో అతను స్పిన్ బౌలింగ్ కూడా వేసేవాడు. కానీ ఓపెనింగ్‌లోకి వచ్చాకే అతడి దశ తిరిగింది. ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. మిచెల్ మార్ష్ సైతం ఆల్‌రౌండర్‌గా, మిడిలార్డర్ బ్యాటర్‌గా కెరీర్ ఆరంభించి ఇప్పుడు ఓపెనర్‌గా స్థిరపడిపోయాడు. ఈ మధ్య అతను పెద్దగా బౌలింగే చేయట్లేదు.

బెంగ తీర్చేశాడు..

శుక్రవారం పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ ఎలా చెలరేగిపోయాడో తెలిసిందే. 108 బంతుల్లో 121 పరుగులు చేసిన మార్ష్ ఏకంగా తొమ్మిది సిక్సర్లు, పది ఫోర్లు బాదాడు. గత మ్యాచ్‌లో శ్రీలంక మీదా అతను చక్కటి అర్ధశతకం సాధించాడు. ప్రపంచకప్ ముంగిట భారత్‌తో వన్డే సిరీస్‌లోనూ ఓ మ్యాచ్‌లో 96 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. చాలా ఏళ్ల పాటు ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్లలో ఆరోన్ ఫించ్ ఓపెనర్‌గా ఉన్నాడు. అతను గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత జోష్ ఫిలిప్, మెక్‌డెర్మాట్ లాంటి స్పెషలిస్టు ఓపెనర్లను వార్నర్‌కు తోడుగా ఆడించి చూసింది ఆసీస్. కానీ వాళ్లెవ్వరూ ఆ స్థానంలో కుదురుకోలేదు. దీంతో మిచెల్ మార్ష్‌ను ప్రయత్నించి చూశారు. అతను ఆ స్థానంలో బాగానే కుదురుకుని ఓపెనింగ్ విషయంలో జట్టు బెంగ తీర్చాడు. దూకుడుగా ఆడుతూ, మెరుపు ఆరంభాలనిస్తూ జట్టుకు ప్రయోజనం చేకూరుస్తున్నాడు. అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో అతను ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. తర్వాత టాప్ ఆర్డర్‌కు మారాడు. కొంత కాలం 3-4 స్థానాల్లో ఆడి, ఓపెనర్‌గా ప్రమోటయ్యాడు. ఇప్పుడు ఆ స్థానంలోనే స్థిరపడ్డాడు. బ్యాటింగ్‌లో కీలకంగా మారిన మార్ష్‌ను ఈ మధ్య బౌలింగ్‌లో ఆసీస్ పెద్దగా ఉపయోగించుకోవట్లేదు. జట్టులో కావాల్సినన్ని బౌలింగ్ ప్రత్యామ్నాయాలు ఉండటంతో మార్ష్ అవసరం పడట్లేదు. అతను ఆల్‌రౌండర్ పాత్ర నుంచి స్పెషలిస్టు బ్యాటర్ రోల్‌లోకి మారిపోయాడు.

ప్రపంచకప్ హీరో

ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు జెఫ్ మార్ష్ ఇద్దరు తనయుల్లో ఒకడు మిచెల్ మార్ష్. అతడి అన్నయ్య షాన్ మార్ష్ సైతం కొన్నేళ్లు ఆస్ట్ర్రేలియా జట్టుకు ఆడాడు. ఐపీఎల్‌లోనూ అతను కొన్నేళ్లు పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఐతే మిచెల్ మార్ష్ మాత్రం చాలా ఏళ్లుగా ఆస్ట్రేలియా జట్టులో కీలకంగా ఉంటున్నాడు. అతను 2015 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. ఇక 2021లో ఆసీస్ టీ20 ప్రపంచకప్ గెలిచిందంటే అందుకు అతనే కారణం. న్యూజిలాండ్‌తో ఫైనల్లో 77 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌తో 173 పరుగుల ఛేదనలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఫైనల్లో అతనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’. మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా 2010 అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. ఐతే జాతీయ జట్టు తరఫున తనదైన ముద్ర వేసిన మిచెల్.. ఐపీఎల్‌లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. అండర్-19 ప్రపంచకప్ మెరుపులతో 2010లోనే అతను డెక్కన్ ఛార్జర్స్ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. తర్వాత పుణె వారియర్స్, పుణె సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్, దిల్లీ క్యాపిటల్స్.. ఇలా పలు జట్లకు మారాడు. కానీ ఏ జట్టు తరఫునా పెద్దగా రాణించలేకపోయాడు. ప్రస్తుతం అతను దిల్లీ జట్టకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్లో ఓ మోస్తరుగా రాణించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో సూపర్ ఫామ్‌లో ఉన్న మిచెల్.. ప్రపంచకప్‌లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తాడేమో చూడాలి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు