England: ఇంగ్లాండ్ జట్టులో ముసలం?ప్రపంచకప్ ఘోర వైఫల్యంతో మొదలైన రచ్చ

ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ (England) ఘోర ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి ఒకే దాంట్లోనే విజయం సాధించి సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఘోర వైఫల్యంపై ప్రత్యేక కథనం..

Updated : 30 Oct 2023 18:39 IST

ఎనిమిదేళ్ల ముందు ఇంగ్లాండ్ జట్టు (England Cricket Team) వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేసింది. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడి నాకౌట్ చేరకుండానే నిష్క్రమించింది. శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి బలహీన జట్ల చేతిలో కూడా ఇంగ్లాండ్ ఓటములు చవిచూసింది. కానీ అప్పుడు ఇంగ్లిష్ జట్టు వైఫల్యం గురించి పెద్ద చర్చేమీ లేదు. ఎందుకంటే అదేమీ టైటిల్ ఫేవరెట్లలో ఒకటి కాదు. దాన్నొక సాధారణ జట్టులాగే చూశారందరూ. బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోతే దాన్నో సంచలనంలా కూడా భావించలేదు. కానీ వర్తమానంలోకి వస్తే.. ఇంగ్లాండ్ జట్టు ప్రతి ఓటమీ ఒక షాకే. ఆ జట్టు ఘోర వైఫల్యం అనూహ్యమే. ఓడటం కంటే ఓడిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక అంచనాలతో బరిలోకి దిగి అత్యంత పేలవ ప్రదర్శన చేసిన జట్టుగా నిలవబోతున్న ఇంగ్లాండ్.. ఈ దెబ్బ నుంచి కోలుకోవడం చాలా కష్టంగానే అనిపిస్తోంది.

సునీల్ గావస్కర్ సహా ఎంతోమంది దిగ్గజాలు, మాజీలు, విశ్లేషకులు.. ఇంగ్లాండ్‌ మరోసారి ప్రపంచకప్ గెలవబోతోందని బల్లగుద్ది చెప్పారు. 2015 ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత వన్డేలు ఆడే తీరునే పూర్తిగా మార్చేసి, దూకుడుకు మారు పేరుగా తయారైన ఇంగ్లిష్ జట్టు.. నాలుగేళ్లు తిరిగేసరికి ఎంత బలంగా తయారైందో తెలిసిందే. విధ్వంసక బ్యాటర్లు, నాణ్యమైన ఆల్‌రౌండర్లు, మేటి బౌలర్లతో నిండిన ఆ జట్టు 2019లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో తొలిసారి విజేతగా నిలిచింది. గత నాలుగేళ్లలో ఇంగ్లాండ్ ప్రదర్శన చూశాక మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా ఎక్కువమంది పరిగణించారు. సొంతగడ్డపై భారత్ కూడా టైటిల్‌కు బలమైన పోటీదారే అయినా.. కప్పు దారిలో ప్రధాన అడ్డంకి ఇంగ్లాండే అవుతుందన్న అంచనాలు కలిగాయి. సెమీస్ లేదా ఫైనల్లో ఇంగ్లాండ్ ఎదురైతే మన జట్టు తట్టుకోగలదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఎందుకంటే గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన భారత్.. ఇంగ్లాండ్ చేతిలో ఏకంగా పది వికెట్ల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

అందుకే ఆ జట్టు నుంచి మళ్లీ ముప్పు తప్పదేమో అన్న భయాలు కలిగాయి. కానీ భారత జట్టుతో లీగ్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ ఓడిన తీరు చూస్తే జాలి కలిగి ఉంటుంది. అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడి పూర్తిగా ఆత్మవిశ్వాసం దెబ్బ స్థితిలో భారత్‌‌తో పోరులో అయినా మెరుగైన ప్రదర్శన చేసి పుంజుకునే ప్రయత్నం చేస్తుందనుకుంటే.. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. 230 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదిస్తూ 100 పరుగుల తేడాతో ఓడటం అంటే డిఫెండింగ్ ఛాంపియన్‌కు అంతకంటే పరాభవం లేదు. ఇప్పటికే అఫ్గానిస్థాన్, శ్రీలంక లాంటి బలహీన జట్ల చేతిలో ఓడి అవమాన భారాన్ని మోస్తున్న జట్టును ఈ ఓటమి మరింత కుంగదీస్తుందనడంలో సందేహం లేదు. ఇక టోర్నీలో ఆ జట్టు సాంకేతికంగా మాత్రమే ఉన్నట్లు లెక్క. ఇప్పుడా జట్టున్న స్థితిలో నామమాత్రమైన చివరి మూడు మ్యాచ్‌ల్లో అయినా మెరుగైన ప్రదర్శన చేస్తుందా అన్నది సందేహమే.

అదీ ఇదీ ఒకే జట్టా?

టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఇంగ్లాండ్ జట్టు కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అయితే ఆ జట్టు దూకుడు మామూలుగా లేదు. 2019లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లాండ్.. నిరుడు టీ20 ప్రపంచకప్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ అంటే ప్రత్యర్థులు ముందే జావగారిపోయే పరిస్థితి. ఆటలో ఆ జట్టు దూకుడు అలా ఉండేది. మిగతా జట్లకు ఇంగ్లాండ్‌కు తేడా ఏంటంటే.. ఆ జట్టులో కింది వరుసలోనూ బాగా బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లుంటారు. బౌలర్లు కూడా 40-50 పరుగులు చేయగల సమర్థులే. అదే సమయంలో బౌలింగ్ చేయడానికి ఆరేడుగురు సిద్ధంగా ఉంటారు. బ్యాటింగ్‌లో అయినా, బౌలింగ్‌లో అయినా ఒకరు పోతే ఇంకొకరు అన్నట్లు బోలెడన్ని ప్రత్యామ్నాయాలుండేవి. అందుకే ఆరంభం నుంచి ప్రతి బ్యాటర్ బాదుడే బాదుడు అన్నట్లు ఆడేవాళ్లు.

మలన్, బెయిర్‌స్టో, రూట్, బ్రూక్, బట్లర్, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ.. ఇలా ఎంతకీ తరగని బ్యాటింగ్ బలం ఆ జట్టుది. వీళ్లు చాలదన్నట్లు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మరీ ప్రపంచకప్ కోసం జట్టులోకి వచ్చాడు స్టోక్స్. వుడ్, వోక్స్, విల్లీ, టాప్లీ, సామ్ కరన్, అట్కిన్సన్, రషీద్, లివింగ్‌స్టన్, అలీ.. ఇలా బౌలింగ్‌లోనూ ఎన్నో ఆప్షన్లు. ఇలాంటి ఆల్‌రౌండ్ బలం మరే జట్టుకూ లేదు. ప్రపంచకప్‌కు ముందు ఆ జట్టు ఫామ్ కూడా బాగుంది. న్యూజిలాండ్‌ను వన్డే సిరీస్‌లో ఓడించి టోర్నీలో అడుగు పెట్టింది. అందుకే టోర్నీలో ఆ జట్టును హాట్ ఫేవరెట్‌గా పేర్కొన్నారు. కానీ మొన్నటిదాకా అదరగొడుతున్న జట్టు అనూహ్యంగా ప్రపంచకప్‌లో ఘోరమైన ప్రదర్శన చేసింది. ఉన్నట్లుండి ఆ జట్టు ప్రదర్శన ఇంతలా ఎలా పడిపోయిందో ఎవరికీ అర్థం కావడం లేదు.

జట్టులో లుకలుకలు?

ప్రపంచకప్‌లో ఇంత భారీ అంచనాలతో బరిలోకి దిగి ఇంత ఘోరమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్‌లో కలకలం రేగుతోంది. నాలుగేళ్ల కిందట ఇంగ్లాండ్ ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి ఆ జట్టు మాజీలు, మీడియా వాళ్ల అతి మామూలుగా లేదు. మైకేల్ వాన్ లాంటి వాళ్లు సామాజిక మాధ్యమాల్లో చేసే హడావుడి మామూలుగా ఉండేది కాదు. ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిన ప్రత్యర్థులను హేళన చేయడం ఆ జట్టు మద్దతుదారులకు అలవాటే. ప్రపంచకప్‌లో ఇంత ఘోరంగా ఆడుతున్నా సరే.. నిన్నటి మ్యాచ్‌లో కోహ్లి డకౌటైతే బాతు ఫొటోకు అతడి తల అతికించి మార్నింగ్‌ వాక్‌కు వెళ్తున్నాడు అంటూ వెటకారంగా ఒక పోస్టు పెట్టింది ఇంగ్లాండ్ ఆర్మీ అనే వెరిఫైడ్ హ్యాండిల్లో. కానీ తర్వాత రూట్ డకౌటైతే మన వాళ్లు రివర్స్ పంచ్‌లు గట్టిగానే ఇచ్చారు. ప్రపంచకప్ ఘోర వైఫల్యం నేపథ్యంలో వాన్ సహా ఇంగ్లాండ్ మద్దతుదారులు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది.

మాజీలు, మీడియా వాళ్లు జట్టును ఏకిపడేస్తున్నారు. 2019లో ఇంగ్లాండ్‌ను విజేతగా నిలిపిన మాజీ కెప్టెన్ మోర్గాన్ అయితే.. ప్రస్తుత జట్టులో లుకలుకలున్నాయన్నట్లు మాట్లాడాడు. డ్రెస్సింగ్ రూంలో ఏదో తేడా జరుగుతోందని అతను వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల మధ్య అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయని, సమష్టిగా ఆడట్లేదని మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఆల్‌రౌండర్ లివింగ్‌స్టన్, జట్టు కోచ్ ఈ వార్తలను ఖండించినప్పటికీ.. ఆ జట్టులో అంతా సవ్యంగా లేదనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ప్రపంచకప్ తర్వాత జట్టు ప్రక్షాళన దిశగా ఇంగ్లాండ్ బోర్డు చర్యలకు దిగే అవకాశాలు కూడా లేకపోలేదు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని