Pole vault: బుబ్కా వారసుడొచ్చాడు.. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న డుప్లాంటిస్‌

పోల్‌వాల్ట్‌ (Pole vault) అనగానే గుర్తొచ్చే పేరు సెర్గీ బుబ్కా (Sergey Bubka)! ఆ ఆటలో అనితర సాధ్యమైన ఎన్నో రికార్డులను నెలకొల్పాడతను. తన రికార్డులను తానే బ్రేక్‌ చేస్తూ చివరికి బోర్‌ కొట్టేసి రిటైర్‌ అయిపోయాడు. బుబ్కా తర్వాత ఈ ఆటలో అంతటి సత్తా ఉన్న ఆటగాడు మరొకరు కనబడలేదు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత బుబ్కా బాటలోనే ఒకడొచ్చాడు. 

Updated : 22 Sep 2023 12:34 IST

పోల్‌వాల్ట్‌ (Pole vault) అనగానే గుర్తొచ్చే పేరు సెర్గీ బుబ్కా (Sergey Bubka)! ఆ ఆటలో అనితర సాధ్యమైన ఎన్నో రికార్డులను నెలకొల్పాడతను. తన రికార్డులను తానే బ్రేక్‌ చేస్తూ చివరికి బోర్‌ కొట్టేసి రిటైర్‌ అయిపోయాడు. బుబ్కా తర్వాత ఈ ఆటలో అంతటి సత్తా ఉన్న ఆటగాడు మరొకరు కనబడలేదు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత బుబ్కా బాటలోనే మరో అథ్లెట్ వచ్చాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ బుబ్కా వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ కుర్రాడే ఆర్నాండ్‌ డుప్లాంటిస్‌ (Armand Duplantis). స్వీడన్‌ సంచలన పోల్‌వాల్టర్‌. తాజాగా పెర్ఫాన్‌టైన్‌ క్లాసిక్‌ టోర్నీలో మరోసారి ప్రపంచరికార్డుతో వార్తల్లోకెక్కాడు. అతడి వయసు 23 ఏళ్లే.. కానీ, ఏడు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. దీన్ని బట్టి డుప్లాంటిస్‌ సత్తా ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. 

క్రీడల నేపథ్యం

డుప్లాంటిస్‌ది క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం. అందుకే అతడు త్వరగా మైదానానికి ఆకర్షితుడయ్యాడు. డుప్లాంటిస్‌ నాన్న గ్రెగ్‌ కూడా పోల్‌వాల్ట్‌ ప్లేయరే. అమ్మ హెలెనా హెప్టాథ్లెట్‌. వీరి ఇంటి వెనుకే పోల్‌వాల్ట్‌ ఆడటానికి ఏర్పాటు ఉండేది. దీంతో మూడేళ్ల వయసులోనే డుప్లాంటిస్‌ ఈ ఆటపై మనసు పడ్డాడు. అప్పటి నుంచి ఆ ఆటను వదల్లేదు. నాన్నే అతడికి కోచ్‌. అమ్మ, నాన్న ఇద్దరూ అథ్లెట్లే కావడంతో అతడు త్వరగా ఆ ఆటలో రాటు దేలాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్‌ పోల్‌వాల్టర్‌ రెనాల్డ్‌ రెవాలైన్‌ వీడియోలను గంటల కొద్దీ చూసేవాడు. 

అమెరికా నుంచి స్వీడన్‌కు

డుప్లాంటిస్‌ తండ్రిది అమెరికా.. తల్లిది స్వీడన్‌. అతడు పెరిగింది అమెరికాలోనే అయినా పోల్‌వాల్ట్‌లో స్వీడన్‌కే ప్రాతినిధ్యం  వహించాడు. స్థానిక ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ క్లబ్‌లో చేరి పోల్‌వాల్ట్‌ నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. జూనియర్‌ స్థాయిలో 2015 ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్, 2017 ఐరోపా ఛాంపియన్‌షిప్, 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి డుప్లాంటిస్‌ తన రాకను ఘనంగా చాటాడు. అయితే సీనియర్‌ స్థాయిలో 2017 పోటీపడినా ఒత్తిడిలో రాణించలేకపోయాడు. ఈ అనుభవం అతడిని మరింత రాటుదేల్చింది. 

మలుపు తిప్పిన 2020

డుప్లాంటిస్‌ కెరీర్‌లో 2020 పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. ఆ ఏడాది ఫిబ్రవరిలో పోలండ్‌లో జరిగిన ఈవెంట్లో 6.17 మీటర్ల ఎత్తు ఎగిరి ఆరేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు ఈ స్వీడన్‌ కుర్రాడు. తన ఆరాధ్య ఆటగాడు రెనాల్డ్‌ సృష్టించిన రికార్డునే అతడు బద్దలు కొట్టడం విశేషం. ఇక అక్కడ నుంచి డుప్లాంటిస్‌ జైత్రయాత్ర మొదలైంది. రికార్డుల వేట షురూ అయింది. వారం వ్యవధిలోనే పోలండ్‌ ఈవెంట్లో 6.18 మీటర్లు ఎగిరి తన రికార్డును తానే బద్దలుకొట్టాడు. ఆ తర్వాత ఔట్‌డోర్‌ ఈవెంట్లో 6.15 మీటర్లు ఎగిరి దిగ్గజ ఆటగాడు సెర్గీ బుబ్కా (6.14 మీ) ప్రపంచ రికార్డును తుడిచి పెట్టాడు. అప్పటి నుంచి డుప్లాంటిస్‌ తన రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తున్నాడు. 

పారిస్‌పైనే దృష్టి

2022లోనే అతడు 22 సార్లు 6 మీటర్లను అందుకున్నాడంటేనే పోల్‌వాల్ట్‌లో డుప్లాంటిస్‌ ఆధిపత్యాన్ని ఊహించొచ్చు. 6 మీటర్లను ఇన్నిసార్లు అందుకోవడం బుబ్కాకు కూడా సాధ్యం కాలేదు. యూజీన్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన ఈ పోల్‌వాల్ట్‌ స్టార్‌.. వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో పసిడి పతకంపై కన్నేశాడు. ‘‘ఇన్ని రికార్డులు నా ఖాతాలో ఉన్నాయని ఎప్పుడూ గర్వపడను. పోటీకి దిగిన ప్రతిసారి నేనేంటో చూపిద్దామనే అనుకుంటా. గత ప్రదర్శనను మించి రాణించాలని ప్రయత్నిస్తా. అందుకే ఎవరికీ సాధ్యం కాని ఘనతలను సొంతం చేసుకోగలుగుతున్నా’’ అని డుప్లాంటిస్‌ చెప్పాడు. ఈ కుర్రాడు ఇదే జోరుతో దూసుకెళ్తే మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం.

           -  ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు