Novak Djokovic: బంతి చెప్పిన టెన్నిస్‌ యోధుడి కథ... అతనే రికార్డుల రారాజు జకోవిచ్‌

వయసు మీద పడుతున్నా.. అలసట దరి చేరుతున్నా.. అలుపన్నదే లేదన్నట్లు టైటిళ్ల వేటలో సాగుతున్నాడు నొవాక్‌ జకోవిచ్‌ (Novak Djokovic). 

Published : 14 Sep 2023 14:11 IST

హల్లో.. నమస్కారం. అందరూ బాగున్నారా? నేను.. టెన్నిస్‌ బంతిని. కోర్టులో ప్లేయర్ల రాకెట్లతో దెబ్బలు తినాల్సిన నేను.. ఇలా ఎందుకు వచ్చానని అనుకుంటున్నారా? మీకు ఓ యోధుడి కథ చెబుదామని ఇలా వచ్చా. కాసేపు నాకు కూడా బాదించుకునే బాధ తప్పడంతో పాటు మీకు కూడా ఓ వీరుడి గురించి తెలుసుకున్నట్లు ఉంటుందని అనుకుంటున్నా. నా జీవితంలో ఎంతో మంది దిగ్గజాలను చూశా. మార్గరెట్‌ కోర్ట్, పీట్‌ సంప్రాస్, స్టెఫీ గ్రాఫ్, సెరెనా విలియమ్స్, ఫెదరర్, నాదల్‌.. ఇలా ఎంతోమంది అత్యుత్తమ ఆటతో అదరగొట్టారు. అద్భుత విజయాలతో శిఖరాలకు చేరారు. తమ ఆటతో టెన్నిస్‌కే ఆకర్షణ తెచ్చారు. కానీ, ఇప్పుడు నేను చెప్పబోయే ఆటగాడు మాత్రం వేరు. అతను.. ఈ దిగ్గజాలకే దిగ్గజం. మొనగాళ్లకే మొనగాడు. వయసు మీద పడుతున్నా.. అలసట దరి చేరుతున్నా.. అలుపన్నదే లేదన్నట్లు టైటిళ్ల వేటలో సాగుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో.. ఓపెన్‌ శకంలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా అందనంత ఎత్తులో నిలబడ్డాడు. అతనే.. నొవాక్‌ జకోవిచ్‌ (Novak Djokovic). అతని గురించి మీకు చెబుతుండటం నాకు దక్కిన అదృష్టం. 

దిగ్గజాలను దాటి..

టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ కావాలని, గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలవాలనే కలతో సెర్బియా నుంచి జకోవిచ్‌ వచ్చాడు. ఆటలో అడుగుపెట్టాడు. గ్రాండ్‌స్లామ్‌తో అరంగేట్రం చేశాడు. విజయాలు సాధించడం మొదలెట్టాడు. కల నెరవేర్చుకున్నాడు. కానీ అక్కడితో ఆగిపోలేదు. చరిత్ర సృష్టించాలని వెంటపడ్డాడు. గెలిచాడు.. సాధించాడు. కానీ అలసిపోలేదు. ఇప్పుడు ఆ చరిత్రే అతని వెనుకాల పడుతోంది. జకోవిచ్‌లా ఎదగాలని ఎంతో మంది కలకంటున్నారు. కానీ, ఈ స్థాయికి చేరడానికి జకోవిచ్‌ ఎంతో కష్టపడ్డాడు. అప్పటికే ఆటలో స్టార్‌ ఆటగాడిగా కొనసాగుతున్న రోజర్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌), సంచలనాలు సృష్టిస్తున్న రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఉన్నారు. జకోవిచ్‌ గ్రాండ్‌స్లామ్‌లో అడుగుపెట్టే సమయానికి ఫెదరర్, నాదల్‌దే టెన్నిస్‌ కోర్టులో ఆధిపత్యం. ఆ తర్వాత కూడా కొంతకాలం పాటు వీళ్లిద్దరి జోరే సాగింది. ఆరంభంలో వీరితో తలపడి జకోవిచ్‌ ఓడిపోయాడు. అయినా, నిరాశ చెందలేదు. నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకున్నాడు. ఆ దిగ్గజాలపైనే విజయం సాధించే స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లలో ఆ ఇద్దరినీ ఎప్పుడో వెనక్కి నెట్టిన అతను.. టెన్నిస్‌ మహారాజులా వెలుగొందుతున్నాడు. 2005లో జకోవిచ్‌ గ్రాండ్‌స్లామ్‌ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 72 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు జరిగాయి. అందులో 24 టైటిళ్లు అంటే మూడో వంతు జకోవిచ్‌ ఖాతాలోనే చేరాయంటే ఆటలో అతని ఆధిపత్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లలో మార్గరెట్‌ కోర్ట్‌ (24)తో కలిసి జకో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా సెరెనా (23), స్టెఫీ గ్రాఫ్‌ (22), నాదల్‌ (22), ఫెదరర్‌ (20) ఉన్నారు. 13 టైటిళ్లను మార్గరెట్‌ అమెచ్యూర్‌ శకం (1968 కంటే ముందు)లో సాధించింది. దీంతో ఓపెన్‌ శకం (1968 తర్వాత)లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా జకో నిలిచాడు.

నచ్చిందే చేస్తాడు..  

కోర్టులో విజయాల కోసం ఎంతగానో పోరాడే జకోవిచ్‌ తనకు నచ్చిందే చేస్తాడు. ఎవరేం చెప్పినా వినడు. చివరకు టోర్నీలకు దూరమయ్యే పరిస్థితి వచ్చినా మనసు మార్చుకోడు. కరోనా టీకా వేసుకోని కారణంగా నిరుడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్, యుఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. ముఖ్యంగా తన అడ్డా అయిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో 2019 నుంచి 2021 వరకు వరుసగా అతనే ఛాంపియన్‌. 2022లో ఆడితే తప్పకుండా టైటిల్‌ గెలిచేవాడే! కరోనా టీకా వేసుకోలేదని అతణ్ని ఆస్ట్రేలియా విమానాశ్రయంలోనే అడ్డుకుని వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆడకపోవడంతో రికార్డు స్థాయిలో 373 వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగిన అతను ఆ ర్యాంకు కూడా కోల్పోయాడు. అలాగే యుఎస్‌ ఓపెన్‌లోనూ టైటిల్‌ గెలిచే అవకాశాన్ని దూరం చేసుకున్నాడు. ఇవేవీ అతడికి లెక్కే కాదు. తనకు నచ్చింది మాత్రమే చేస్తాడు. ఈ ఏడాది తిరిగి ఆస్ట్రేలియన్‌ ఓపెన్, యుఎస్‌ ఓపెన్‌లో ఆడటమే కాదు టైటిళ్లు గెలిచి సత్తాచాటాడు. జకోవిచ్‌ ఓ ఆల్‌రౌండర్‌. కేవలం ఒక్క ఉపరితలానికే అతను పరిమితం కాలేదు. క్లే, హార్డ్, గ్రాస్‌.. ఇలా అన్ని కోర్టుల్లోనూ ఆధిపత్యం చలాయిస్తున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 10, ఫ్రెంచ్‌ ఓపెన్‌ 3, వింబుల్డన్‌ 7, యుఎస్‌ ఓపెన్‌ 4 సార్లు గెలవడమే అందుకు నిదర్శనం. 36 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన పోరాట పటిమతో యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన అతను.. కనీసం మరో రెండేళ్ల పాటు ఆటలో కొనసాగే అవకాశముంది. ఈ లోపు ఇంకొన్ని టైటిళ్లు గెలిచే ఆస్కారముంది. అప్పటి వరకూ అతని చేతిలో ఓదిగిపోవడమే బంతిగా నేను చేసుకునే పుణ్యం. అతని ఆట చూడటం అభిమానులుగా మీ అదృష్టం.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని