Heinrich Klaasen: స్పిన్‌ను వేటాడేస్తున్నాడు.. ఈ విధ్వంసక బ్యాటర్‌ స్టయిలే వేరు

దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (Heinrich Klaasen) తాజాగా ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో వీర విధ్వంసం సృష్టించాడు. 83 బంతుల్లోనే 174 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Updated : 19 Sep 2023 14:13 IST

లెగ్‌స్పిన్‌ లేదూ ఆఫ్‌స్పిన్‌ లేదూ.. చైనామానూ, రిస్టు స్పిన్నర్లు ఎవరూ పని చేయట్లేదు.. బాదితే బౌండరీనే.. బంతికి చుక్కలే! మెలికలు తిప్పే స్పిన్నర్లనే బాది మ్యాచ్‌లను మలుపులు తిప్పేస్తున్నాడు. అలా అని అతడేం స్టార్‌ బ్యాటర్‌ కాదు.. కోట్ల మంది అనుసరించే క్రికెటరేం కాదు.. తన పని తాను చేసుకుంటూపోతున్న ఓ అండర్‌ రేటెడ్‌ విధ్వంసక బ్యాటర్‌. అతడే హెన్రిచ్‌ క్లాసెన్‌ (Heinrich Klaasen) దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌. తాజాగా ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో వీర విధ్వంసం సృష్టించిన అతడు 83 బంతుల్లోనే 174 పరుగులు చేసి దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు ఉండే భారత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో క్లాసెన్‌ దక్షిణాఫ్రికాకు కీలకం కానున్నాడు.

అందరూ తడబడుతుంటే..

స్పిన్‌ను ఎదుర్కోవడంలో విదేశీ బ్యాటర్లు సాధారణంగా తడబడుతుంటారు. కానీ  దక్షిణాఫ్రికా స్టార్‌ హెన్రీ క్లాసెన్‌ స్టయిలే వేరు. స్పిన్నర్ల బంతులను అప్పడాల్లా నంజుకోవడం అతడికి బాగా ఇష్టం. పిచ్‌పై బంతి పడి తిరిగి తిరగకముందే అందుకుని సిక్సర్‌గా మలచడం మహా ఇష్టం. అరంగేట్రం నుంచి ఇప్పటిదాకా స్పిన్నర్లపై అతడు ఆధిపత్యం చూపిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా (Adam Zampa) బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు. క్లాసెన్‌ దెబ్బకు వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా లూయిస్‌ సరసన నిలవాల్సి వచ్చింది జంపాకి. ఈ ఇన్నింగ్స్‌లో క్లాసెన్‌ 13 సిక్సులు బాదితే అందులో 6 జంపా బౌలింగ్‌లోనే వచ్చాయి. 

చాహల్‌కూ ఇదే అనుభవం

ఆడమ్‌ జంపాను బాదిన ఇదే సెంచూరియన్‌ పిచ్‌ మీద భారత స్టార్‌ లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal)కు కూడా క్లాసెన్‌ చేతిలో గతంలో చేదు అనుభవం ఎదురైంది. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు మెరుగైన ప్రదర్శనే చేసినా.. మన బౌలర్లను కలవరపెట్టిన ఏకైక బ్యాటర్‌ క్లాసనే! పవర్‌ హిట్టింగ్‌తో భారత స్పిన్నర్లపై ఎదురుదాడి చేసిన అతడు రెండో టీ20లో 30 బంతుల్లోనే 69 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో అతడు లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ బౌలింగ్‌లో 12 బంతుల్లోనే 41 పరుగులు పిండుకున్నాడు. ఆ సిరీస్‌ మొదలుకొని స్పిన్నర్ల బౌలింగ్‌లో క్లాసెన్‌ పరుగుల వేట కొనసాగుతోంది. 

ఐపీఎల్‌లోనూ..

హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాటర్‌ క్లాసెన్‌ మెరుపులు ఐపీఎల్‌లోనూ అభిమానులకు పరిచయమే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఈ సీజన్లో అతడు కొన్ని ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ముఖ్యంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై క్లాసెన్‌ ఆడిన 51 బంతుల్లో 104 పరుగుల ఇన్నింగ్స్‌ను అభిమానులు మర్చిపోలేరు. ఈ ఇన్నింగ్స్‌లోనూ అతడు ఎక్కువ పరుగులు స్పిన్నర్ల బౌలింగ్‌లోనే సాధించాడు. స్పిన్నర్లపై ఈ సఫారీ బ్యాటర్‌ ఇంతలా ఆధిపత్యం ఎలా ప్రదర్శించగలుగుతున్నాడు? స్థిరంగా ఎలా రాణించగలుతున్నాడు అంటే దానికి మాజీలు చెప్పే ఏకైక సమాధానం అతడి బలమైన సాంకేతిక ఆట వల్లే అని! క్రీజులో బలంగా నిలవడం.. ఫ్రంట్‌ఫుట్, బ్యాక్‌ఫుట్‌పై ఎలాంటి షాట్లనైనా ఆడడం స్పిన్నర్లను ధీటుగా ఆడేలా చేస్తుంది. ముఖ్యంగా లెగ్‌స్పిన్నర్ల బౌలింగ్‌లో బంతి పడే ముందు క్రీజులో కాస్త వెనక్కి జరిగి బలాన్ని ఉపయోగించి అతడు కొట్టే షాట్లు చూసి తీరాల్సిందే. ఉపఖండ పిచ్‌లపై బ్యాక్‌ఫుట్‌పై అతడు కొట్టే కొన్ని కట్‌షాట్లను చూస్తే ఇతడు విదేశీ బ్యాటరేనా అనే అనుమానం కలగక మానదు. ఇక ఇన్‌సైడ్‌ ఔట్, ర్యాంప్, రివర్స్‌ స్వీప్, స్విచ్‌ హిట్, గోల్ఫ్‌ ఇలా ఒకటేమిటి స్పిన్నర్లపై క్లాసెన్‌ ప్రయోగించే అస్త్రాలెన్నో! ఈ ఏడాది వన్డేల్లో 172.26 స్ట్రెక్‌రేట్తో దూసుకెళ్తున్న క్లాసెన్‌.. స్పిన్నర్ల బౌలింగ్‌లో ప్రతి నాలుగు బంతులకు ఒక బౌండరీ సాధించాడు. అతడు ఇదే జోరు ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తే స్పిన్నర్లకు కష్టమే.

.                         - ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు