Jake Fraser McGurk: వచ్చాడో మెరుపు వీరుడు.. రికార్డు శతకంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఫ్రేజర్‌

క్రికెట్లో రికార్డులు బద్దలు కావడం సహజమే. కానీ అరుదైన రికార్డులు చాలా ఏళ్లు నిలిచి ఉంటాయి. ఏబీ డివిలియర్స్‌  (AB de Villiers) మెరుపు సెంచరీ అలాంటిదే. 2015లో అతడు సృష్టించిన ఆ రికార్డు చాలా ఏళ్లు నిలిచి ఉంటదని అనుకున్నారు కానీ ఓ టీనేజ్‌ కుర్రాడు ఆ రికార్డును తుడిచి పెట్టేశాడు.

Published : 09 Oct 2023 18:18 IST

క్రికెట్లో రికార్డులు బద్దలు కావడం సహజమే. కానీ అరుదైన రికార్డులు చాలా ఏళ్లు నిలిచి ఉంటాయి. ఏబీ డివిలియర్స్‌  (AB de Villiers) మెరుపు సెంచరీ అలాంటిదే. 2015లో అతడు సృష్టించిన ఆ రికార్డు చాలా ఏళ్లు నిలిచి ఉంటుందని అనుకున్నారు కానీ ఓ టీనేజ్‌ కుర్రాడు ఆ రికార్డును తుడిచి పెట్టేశాడు. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేయని ఈ బ్యాటర్‌ ఈ రికార్డును సాధించడమే ఇక్కడి విశేషం. అతడి పేరు జేక్‌ ఫ్రేజర్‌ మెకెర్క్‌ (Jake Fraser-McGurk). 21 ఏళ్ల ఈ ఓపెనర్‌.. రికార్డు శతకంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.

బాదుడే బాదుడు

దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రేజర్‌ టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో సునామీలా విరుచుకుపడ్డాడు. సిక్స్‌లు, ఫోర్లతో దడదడలాడించాడు. ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లోనే అతడి సెంచరీ పూర్తయిందంటే ఫ్రేజర్‌ ఏ స్థాయిలో బ్యాట్‌ ఝుళిపించాడో అర్థం చేసుకోవచ్చు. 18 బంతుల్లో అర్థసెంచరీ చేసిన అతడు.. మరో 11 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. 38 బంతుల్లో 125 పరుగులు... 10 ఫోర్లు, 13 సిక్స్‌లు.. ఇదీ అతడి ఇన్నింగ్స్‌ స్వరూపం. ఇంత వేగంగా ఆడాడు కాబట్టే డివిలియర్స్‌ రికార్డు బద్దలుకొట్టగలిగాడు.

అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడి..

2020లో దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో జాక్‌ ఫ్రేజర్‌ ఆస్ట్రేలియా (Australia) తరఫున ఆడాడు. ఇదే టోర్నీలో ఆసీస్‌ వర్ధమాన ఆటగాళ్లు తన్వీర్‌ సంఘా, టాడ్‌ మార్పీ కూడా బరిలో దిగారు. ఇటీవలే తన్వీర్, టాడ్‌ మార్ఫీ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. కానీ పెద్దగా రాణించలేదు. అయితే ఇంకా అరంగేట్రం చేయకుండానే  ఫ్రేజర్‌ రికార్డు శతకంతో అదరగొట్టాడు. అండర్‌-19 టోర్నీలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫ్రేజర్‌ 97 బంతుల్లో 84 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 4 మ్యాచ్‌ల్లో దాదాపు వంద స్ట్రైక్‌ రేట్‌తో పరుగులు చేశాడు. క్వార్టర్‌ఫైనల్లో భారత్‌ చేతిలో ఆసీస్‌ ఓడిపోవడంతో అక్కడితో ఫ్రేజర్‌ ఆట ఆగింది. 

కోతి గీరిందని..

2020 అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో ఓడినా అయిదో స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌ నుంచి ఓ విచిత్రమైన పరిస్థితిలో ఆఖరి నిమిషంలో ఫ్రేజర్‌ జట్టు నుంచి తప్పుకున్నాడు. కింబర్లేలో ఆస్ట్రేలియా జట్టు ఓ ప్రకృతి వనాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు కోతి గీరడంతో  గాయపడ్డాడు. దీంతో వెస్టిండీస్‌తో ప్లేఆఫ్‌ మ్యాచ్‌తో పాటు టోర్నీ నుంచే వైదొలిగాడు. ఆ తర్వాత పునరాగమనం చేసిన ఫ్రేజర్‌ ఫామ్‌ కొనసాగించాడు. 

ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రంలోనూ మెరిసి

జాక్‌ ఫ్రేజర్‌ 17 ఏళ్ల వయసులో షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. విక్టోరియా తరఫున ఆడుతూ క్వీన్స్‌లాండ్‌పై అర్ధసెంచరీతో మెరిశాడీ కుర్రాడు. ఆ తర్వాత లిస్ట్‌-ఏ అరంగేట్రంలోనూ అర్ధసెంచరీతో సత్తా చాటాడు. సౌత్‌వేల్స్‌తో మ్యాచ్‌లో అతడు 49 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఫ్రేజర్‌ కేవలం బ్యాటర్‌ మాత్రమే కాదు అద్భుతమైన ఫీల్డర్‌ కూడా. బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌కు ఆడుతూ అడిలైడ్‌ స్ట్రైకర్స్‌పై ఓ కళ్లుచెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. ఇదే జోరుతో ఆడితే ఫ్రేజర్‌ను త్వరలోనే ఆసీస్‌ జట్టులో చూడడం ఖాయం.వార్నర్‌ లాంటి సీనియర్లు కెరీర్‌ చరమాంకంలో ఉన్న నేపథ్యంలో ఫ్రేజర్‌ లాంటి మెరుపు వీరుల రాక కంగారూ జట్టుకు శుభ సంకేతమే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని