Dunith Wellalage: ఏకై వచ్చాడు.. మేకైపోయాడు.. శ్రీలంక జట్టులో వెల్లలాగె సంచలనం

శ్రీలంకతో ఆసియా కప్‌లో సూపర్-4 పోరు. పాక్‌తో మ్యాచ్‌లో మాదిరే ఇన్నింగ్స్‌ను ఘనంగా మొదలుపెట్టింది భారత జట్టు. 11 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఇంకేముంది 350 స్కోరు ఖాయం అనుకున్నారంతా. కానీ చివరికి చూస్తే టీమ్ ఇండియా 213 పరుగులకే ఆలౌటైంది. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న భారత ఇన్నింగ్స్‌కు బ్రేకులేసి.. వికెట్లు కాపాడుకోవడానికి, పరుగులు చేయడానికి మన బ్యాటర్లు నానా అవస్థలు పడేలా చేసిన బౌలర్ దునిత్ వెల్లలాగే (Dunith Wellalage).

Published : 13 Sep 2023 17:11 IST

శ్రీలంకతో ఆసియా కప్‌లో సూపర్-4 పోరు. పాక్‌తో మ్యాచ్‌లో మాదిరే ఇన్నింగ్స్‌ను ఘనంగా మొదలుపెట్టింది భారత జట్టు. 11 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఇంకేముంది 350 స్కోరు ఖాయం అనుకున్నారంతా. కానీ చివరికి చూస్తే టీమ్ ఇండియా 213 పరుగులకే ఆలౌటైంది. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న భారత ఇన్నింగ్స్‌కు బ్రేకులేసి.. వికెట్లు కాపాడుకోవడానికి, పరుగులు చేయడానికి మన బ్యాటర్లు నానా అవస్థలు పడేలా చేసిన బౌలర్ దునిత్ వెల్లలాగే (Dunith Wellalage). తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన ఈ కుర్రాడి వయసు కేవలం 20 ఏళ్లే. మ్యాచ్ నెగ్గింది భారతే అయినా.. ఈ యువ ఆల్‌రౌండర్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇచ్చారంటే తన ప్రదర్శన ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. భారత్‌తో మ్యాచ్‌లో సంచలన ప్రదర్శనతో అతడి పేరు మార్మోగింది. ఆసియా కప్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపికై.. ఇప్పుడు సీనియర్లకే చెక్ పెట్టేలా కనిపిస్తున్నాడు ఈ కుర్రాడు.

ఈ ఆసియా కప్‌కు ముందు దునిత్ వెల్లలాగె ఆడింది తొమ్మిది వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ మాత్రమే. 9 వన్డేల్లో 9 వికెట్లు పడగొట్టి, 109 పరుగులే చేశాడతను. ఏకైక టెస్టులో వికెట్టే పడగొట్టలేకపోయాడు. చేసిన పరుగులు 18 మాత్రమే. అండర్-19 స్థాయిలో సంచలన ప్రదర్శన చేసినప్పటికీ.. శ్రీలంక తరఫున పెద్దగా రాణించకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్లో నిలదొక్కుకోవడం కష్టమే అనుకున్నారు. ఆసియా కప్‌కు కూడా అతడి ఎంపిక సందేహంగానే కనిపించింది. కానీ స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరం కావడం వెల్లలాగెకు కలిసొచ్చింది. ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తుది జట్టులోనూ అతడికి అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని అతను బాగానే ఉపయోగించున్నాడు. తనలోని ప్రతిభనంతా బయటికి తీస్తూ మ్యాచ్ మ్యాచ్‌కూ ప్రదర్శనను మెరుగుపరిచాడు. అఫ్గానిస్థాన్‌పై 33 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టి జట్టు సూపర్-4కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఇక భారత్‌పై అతడి ప్రదర్శన ప్రకంపనలు రేపిందనే చెప్పాలి. స్పిన్ ఆడటంలో మంచి నైపుణ్యం ఉన్న రోహిత్, కోహ్లి, రాహుల్, శుభ్‌మన్ లాంటి స్టార్ బ్యాటర్లను అతను బుట్టలో వేసిన తీరు ప్రశంసలు అందుకుంది. తన బౌలింగ్‌లో పరుగులు చేయడం సంగతి అటుంచితే.. వికెట్లను కాపాడుకోవడం మన బ్యాటర్లకు కష్టమైంది. పిచ్ స్పిన్‌గా బాగానే సహకరించిన మాట వాస్తవం కానీ.. మ్యాచ్‌లో మిగతా స్పిన్నర్లందరినీ మించి అతను రాణించాడు. ఆపై బ్యాటింగ్‌లోనూ గొప్పగా పోరాడి నిఖార్సయిన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. హసరంగ లేడు కాబట్టి వేరే ఛాయిస్ లేక వెల్లలాగెను జట్టులోకి తీసుకున్న శ్రీలంకకు ఇప్పుడు తీయని తలనొప్పి ఎదురు కానుంది. హసరంగ తిరిగొచ్చినా.. దునిత్‌ను కూడా తుది జట్టులో కొనసాగించక తప్పని పరిస్థితి తలెత్తింది. అతడి కోసం తీక్షణ లేదా మరొక ఆటగాడు తన స్థానాన్ని త్యాగం చేయక తప్పేలా లేదు.

అలా వెలుగులోకి..

దునిత్ వెల్లలాగె వెలుగులోకి వచ్చింది గత ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో జరిగిన టీ20 ప్రపంచకప్‌తో. అప్పటికే వివిధ వయసు విభాగాల్లో సత్తా చాటిన దునిత్‌ను లంక సెలక్టర్లు అండర్-19 జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేసి ప్రపంచకప్‌కు పంపించారు. అక్కడ అతను ఆల్‌రౌండ్ మెరుపులతో అదరగొట్టాడు. వరుసగా రెండు మ్యాచుల్లో 5 వికెట్ల ప్రదర్శన చేయడమే కాక.. బ్యాటింగ్‌లోనూ రాణించాడు. మొత్తంగా 17 వికెట్లు తీయడమే కాక.. 264 పరుగులు కూడా చేసి టోర్నీలో ఉత్తమ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఒక మ్యాచ్‌లో వెల్లలాగె ఆల్‌రౌండ్ మెరుపులు చూసి లెజెండరీ పేసర్ లసిత్ మలింగ అబ్బురపడ్డాడు. వచ్చే దశాబ్ద కాలంలో అతను వన్డే క్రికెట్లో అత్యంత కీలక ఆటగాడు కాబోతున్నాడని మలింగ జోస్యం చెప్పడం విశేషం. ‘‘ఈ రోజు శ్రీలంక 12 మందితో ఆడినట్లు అనిపిస్తోంది. దునిత్ అంత చక్కటి ప్రదర్శన చేశాడు. అతడిలో గొప్ప ఆల్‌రౌండ్ నైపుణ్యం ఉంది. వన్డేల్లో రాబోయే దశాబ్ద కాలంలో శ్రీలంకకు అతను అత్యంత కీలక ఆటగాడు అవుతాడని నమ్ముతున్నా’’ అని మలింగ పేర్కొన్నాడు. దశాబ్దం వరకు ఏమో కానీ.. ఆసియా కప్ ప్రదర్శనతో దునిత్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రపంచకప్‌లో అతను లంక తురుపుముక్క కాబోతున్నాడనడంలో సందేహం లేదు. ప్రపంచకప్ జరిగేది స్పిన్‌కు అనుకూలించే భారత్ పిచ్‌లపై కావడంతో ఆ టోర్నీలో తన మెరుపులు చూడొచ్చు.
                                                                                                                                                  - ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని