Travis Head: వీరుడొచ్చాడు.. సన్‌రైజర్స్‌కు దొరికిన మరో వార్నర్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్‌ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్‌ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్‌లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్‌ హెడ్‌ (Travis Head).

Published : 16 Apr 2024 15:51 IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్‌ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. ఓపెనర్‌గా క్రీజులో అడుగుపెట్టడం.. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో జట్టుకు మెరుపు ఆరంభాలను అందించడమే పనిగా వార్నర్‌ సాగాడు. కెప్టెన్‌ కూడా కావడంతో మరింత బాధ్యతతో నిలకడగా పరుగులు సాధించాడు. కానీ వార్నర్‌ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్‌లో ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అదే ఆస్ట్రేలియా నుంచి.. అలాంటి లెఫ్టార్మ్‌ బ్యాటరే బరిలోకి దిగాడు. సంచలన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. అతనే.. ట్రావిస్‌ హెడ్‌ (Travis Head). సన్‌రైజర్స్‌కు దొరికిన మరో వార్నర్‌. 

ఆసీస్‌ నుంచే...

మెరుపు ఆరంభాలను అందించే మరో ఓపెనర్‌ సన్‌రైజర్స్‌కు దొరుకుతాడా?.. ఇవీ 2022 వేలానికి ముందు వార్నర్‌ను సన్‌రైజర్స్‌ వదులుకున్నప్పుడు రేకెత్తిన ప్రశ్నలు. 2022, 2023 సీజన్లలో ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. మార్‌క్రమ్, మయాంక్, అభిషేక్, హ్యారీ బ్రూక్‌ ఇలా వేర్వేరు ఓపెనింగ్‌ జోడీలను పరీక్షించినా ఫలితం దక్కలేదు. అలాంటి దశలో తానున్నానంటూ హెడ్‌ వచ్చాడు. ఆస్ట్రేలియా నుంచే వార్నర్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు దూసుకొచ్చాడు. సన్‌రైజర్స్‌ తరపున ఇలా ఐపీఎల్‌లో అడుగుపెట్టాడో, లేదో అలా రెచ్చిపోతున్నాడు. అయినా అతనంతే. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే.. ఒక్కసారి పిచ్‌పై అంచనాకు వచ్చి బంతిపై గురి కుదిరితే ఇక ఆగడు. 2013లోనే హెడ్‌ ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. అప్పుడు రూ.30 లక్షలకు అతణ్ని దిల్లీ తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత ఆర్సీబీ అతణ్ని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. 2016, 2017 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన అతను.. 10 మ్యాచ్‌ల్లో 138.51 స్ట్రైక్‌రేట్‌తో 205 పరుగులు చేశాడు. ఆ తర్వాత వివిధ కారణాలతో లీగ్‌కు దూరమయ్యాడు. 2023 సీజన్‌కు ముందు వేలంలో అతణ్ని ఎవరూ కొనుక్కోలేదు. కానీ నిరుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో, వన్డే ప్రపంచకప్‌ తుదిపోరులో కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఆసీస్‌ను విజేతగా నిలిపిన హెడ్‌కు ఈ సీజన్‌కు ముందు జరిగిన వేలంలో డిమాండ్‌ ఏర్పడింది. ఇతర జట్లతో పోటీపడీ మరీ సన్‌రైజర్స్‌ రూ.6.80 కోట్లకు దక్కించుకుంది. ఇప్పుడా ధరకు న్యాయం చేస్తూ హెడ్‌ చెలరేగుతున్నాడు. 

ఇలాగే సాగితే..

2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలపడంలో వార్నర్‌ది కీలక పాత్ర. 848 పరుగులు చేసిన అతను.. కోహ్లీ (973) తర్వాత ఆ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 2015 (562), 2017 (641), 2019 (692)లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. వార్నర్‌ కాకుండా సన్‌రైజర్స్‌ తరపున ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నది ఒక్క విలియమ్సన్‌ (735) మాత్రమే. ఇక 2019 తర్వాత మరే సన్‌రైజర్స్‌ బ్యాటర్‌ కూడా ఈ ఘనత సాధించలేదు. తాజాగా బెంగళూరుపై 39 బంతుల్లోనే శతకం చేసిన హెడ్‌ ఇదే దూకుడు కొనసాగిస్తే ఆరెంజ్‌ క్యాప్‌ అందుకునే ఆస్కారముంది. అలాగే సన్‌రైజర్స్‌నూ రెండో టైటిల్‌ దిశగా నడిపించే అవకాశముంది. ఈ సీజన్‌లో ముంబయితో మ్యాచ్‌లో అడుగుపెట్టిన హెడ్‌ 24 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. అప్పుడు జట్టు రికార్డు స్కోరు 277 చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆర్సీబీపై 41 బంతుల్లోనే 102 పరుగులు చేసి అత్యధిక స్కోరు రికార్డును 287 పరుగులతో సన్‌రైజర్స్‌ మరోసారి బద్దలు కొట్టడంలో ప్రధాన భూమిక పోషించాడు. సన్‌రైజర్స్‌ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన హెడ్‌ ఇదే ధనాధన్‌ బ్యాటింగ్‌ కొనసాగించాలన్నది అభిమానుల ఆకాంక్ష. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని