T20 World Cup: యూఎస్‌ఏ పిచ్‌లు.. హవా స్పిన్నర్లదా? పేసర్లదా?

టీ20 సందడి మళ్లీ మొదలైంది. ఈసారి ప్రపంచ సంగ్రామం. 20 దేశాలు కప్‌ కోసం తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. వార్మప్ మ్యాచ్‌లు అయిపోయి ఇప్పటికే తొలి పోరుకు ముగిసింది. ఈ క్రమంలో పిచ్‌లు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనే దానిపై ఓ లుక్కేద్దాం.

Updated : 02 Jun 2024 14:18 IST

టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభమైంది. తొలిసారి విండీస్‌తో కలిసి అమెరికా ఆతిథ్యం ఇస్తోంది. ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చిన పిచ్‌లతో యూఎస్‌ఏ వేదికగా మ్యాచ్‌లు. పొట్టి ఫార్మాట్‌ అంటేనే బ్యాటర్ల హవా అనే ధోరణి నేపథ్యంలో.. వారిని అడ్డుకోవడానికి బౌలర్లు విభిన్నమైన ప్రణాళికలు బరిలోకి దిగాల్సి ఉంటుంది. అసలు పిచ్‌ నుంచి సహకారం ఎలాంటి బౌలర్లకు లభిస్తుందనే ప్రశ్నలకు వార్మప్ మ్యాచుల్లోనూ సరైన సమాధానం దొరకకపోవడం గమనార్హం. 

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో బ్యాటింగ్‌తో టీ20 మజాను అభిమానులు ఆస్వాదించారు. అయితే, విండీస్ - యూఎస్‌ఏ వేదికగా పొట్టి కప్‌లో మాత్రం బౌలర్లదే హవా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, వెస్టిండీస్‌లో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో మాత్రం బ్యాటర్లు దుమ్మురేపారు. ఇక అమెరికాలోని వార్మప్‌ల్లో స్పిన్ కీలక పాత్ర పోషించింది. క్రీజ్‌లో కుదురుకుంటే పరుగులు చేయడం కూడా కష్టమేం కాదని బ్యాటర్లూ ఇక్కడ నిరూపించారు. దానికి ఉదాహరణ.. తాజాగా బంగ్లాదేశ్‌తో తలపడిన పోరులో నాణ్యమైన బౌలింగ్‌తో భారత స్పిన్నర్లు ఆకట్టుకున్నారు.

భారీ షాట్లు కొట్టలేక.. 

టీమ్‌ఇండియా ఆటగాడు శివమ్‌ దూబె ఐపీఎల్‌లో స్పిన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకోవడం చూశాం. కానీ, బంగ్లాతో మ్యాచ్‌లో మాత్రం తనదైన శైలిలో బాదుడు లేదు. కొన్ని బంతులను స్టాండ్స్‌లోకి పంపించేందుకు విఫలయత్నం చేశాడు. అతడు ఎదుర్కొన్న 16 బంతుల్లో 14 పరుగులే చేశాడు. అదీనూ ఒక సిక్స్‌ మాత్రమే కొట్టాడు. రెండుసార్లు క్యాచ్‌లను మిస్‌ కావడంతో బతికిపోయాడు. చివరికి స్పిన్నర్‌ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. అయితే, బంగ్లా ఫీల్డర్ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. కాబట్టి, వచ్చీ రావడంతోనే స్పిన్‌ బౌలింగ్‌లో భారీగా బాదేద్దామనుకునే వారికి ఇదొక పాఠం కావాలని క్రీడా పండితుల అభిప్రాయం.

ఆరంభంలో లెఫ్టార్మ్‌ నుంచి పెద్దగా ఇబ్బందుల్లేవు..

సాధారణంగా టీ20ల్లో ఎడమచేతివాటం స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టమని క్రికెట్ విశ్లేషకుల అంచనా. కానీ, ఇప్పుడీ వార్మప్‌లో బంగ్లాకు చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు షకిబ్ అల్ హసన్ (0/47), తన్విర్ ఇస్లామ్ (2 ఓవర్లలో 1/29) ప్రభావం చూపించలేదు. ఐపీఎల్‌లో ఫామ్‌ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్‌ పాండ్య (40: 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు)తోపాటు రిషభ్ పంత్ (53: 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) బౌండరీల వర్షం కురిపించారు. తన్విర్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లతో పాండ్య అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాలోని ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్ మాత్రం కట్టుదిట్టంగా బంతులేయడం విశేషం. మన స్పిన్నర్లందరూ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లవి కలిపి 14 వికెట్లు పడగా.. తొమ్మిదింటిని పేసర్లే తీశారు. కానీ, స్పిన్నర్లు పరుగులను కట్టడి చేశారు.

డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు

బంతికి, బ్యాటుకి మధ్య సమతూకం కోసం సిస్‌గ్రాస్‌ (SisGrass) సంస్థ రూపొందిస్తున్న హైబ్రిడ్‌ పిచ్‌ (Hybrid Pitch)లు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ట్రాక్‌లలో సహజసిద్ధమైన గడ్డితో పాటు అయిదుశాతం పాలిమర్‌ కలిసి ఉంటుంది. దీనివల్ల బౌలర్లు స్థిరమైన బౌన్స్‌ రాబట్టొచ్చు. పిచ్‌ చాలాసేపు తాజాగా ఉంటుంది. దీంతో బౌలర్లు కూడా సమర్థవంతంగా బంతులు వేయగలుగుతారు. 

చివరిగా..: కట్టుదిట్టమైన లైన్‌ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తే వికెట్లు తీయొచ్చని భారత పేసర్లూ ఈ వార్మప్‌ మ్యాచ్‌లో నిరూపించారు. అసలైన పోరు (జూన్‌ 5న ఐర్లాండ్‌తో) సమయంలోనూ ఇప్పటి కంటే పరిస్థితులు భిన్నంగా ఏమీ ఉండవు. బ్యాటర్లు సంయమనంతో ఆడితే పరుగులు రాబట్టొచ్చు.. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి బౌలింగ్‌ చేస్తే వికెట్లూ తీయొచ్చు. దీంతో టీమ్‌ఇండియా ఇతర జట్లకు భిన్నంగా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం మంచిదైందనే అభిప్రాయమూ అభిమానుల్లో నెలకొంది. ఇదే బౌలింగ్‌ మున్ముందు మ్యాచుల్లోనూ కొనసాగించాలనేది వారి ఆకాంక్ష.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని