ODI World Cup: స్పిన్నర్లే విన్నర్లు... ఈ ప్రపంచకప్‌లో వారిదే ఆధిపత్యం

వన్డే ప్రపంచకప్‌ 2023లో స్పిన్నర్ల పాత్ర కీలకం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ జట్ల మేటి స్పిన్నర్ల నుంచి ఈసారి చక్కటి ప్రదర్శన వస్తుందని చెబుతున్నారు. 

Published : 10 Oct 2023 15:51 IST

ఉపఖండంలో ఎప్పుడు ప్రపంచకప్ (Cricket World Cup) జరిగినా స్పిన్నర్లదే హవా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత్‌ వేదికగా మొదలైన 2023 ప్రపంచకప్ (ODI World Cup 2023) కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు భారత్ - ఆస్ట్రేలియా వన్డే సిరీస్ చూసినా.. ఆ తర్వాత వార్మప్ మ్యాచ్‌లను గమనించినా స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లు కాబోతున్నారని అర్థమైపోతుంది. ప్రపంచకప్‌ ఆరంభ పోరు ఈ అభిప్రాయాన్ని మరింత పెంచింది. ఏ వేదికలో ఆడుతున్నాం అన్నది సంబంధం లేకుండా స్పిన్ బలం బాగా ఉన్న జట్లే జయకేతనం ఎగురవేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ ఫలితాలతో పాటు ప్రపంచకప్ విజేత ఎవరన్నది కూడా స్పిన్నర్లే నిర్దేశిస్తే ఆశ్చర్యం లేదు.

1987, 1996, 2011లో ఉపఖండం వేదికగా ప్రపంచకప్‌లు జరిగాయి. ఆ టోర్నీలన్నింట్లో స్పిన్నర్లు జోరు చూపించారు. 2011 ప్రపంచకప్‌లో పడ్డ మొత్తం బంతుల్లో 47 శాతం స్పిన్నర్లు వేసినవే. వికెట్లలో కూడా 44 శాతం వాటా స్పిన్నర్లు తీసుకున్నారు. గతంలో భారత్‌ ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చినపుడు వేరే ఉపఖండ దేశాల భాగస్వామ్యం ఉంది. కానీ ఈసారి మన దేశం ఒక్కటే ప్రపంచకప్‌ను నిర్వహిస్తోంది. భారత్‌లో మెజారిటీ స్టేడియాలు స్పిన్‌కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. మన బలం కూడా స్పిన్నే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టెస్టు సిరీస్‌లో స్పిన్‌ పిచ్‌లతోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తుంటుంది భారత్‌. ప్రపంచకప్‌లో పూర్తిగా పిచ్‌ల మీద ఆతిథ్య దేశం నియంత్రణ ఉండదు కానీ.. సొంత జట్టు బలానికి తగ్గట్లు, పిచ్‌ల సహజ స్వభావానికి అనుగుణంగానే వికెట్లు తయారు చేస్తారు. కాబట్టి ఈ ప్రపంచకప్‌లో స్పిన్నర్లే విన్నర్లు అవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తొలి మ్యాచ్‌ నుంచే..

ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ మధ్య తొలి మ్యాచ్‌తోనే స్పిన్నర్ల ఆధిపత్యం మొదలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ను పెద్ద దెబ్బ కొట్టింది స్పిన్నర్లే. మలన్‌ను ఔట్‌ చేసి తొలి వికెట్‌ తీసింది హెన్రీ అయినా.. తర్వాత ప్రమాదకర బెయిర్‌స్టోను స్పిన్నర్‌ శాంట్నర్‌ ఔట్‌ చేశాడు. అతను తర్వాత మరో వికెట్‌ కూడా పడగొట్టాడు. మరో స్పిన్నర్‌ రచిన్‌ రవీంద్ర ఓ వికెట్‌ తీయగా.. పార్ట్‌టైం స్పిన్నర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ తన తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్‌లో పడ్డ మొత్తం 10 వికెట్లలో సగం స్పిన్నర్ల ఖాతాలో చేరాయి. ఇక ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఎలా రెచ్చిపోయారో తెలిసిందే.

ఆసీస్ ఇన్నింగ్స్‌లో పడ్డ పది వికెట్లలో స్పిన్నర్లే ఆరు చేజిక్కించుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ శాంట్నర్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అఫ్గానిస్థాన్‌-బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ స్పిన్నర్ల ఆధిపత్యం సాగింది. అహ్మదాబాద్‌ స్టేడియం స్వతహాగా స్పిన్నర్లకే అనుకూలం. అదే కాక దిల్లీ, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు.. ఇలా ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిస్తున్న ప్రధాన నగరాల్లోని స్టేడియాలన్నీ స్పిన్‌కు అనుకూలించేవే. ఒక్క ధర్మశాలలో మాత్రం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పేస్‌కు సహకారం ఉంటుంది. అలా అక్కడ కూడా స్పిన్నర్ల ప్రభావం ఉండదనేమీ కాదు.

అన్ని జట్లకూ బలం

టోర్నీ జరుగుతోంది భారత్‌లో కావడం ఉపఖండ జట్లకు కలిసొచ్చేదే. సంప్రదాయంగా భారత్‌తో సహా మిగతా ఉపఖండ జట్లకు స్పిన్‌ బలం ఎక్కువే. భారత్‌కు కుల్‌దీప్, జడేజా, అశ్విన్‌ల రూపంలో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లున్నారు. పాకిస్థాన్‌కు షాదాబ్, నవాజ్, ఉసామా మిర్, అఘా సల్మాన్, ఇఫ్తికార్‌.. ఇలా పెద్ద స్పిన్‌ బలగమే ఉంది. శ్రీలంకకు తీక్షణ, వెల్లలాగె, ధనంజయ డిసిల్వా, అసలంక అందుబాటులో ఉన్నారు. బంగ్లాదేశ్‌కు షకిబ్‌ అతి పెద్ద బలం.

ఇంకా మెహిదీ హసన్‌ మిరాజ్, మెహిదీ హసన్‌ లాంటి మంచి స్పిన్నర్లున్నారు. అయితే విదేశీ జట్లకు కూడా స్పిన్‌ బలం తక్కువేమీ కాదు. అఫ్గానిస్థాన్‌ జట్టులో రషీద్‌ ఖాన్, ముజీబుర్‌ రెహ్మాన్, నబి, నూర్‌ అహ్మద్‌ ఎంత ప్రమాదకరమో తెలిసిందే. న్యూజిలాండ్‌ జట్టులో శాంట్నర్, రచిన్‌ రవీంద్ర, ఇష్‌ సోధిలో అంత తేలిక కాదు. ఇంగ్లాండ్‌కు రషీద్, మొయిన అలీ, లివింగ్‌స్టన్‌.. దక్షిణాఫ్రికాకు షంసి, కేశవ్‌ మహరాజ్, మార్‌క్రమ్‌.. ఆస్ట్రేలియాకు జంపా, అగార్, లబుషేన్‌ స్పిన్‌ సేవలు అందించనున్నారు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు