SRH: ఈసారి అలా ఉండదు.. తొలి మ్యాచ్‌ నుంచే దూకుడుగా ఆడతాం: సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్

ఆసీస్‌ను వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిపిన ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను (Pat Cummins) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన సారథిగా నియమించుకుంది. గత ఫలితాలకు భిన్నంగా విజయాలబాట పట్టాలనే లక్ష్యంతో ఈసారి ఐపీఎల్‌ బరిలోకి దిగింది.

Published : 21 Mar 2024 17:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గత కొన్ని ఐపీఎల్‌ సీజన్ల నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH) జట్టు ఆటతీరు అధ్వానంగా ఉంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానాలకే పరిమితమవుతూ అభిమానులను నిరాశపరిచింది. తాజాగా ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌ కోసం సన్‌రైజర్స్ భారీ మొత్తం వెచ్చించి మరీ కొత్త కెప్టెన్‌ను తీసుకుంది. తమ జట్టు భవితవ్యం మారిపోతుందన్న ఆశలతో ఎడిషన్‌లో పోటీకి సిద్ధమైంది. జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన ఆస్ట్రేలియా స్టార్‌ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులకు భరోసా ఇచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం నుంచే ఐపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో కమిన్స్‌ మాట్లాడిన వీడియోను ఎస్‌ఆర్‌హెచ్‌ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. తొలి ప్రత్యర్థి కేకేఆర్‌పైనా, ఈ సీజన్‌లో తమ జట్టు ఆడే తీరుపై కమిన్స్‌ మాట్లాడాడు. తొలి మ్యాచ్‌ నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. 

‘‘ఐపీఎల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. శుభారంభం చేసేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగుతాం. టీ20 ఫార్మాట్‌ చూసేందుకు బాగానే ఉన్నా ఆడటం చాలా కష్టం. తొలి మ్యాచ్‌లో తలపడనున్న ప్రత్యర్థి కోల్‌కతా బలమైన జట్టే. మేం మాత్రం మొదట్నుంచి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. యువ క్రికెటర్లతో కలిసి ఆడటం ఎప్పుడూ బాగుంటుంది. మా జట్టులో నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారు. భువనేశ్వర్‌, ఐదెన్ మార్‌క్రమ్‌ వంటి సీనియర్లు ఉన్నారు. 

అలాగే యువ టాలెంట్‌కు కొదవేం లేదు. అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి కుర్రాళ్లు ఉన్నారు. గత సీజన్లలో కొందరి ఆటతీరును గమనించా. ఇప్పుడున్న జట్టుతో పెద్దగా పని చేసిన అనుభవం నాకు లేదు.  టీమ్‌లోని కొందరి గురించి పెద్దగా తెలియదు. కానీ తెలుసుకుంటా. జట్టుకు వారి నుంచి ఏమేం అవసరమో రాబడతా. కోచ్‌లు, సహాయక సిబ్బందితో కలిసి కుర్రాళ్లలో విశ్వాసం నింపుతా.  తప్పకుండా ఈసారి ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులను ఉత్సాహపరిచేలా చూస్తాం’’ అని కమిన్స్‌ వెల్లడించాడు. కోల్‌కతాతో (KKR vs SRH) మార్చి 23న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సన్‌రైజర్స్ తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని