BAN vs SL: 48 ఏళ్ల భారత్‌ రికార్డు బ్రేక్‌.. టెస్టుల్లో శ్రీలంక అరుదైన ఘనత

శ్రీలంక క్రికెటర్ ఇటీవల ఓ రికార్డు తన ఖాతాలో వేసుకోగా.. తాజాగా జట్టుపరంగానూ అరుదైన ఘనత సాధించింది.

Updated : 01 Apr 2024 10:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టెస్టు క్రికెట్‌లో రికార్డులు బ్రేక్‌ అవుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఇది దశాబ్దాలు కూడా పట్టొచ్చు. తాజాగా శ్రీలంక క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టులో కమిందు మెండిస్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఏడో స్థానంలో సెంచరీలు చేసిన బ్యాటర్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్టులో మరో రికార్డును శ్రీలంక క్రికెట్‌ జట్టు బ్రేక్‌ చేసింది. ఆ టీమ్‌ అధిగమించిన రికార్డు టీమ్‌ఇండియా పేరిట ఉండటం గమనార్హం. బంగ్లాదేశ్‌ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 531 పరుగులకు ఆలౌటైంది. ఇందులో విశేషం ఏంటంటే.. ఒక్క బ్యాటర్‌ కూడా సెంచరీ చేయకుండానే శ్రీలంక భారీ స్కోరు సాధించింది. ఆరుగురు బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలతో అలరించారు. 

చివరి ఇద్దరు బ్యాటర్లు మినహా.. తొమ్మిది మందీ రెండంకెల స్కోరు చేశారు. కుశాల్ మెండిస్ (93), కమిందు మెండిస్ (92), కరుణరత్నె (86), ధనంజయ డిసిల్వా (70), చండిమాల్ (59), నిషాన్ మదుష్క (57) అర్ధశతకాలు సాధించారు. ఏంజెలో మ్యాథ్యూస్ (23), జయసూర్య (28), విశ్వ ఫెర్నాండో (11) డబుల్‌ డిజిట్ స్కోరు చేశారు. అంతకుముందు భారత్ 1976లో న్యూజిలాండ్‌పై 524/9 (డిక్లేర్డ్‌) స్కోరుతో ఈ ఘనత సాధించింది. విండీస్‌పై ఆస్ట్రేలియా 2009లో 520/7 (డిక్లేర్డ్), ఆసీస్‌పై దక్షిణాఫ్రికా 1998లో 517, ఆసీస్‌పై పాక్‌ 1981లో 500/8 (డిక్లేర్డ్) ఇలాగే స్కోర్లు సాధించాయి.

ముగ్గురి చేతుల్లో మిస్‌ అయిన క్యాచ్‌

బంగ్లాదేశ్‌ - శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ సంఘటన క్రికెట్‌ అభిమానుల్లో నవ్వులు పూయించింది. ముగ్గురు ఆటగాళ్లు ఒక క్యాచ్‌ను వదిలేసిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. ఖలేద్‌ అహ్మద్ (ఇన్నింగ్స్‌లోని 121వ ఓవర్) బౌలింగ్‌లో ప్రభాత్‌ జయసూర్య బ్యాట్‌ను తాకుతూ బంతి స్లిప్‌లోకి దూసుకెళ్లింది. అక్కడ కెప్టెన్ నజ్ముల్ షాంటో కాస్త తడబడి బంతిని పైకి లేపాడు. ఆ పక్కనే రెండో స్లిప్‌లో ఉన్న షాహదాత్‌ కూడా అందుకోలేకపోయాడు. మూడో స్లిప్‌లో ఉన్న జకీర్ హసన్ వైపు బంతి వెళ్లినా పట్టుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో ముగ్గురి చేతుల్లోకి వెళ్లిన బంతిని క్యాచ్‌ పట్టుకోలేకవడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని