IPL: గత సీజన్‌లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్‌ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు

కోల్‌కతా ప్రధాన కోచ్‌ చంద్రకాంత్ పండిత్‌ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది.

Published : 28 Mar 2024 12:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా విదేశీ క్రికెటర్లకూ అవకాశాలు కల్పించిన టోర్నీ. ప్రస్తుతం 17వ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే, గతేడాది కోల్‌కతా తరఫున ఆడిన డేవిడ్ వీజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టు కోచ్‌గా చంద్రకాంత్ పండిత్ వచ్చాక.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో వాతావరణం తనతోపాటు చాలామంది విదేశీ ఆటగాళ్లకు నచ్చలేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గత సీజన్‌లో అతడికెదురైన అనుభవాలను వెల్లడించాడు. 

‘‘జట్టులో చాలా విషయాలు తెర వెనక జరుగుతుంటాయి. కొన్నింటితో ఆటగాళ్లు సంతోషంగా ఉండలేరు. చాలాసార్లు డ్రెస్సింగ్ రూమ్‌ కూడా ఇబ్బందిగా మారింది. కొత్తగా వచ్చిన కోచ్‌ తనదైనశైలిలోనే అందరూ ఉండాలనేలా ప్రవర్తించేవారు. ఆటగాళ్లతో సరిగ్గా కూర్చున్నదే లేదు. అవసరం లేని మార్పులతో ప్లేయర్లు చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఒక విదేశీ ప్లేయర్‌గా.. కొన్నిసార్లు మేం సరైన విధానంలో కూర్చోం. కానీ, అతడు మాత్రం మమ్మల్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించేవారు. భారత్‌లో ఇలాంటి కఠినమైన క్రమశిక్షణతోనే కోచింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారని అతడికి తెలుసు. కానీ, ఓవర్సీస్‌ ప్లేయర్లు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ లీగుల్లో ఆడుతుంటారు. మా వద్దకు వచ్చి ఇలా ఉండు.. అలా ప్రవర్తించాలి.. ఏం ధరించాలనేది కూడా చెబుతుండేవాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నాకంటే మొండిగా ఉండేవారు మాత్రం ఇబ్బందిపడ్డారు.

భారత యువ క్రికెటర్ రింకుసింగ్ ఐదు సిక్స్‌లతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంతో సంబంధం లేకుండా ఎవరైనా ఆటగాడు మంచి ప్రదర్శన చేస్తే అభినందించాలి. గెలుస్తారా? ఓడతారా? అనే భయంతో కూర్చోకూడదు. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనపై పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అప్పుడే జట్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి’’ అని వీజ్‌ వ్యాఖ్యానించాడు. నమీబియా ఆటగాడు గత సీజన్‌లో 11 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. ఆ సీజన్‌లో రెండో టాప్‌ వికెట్‌ టేకర్. మరి అతడు ఆరోపణలు చేసిన కోచ్‌ చంద్రకాంత్ పండిత్‌కు దేశవాళీలో మంచి పేరుంది. చాలామంది క్రికెటర్లు ఆయన వద్దే శిక్షణ పొందారు. ప్రస్తుతం చంద్రకాంత్‌ కోచింగ్‌లోనే కోల్‌కతా ఈ సీజన్‌లో ఆడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని