Hyderabad Vs Mumbai: హైదరాబాద్‌ జట్టుకు తప్పని నిరీక్షణ.. కీలక స్పిన్నర్ మరో వారం దూరం!

ఓటమితో టోర్నీని ప్రారంభించిన రెండు జట్లు నేడు ఉప్పల్‌ వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు షాకింగ్‌ న్యూస్. టాప్‌ స్పిన్నర్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు.

Updated : 27 Mar 2024 12:02 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ మినీ వేలంలో దక్కించుకున్న శ్రీలంక ఆటగాడి సేవలను హైదరాబాద్‌ మరో వారం రోజులపాటు కోల్పోనుంది. ఇప్పటికే కోల్‌కతాతో తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేని టాప్‌ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ.. నేడు ముంబయితోనూ బరిలోకి దిగడం లేదు. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఎడమ మడమ నొప్పి కారణంగా మరో వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని అతడు భావిస్తున్నట్లు సమాచారం. విదేశీ వైద్య బృందంతో సంప్రదింపులు జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి.

శ్రీలంక తరఫున వన్డే సిరీస్‌, టీ20 సిరీస్‌ ఆడిన హసరంగ 8 వికెట్లు పడగొట్టాడు. అతడి గాయం తీవ్రతను పరిశీలించాల్సి ఉందని శ్రీలంక క్రికెట్ బోర్డు వైద్య బృందం వెల్లడించింది. వచ్చే జూన్‌ నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ కప్‌ నేపథ్యంలో రిస్క్‌ తీసుకోవడానికి అతడు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్‌ జట్టుతో ఎప్పుడు కలుస్తాడనేది చెప్పలేని పరిస్థితి. ఇటీవల బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా అంపైరింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హసరంగపై మూడు డిమెరిట్‌ పాయింట్ల శిక్ష పడింది. దీంతో బంగ్లాతో రెండు టెస్టు సిరీస్‌ నుంచి వేటు పడింది. గతంలోనే ఐదు డిమెరిట్ పాయింట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. 

పాండ్య బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు రావాలి: కుంబ్లే

హైదరాబాద్‌తో ఉప్పల్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు రావాలని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు. ‘‘ముంబయి తొలి మ్యాచ్‌లో విజయం సాధించే స్థితి నుంచి ఓటమిపాలైంది. చివరి ఐదు ఓవర్లలో కేవలం 43 పరుగులు చేయడం టీ20ల్లో చాలా సులువే. ఇంకా 7 వికెట్లు చేతిలో ఉన్నాయి. హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు వచ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. రెండో మ్యాచ్‌లో ఆ పొరపాటు చేయొద్దు’’ అని కుంబ్లే సూచించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో చివర్లో వచ్చిన పాండ్య నాలుగు బంతుల్లో 11 పరుగులు చేశాడు. కీలక సమయంలో ఔట్ కావడంతో ముంబయికి ఓటమి తప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని