Rohit Sharma: వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్‌ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్‌

మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇటీవల మండిపడ్డాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌స్పోర్ట్స్‌ స్పందించింది. 

Published : 21 May 2024 00:06 IST

ఇంటర్నెట్ డెస్క్: మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అభ్యంతరం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌కు ఈ విషయం వివరించినా.. రికార్డ్ చేసి ప్రసారం చేసిందని సోమవారం ఎక్స్‌(ట్విటర్‌)లో రోహిత్‌ అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఈ అంశంపై తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ స్పందిస్తూ రోహిత్ చేసిన ఆరోపణలను ఓ ప్రకటనలో ఖండించింది. తాము రోహిత్‌ మాటలను రికార్డు చేయడం లేదా ప్రసారం చేయలేదని స్పష్టంచేసింది. 

‘‘మే 16న వాంఖడే స్టేడియంలో (లఖ్‌నవూతో మ్యాచ్) జరిగిన ట్రైనింగ్ సెషన్‌ సమయంలో రోహిత్ శర్మ తన స్నేహితులతో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ బ్రాడ్‌కాస్టర్‌గా చూపించాం. అంతే కానీ వారు మాట్లాడుతున్నప్పుడు ఆడియోను రికార్డు లేదా ప్రసారం చేయలేదు. రోహిత్ శర్మ తన సంభాషణ ఆడియోను రికార్డ్ చేయవద్దని కోరిన క్లిప్‌ను మాత్రమే స్టార్ స్పోర్ట్స్ ప్రీ-మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార కవరేజీలో ప్రదర్శించాం. ప్రసారాల విషయంలో ఆటగాళ్ల గోప్యతకు అందుకు కట్టుబడి ఉన్నాం’’ అని స్టార్‌ స్పోర్ట్స్‌ పేర్కొంది. 

అసలేం జరిగిందంటే.. 

కోల్‌కతాతో మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో ఆ జట్టు  అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో రోహిత్‌ జరిపిన సంభాషణ ఇటీవల సంచలనంగా మారింది. అందులో ముంబయి జట్టుతో తన రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడుతూ ‘‘భాయ్‌ నాదేముంది.. ఇదే చివరిది’’ అన్నట్లు వినిపించింది. దీంతో రోహిత్‌ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరిగింది. చివరికి ఆ వీడియోను కేకేఆర్‌ సోషల్‌ మీడియా ఖాతా నుంచి డిలీట్‌ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విషయం గురించి చర్చ జరుగుతుండగానే లఖ్‌నవూతో ఆడిన చివరి లీగ్‌ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్‌ ధవళ్ కులకర్ణితో మాట్లాడుతూ రోహిత్ కనిపించాడు. ఈ క్రమంలో కెమెరామెన్‌ వీడియో తీయడాన్ని రోహిత్‌ గమనించాడు. ఇప్పటికే కోల్‌కతా కోచ్ అభిషేక్ నాయర్‌తో సంభాషణ వైరల్‌గా మారిన సంగతి గుర్తుకొచ్చి.. సదరు కెమెరామన్‌కు ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘బ్రదర్‌ ప్లీజ్‌ ఆడియోను క్లోజ్‌ చెయ్యి. ఇప్పటికే ఒకటి నెట్టింట వైరల్‌గా మారిపోయింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి’’ అని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు