Asian Games: అదరగొట్టిన వెటరన్లు... ఆసియా క్రీడల్లో పతకాల మెరుపులు

వయసు మీద పడినా తమ ప్రతిభ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ కొందరు భారత వెటరన్లు హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో అదరగొట్టారు. రోహన్‌ బోపన్న,సౌరభ్‌ ఘోషల్‌, సీమా పునియా పతకాలు కొల్లగొట్టి భారత పతాకను రెపరెపలాడించారు.

Published : 08 Oct 2023 15:49 IST

35 ఏళ్లు దాటితేనే శరీరంలో సరళత తగ్గుతుంది. ఈ వయసులో ఆటలంటే చాలా కష్టం. అందుకే ఎక్కువ మంది రిటైర్‌ అవుతుంటారు. మరి అదే వయసు 40 దగ్గరగా ఉండి బరిలో దిగితే! అంతర్జాతీయ పతకాలు సాధిస్తే! అద్భుతమే!!. అలా వయసు మీద పడినా తమ ప్రతిభ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ కొందరు భారత వెటరన్లు హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో అదరగొట్టారు. 44 ఏళ్ల రోహన్‌ బోపన్న టెన్నిస్‌లో స్వర్ణంతో సత్తా చాటితే.. 37 ఏళ్ల సౌరభ్‌ ఘోషల్‌ స్క్వాష్‌లో పసిడి ముద్దాడాడు. ఇక అథ్లెటిక్స్‌లో 40 ఏళ్ల సీమా పునియా డిస్కస్‌ త్రోలో తన హవా కొనసాగిస్తూ కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. రోహన్‌ బోపన్న,సౌరభ్‌ ఘోషల్‌,సీమా పునియా

బోపన్న అదరహో

వయసు పెరుగుతున్న కొద్దీ రోహన్‌ బోపన్న ఆట కూడా మెరుగువుతోంది. ఇటీవల అతడి వరుస విజయాలే ఇందుకు నిదర్శనం. గ్రాండ్‌స్లామ్‌ మొదలుకొని ఆసియా క్రీడల దాకా బోపన్న హవా కొనసాగుతోంది. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి స్థిరంగా రాణిస్తున్నాడతను. ఎబ్డెన్‌ జతగా ఏటీపీ మాస్టర్స్‌ 1000 టైటిల్‌ గెలిచిన బోపన్న.. ఈ ఏడాది వింబుల్డన్‌లో సెమీఫైనల్‌ చేరాడు. యుఎస్‌ ఓపెన్లో ఫైనల్‌ చేరాడు. కానీ తుదిపోరులో కొద్దిలో ఓడి టైటిల్‌ చేజార్చుకున్నాడు. అక్కడే ఆగలేదతను. ఆసియా క్రీడల్లో రుతుజతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణంతో మెరిశాడు. లియాండర్‌ పేస్, మహేశ్‌భూపతి తర్వాత భారత టెన్నిస్‌కు పెద్ద దిక్కుగా మారిన బోపన్న.. కెరీర్‌లో ఆరంభంలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. పాక్‌ ఆటగాడు ఖురేషితో కలిసి జట్టు కట్టినా టైటిల్స్‌ ఎక్కువగా నెగ్గలేదు. కానీ ఎబ్డెన్‌ అతడికి కలిసొచ్చాడు. సమన్వయంతో ఆడుతున్న ఈ జోడీ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో స్థిరంగా ముందుకెళుతోంది. ఆసియా క్రీడల్లోనూ బోపన్న తన అనుభవాన్ని చూపించాడు. నిజానికి రుతజకు అంతర్జాతీయ స్థాయిలో అనుభవం లేదు. పెద్దగా గెలిచింది కూడా ఏమీ లేదు. కానీ బోపన్న అండతో ఆమె మిక్స్‌డ్‌ డబుల్స్‌ స్వర్ణాన్ని కైవసం చేసుకోగలిగింది.

సౌరభ్‌ ఆగట్లేదు

స్క్వాష్‌లో కోల్‌కతాకు చెందిన సౌరభ్‌ ఘోషల్‌ది మరో కథ. వయసుతో పని లేకుండా పతకాల వేటలో సాగుతున్న అతడు.. ఆసియా క్రీడల్లో సింగిల్స్‌లో రజతం, టీమ్‌ విభాగంలో స్వర్ణంతో మెరిశాడు.. మొత్తం మీద ఈ క్రీడల్లో ఈ వెటరన్‌ ఇప్పటి వరకు తొమ్మిది పతకాలు సాధించాడు. 2006 దోహా ఆసియా క్రీడలతో మొదలుపెట్టి అతడు ప్రతి క్రీడల్లోనూ పతకం గెలవడం విశేషం. 2018-2019 మధ్య టాప్‌-10 ర్యాంకుల్లో నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా నిలిచిన సౌరభ్‌..2022 కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం నెగ్గి సింగిల్స్‌లో పతకం గెలిచి తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మరో స్టార్‌ దీపిక పల్లికల్‌తో కలిసి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు సాధించిన ఘోషల్‌.. కెరీర్‌లో చరమాంకంలో మరింత చెలరేగుతున్నాడు. 

పెళ్లి అయినా..

2014లో తొలిసారి ఆసియా క్రీడల్లో డిస్కస్‌త్రోలో స్వర్ణం గెలిచింది సీమా పునియా. మళ్లీ పదేళ్ల తర్వాత కూడా ఆసియా క్రీడల్లో పోడియంపై నిలబడింది. 40 ఏళ్ల వయసులో యువ అథ్లెట్ల పోటీని తట్టుకుని హాంగ్‌జౌ క్రీడల్లో కాంస్యం గెలిచి సత్తా చాటింది. జకర్తాలో జరిగిన గత క్రీడల్లోనూ కంచు గెలిచిన సీమా..ఈసారి క్రీడల్లో పతకం తెస్తుందని ఎవరికీ అంచనాలు లేవు. కానీ అనుభవాన్ని రంగరిస్తూ ఈ హరియాణా అథ్లెట్‌ పతకాన్ని ముద్దాడింది. ఆసియా క్రీడలతోనే సీమా కెరీర్‌ ముడిపడి ఉంది. 2006 దోహా ఆసియా క్రీడలకు ముందు ఆమె డోపింగ్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఈ క్రీడలకు దూరమైపోయింది. కానీ ఈ షాక్‌ నుంచి బయటపడి మళ్లీ పునరాగమనం చేసిన ఆమె.. దిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం గెలుచుకుంది. పెళ్లి అయినా కెరీర్‌ కొనసాగించిన సీమ 2012 లండన్‌ ఒలింపిక్స్‌లోనూ పోటీపడ్డా.. కొద్దిలో 13వ స్థానంలో నిలిచింది. కానీ 2014 ఇంచియెన్‌ ఆసియా క్రీడల్లో స్వర్ణంతో అదరగొట్టింది. 40 ఏళ్ల వయసొచ్చింది.. ఇక ఆమె కేవలం పార్టిసిపేట్‌ చేయడానికే వెళ్లింది అనుకుంటే.. హాంగ్‌జౌ ఆసియా క్రీడల పతకం గెలిచి అబ్బురపరిచింది.
                           

  -ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని