WTC Final: ప్రపంచ రికార్డు నమోదు కావడం ఖాయం.. ఆఖరి రోజు ఛేదన కష్టం కాదు: రవిశాస్త్రి

భారత్‌ చివరి రోజు ఆటలో 280 పరుగులు చేస్తే తొలిసారి డబ్ల్యూటీసీ (WTC Final) ఫైనల్‌ విజేతగా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు ఆసీస్‌కు మాత్రం ఏడు వికెట్లు చాలు. ఈ క్రమంలో రవిశాస్త్రి, షమీ మాత్రం భారత్‌ గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

Updated : 11 Jun 2023 14:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final) ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం 164/3 స్కోరుతో ఉంది. మరో 280 పరుగులు చేస్తే టీమ్‌ఇండియా విజయం సాధిస్తుంది. అలాగే ఏడు వికెట్లను పడగొడితే ఆసీస్‌ ఛాంపియన్‌గా నిలుస్తుంది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, రహానె ఉండటంతో భారత్‌కు ఆశలు ఉన్నాయి. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌ మంచి రిథమ్‌లో ఉన్నారు. శ్రీకర్‌ భరత్‌ కూడా ఓ చేయి వేస్తే ఛేదన కష్టమేం కాదు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి కూడా ఇలాగే స్పందించాడు. 

‘‘చివరి రోజు 280 పరుగులు చేయడం కష్టం కాదు. సాధ్యపడే అంశమే. తప్పకుండా మనం ఈ మ్యాచ్‌లో కొత్త రికార్డులను చూస్తాం. ప్రపంచ రికార్డు ఛేజింగ్‌ అవుతుందనడంలో నాకు అనుమానం లేదు. ఫలితం గురించి ఆందోళన పడకుండా ఆదివారం తొలి సెషన్‌ను కాచుకుంటే చాలు. ఎందుకంటే పిచ్‌ పరిస్థితి అలా ఉంది. నాలుగో రోజు ఆటలో రోహిత్ శర్మ, పుజారా తమ తప్పిదాల వల్లే పెవిలియన్‌కు చేరారు’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. టెస్ట్‌ క్రికెట్లో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు వెస్టిండీస్‌ పేరిట ఉంది. 2003లో ఆ జట్టు ఆస్ట్రేలియాపై 418 పరుగులు ఛేదించి గెలిచింది.

వందశాతం మనదే: షమీ

భారీ ఛేదనలో టీమ్‌ఇండియా తప్పకుండా గెలుస్తుందని పేసర్ మహ్మద్‌ షమీ భరోసా ఇచ్చాడు. ఇదేమీ పెద్ద కష్టంగా అనిపించడం లేదని పేర్కొన్నాడు. ‘‘ప్రతి ఒక్కరూ వందశాతం నమ్మకంతో ఉండాలి. తప్పకుండా మనం విజయం సాధిస్తాం. గెలుపు కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. ప్రపంచంలోని అన్ని మైదానాల్లో మంచి ప్రదర్శనే ఇస్తున్నాం. అందుకే, మనం ఈ మ్యాచ్‌లో విజయ సాధిస్తామనే నమ్మకం ఉంది. బంతి తర్వాత బంతి ఆడుకుంటూ పోతే 280 పరుగులు చేయడం కష్టం కాదు. భారీ టార్గెట్‌ ఉందని కంగారుపడకుండా నింపాదిగా ఆడితే సరిపోతుంది’’ అని షమీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని