Mitchell Starc: స్టార్క్‌ అదరగొట్టేస్తాడు.. కాకపోతే కాస్త సమయం అవసరం: స్టువర్ట్‌ బ్రాడ్

ఆసీస్‌ స్టార్‌ పేసర్ మిచెల్ స్టార్క్‌కు స్టువర్ట్ బ్రాడ్ మద్దతుగా నిలిచాడు. టోర్నీ జరిగే కొద్దీ బౌలింగ్‌లో లయ అందుకుంటాడనే నమ్మకం ఉందన్నాడు.

Published : 30 Mar 2024 11:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ మినీ వేలంలో దాదాపు రూ. పాతిక కోట్లు సొంతం చేసుకున్నాడు మిచెల్‌ స్టార్క్‌. కానీ, రెండు మ్యాచుల్లోనూ ఒక్క వికెట్టూ తీయలేదు సరికదా 100 పరుగులు సమర్పించాడు. దీంతో అతడి ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. కోల్‌కతా రెండు మ్యాచుల్లోనూ గెలవడంతో ఇప్పటికిప్పుడు అతడి స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. అయితే, ఇలాగే కొనసాగితే మాత్రం కీలకంగా మారతాడని అనుకున్న జట్టు మేనేజ్‌మెంట్ కఠిన నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో స్టార్క్‌కు మద్దతుగా ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్ నిలిచాడు.

‘‘కోల్‌కతా వరుసగా రెండు విజయాలు సాధించింది. ఆ జట్టులో స్టార్క్‌ సభ్యుడు. కానీ, అతడి బౌలింగ్ ఆకట్టుకోలేదు. సాధారణంగా గెలిచిన టీమ్‌లో ఉంటే ఇలాంటి ప్రదర్శనలను ఎవరూ పట్టించుకోరు. అదే సమయంలో కోల్‌కతా రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయి ఉంటే మాత్రం స్టార్క్‌ స్థానంపై విమర్శలు వచ్చేవి. ప్రతి దానినీ భూతద్దంలో చూసే అవకాశం ఉండేది. కాబట్టి, స్టార్క్‌కు సమయం ఇచ్చేందుకు కోల్‌కతాకు వెసులుబాటు ఉంది. మరో నాలుగైదు మ్యాచ్‌లు ఆడిస్తే మంచిది. తప్పకుండా అతడు లయను అందుకోగలడు. ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ఎలా ఉంటాయో అతడికి ఇంకా అవగాహన కానట్లు ఉంది. భారీ మొత్తం దక్కించుకున్న తర్వాత ఆడుతున్న తొలి సీజన్‌లో ఒత్తిడి కూడా అంతే స్థాయిలో ఉంటుంది. వికెట్లు ఎక్కువ తీయాలనే అంచనాలూ ఉంటాయి. వాటన్నింటినీ దాటుకొని ముందుకు సాగాలంటే ఇంకొంత సమయం పడుతుంది’’ అని బ్రాడ్ వ్యాఖ్యానించాడు. 

ఇలాంటి బౌలింగ్‌తో బెంగళూరుకు కప్‌ కష్టమే: మైకెల్ వాన్

మూడు మ్యాచుల్లో రెండు ఓటములతో బెంగళూరు మళ్లీ పాయింట్ల పట్టికలో కిందికి వెళ్లిపోయింది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా.. బౌలింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమైంది. తాజాగా కోల్‌కతాతో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని కట్టడి చేయలేక చేతులెత్తేసింది. దీంతో బెంగళూరు బౌలింగ్‌ యూనిట్‌పై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ పోస్టు చేశాడు. ‘‘ఇలాంటి బౌలింగ్‌ దాడితో ఐపీఎల్‌ టైటిల్‌ను నెగ్గాలనుకోవడం అసాధ్యం. మిగతా జట్లు విజయం సాధించడానికి బౌలింగ్‌ కూడా కారణం. బెంగళూరు కల సాకారం కావాలంటే బౌలింగ్‌ మెరుగుపడాల్సిందే’’ అని వాన్ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు