Sunil Chhetri: ఛెత్రి ముగించేశాడు

భారత ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగితే అందరి కళ్లూ ఛెత్రిని వెతుకుతాయి. కానీ మైదానంలో అతడు కనిపించడు.

Updated : 07 Jun 2024 05:06 IST

ఫుట్‌బాల్‌కు వీడ్కోలు
కోల్‌కతా

భారత ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగితే అందరి కళ్లూ ఛెత్రిని వెతుకుతాయి. కానీ మైదానంలో అతడు కనిపించడు. జట్టు కష్టాల్లో ఉంటే ఛెత్రి గోల్‌ చేస్తాడులే అన్న భరోసా ఉంటుంది. ఇకపై ఆ ధీమా ఉండదు. భారత ఫుట్‌బాల్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన దిగ్గజ ఫుట్‌బాలర్‌ సునీల్‌ ఛెత్రి.. గోల్స్‌ వేట ఆపేశాడు. 19 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతూ.. గురువారం చివరి మ్యాచ్‌ ఆడేశాడు. 

భారత్‌ ఫుట్‌బాల్‌లో ఓ శకం ముగిసింది. ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో కువైట్‌తో మ్యాచ్‌ తనకు ఆఖరిదని గత నెలలోనే ప్రకటించిన భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ఇప్పుడు వీడ్కోలు పలికాడు. గురువారం భారత్, కువైట్‌ జట్ల మధ్య పోరు 0-0తో డ్రా అయింది.  భావోద్వేగాల నడుమ, కళ్లన్నీ తనపైనే ఉండగా మైదానంలో అడుగుపెట్టిన ఛెత్రి.. తన చివరి మ్యాచ్‌లో జట్టును గెలిపించడానికి తీవ్రంగా శ్రమించాడు. కానీ కువైట్‌ గట్టిపోటీనివ్వడంతో విజయం దక్కలేదు. అలసిన కాళ్లతో, తడిసిన శరీరంతో ఛెత్రి మైదానం వీడాడు. సహచర, ప్రత్యర్థి ఆటగాళ్లు, కోచ్‌లు ఛెత్రికి వీడ్కోలు పలికారు. చివరిసారిగా అతని ఆటను చూసేందుకు తరలివచ్చిన అభిమానులు చప్పట్లతో దిగ్గజానికి గుడ్‌బై చెప్పారు. స్టేడియంలో తిరిగి ప్రేక్షకులకు అభివాదం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తీవ్రమైన భావోద్వేగంతో ఆటగాళ్ల గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ మధ్య అతను నిష్క్రమించాడు. స్టాండ్స్‌లోని అతని కుటుంబ సభ్యులూ కన్నీటిపర్యంతమయ్యారు. అభిమానుల కళ్లూ తడిశాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే మొట్టమొదటి సారి ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ మూడో రౌండ్‌ చేరేందుకు అవకాశం ఉండేది. కానీ డ్రా కావడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ప్రస్తుతం 5 పాయింట్లతో ఉన్న భారత్‌ తన చివరి మ్యాచ్‌లో ఈ నెల 11న ఖతార్‌లో ఆడుతుంది. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఛెత్రి.. మరో రెండేళ్ల పాటు ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో బెంగళూరు జట్టుకు ఆడే అవకాశముంది. ‘‘నీ కెరీర్‌కు అభినందనలు. ఈ ఆటలో నువ్వో దిగ్గజానివి’’ అని మ్యాచ్‌కు ముందు ఛెత్రిని ఉద్దేశించి క్రొయేషియా కెప్టెన్‌ లూకా మోద్రిచ్‌ వీడియో సందేశం పంపించాడు. 


151

ఛెత్రి ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాడు అతనే. 


ఛెత్రి 2011లో అర్జున, 2019లో పద్మశ్రీ, 2021లో ఖేల్‌రత్న పురస్కారాలు అందుకున్నాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని