IND vs ENG: ‘అంపైర్స్ కాల్‌’పై బెన్‌స్టోక్స్‌ వ్యాఖ్యలకు సునీల్‌ గావస్కర్‌ కౌంటర్!

ఫీల్డ్‌ అంపైర్‌ వెలువరించే నిర్ణయాలు ఒక్కోసారి అనుకూలంగా.. మరొకసారి ప్రతికూలంగా వస్తుంటాయి. రెండింటినీ స్వీకరించాల్సి ఉంటుంది. అనవసరమైన వ్యాఖ్యలు చేయడం ఎవరికైనా తగదు. 

Published : 24 Feb 2024 02:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ 434 పరుగుల తేడాతో ఓటమిపాలైనప్పుడు.. కెప్టెన్ బెన్‌ స్టోక్స్ ‘అంపైర్స్‌ కాల్’పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు అలాంటిది వాడకుండా ఉంటే మంచిదనే అర్థంలో మాట్లాడాడు. ఇప్పుడు రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ ఓపెనర్ బెన్‌ డకెట్‌ ఒకసారి ఔట్‌ కాకుండా బయటపడ్డాడు. భారత్‌ డీఆర్‌ఎస్‌ తీసుకున్నా.. ‘అంపైర్స్‌ కాల్‌’ వల్ల పర్యటక జట్టుకు ప్రయోజనం కలిగింది. దీంతో టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కామెంట్రీ సందర్భంగా బెన్‌స్టోక్స్‌ కామెంట్లకు కౌంటర్ ఇచ్చాడు.

‘‘డకెట్‌ విషయంలోనే చూడండి. అది ‘అంపైర్స్ కాల్’. ఇప్పటి వరకు ఎవరైతే దీని వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యలు చేశారో.. ఇప్పుడు ఏమంటారో మరి. బంతి స్టంప్స్‌ను తాకుతోంది. అలాంటప్పుడు బెన్‌ ‘గుడ్‌బై’ అంటూ వెళ్లిపోవాలి కదా. కానీ, అంపైర్స్‌ కాల్‌ కావడం వల్ల లైఫ్‌ దొరికింది. ఒకవేళ అదే వ్యతిరేకంగా నిర్ణయం ఇచ్చి ఉంటే డీఆర్‌ఎస్‌లోనూ ఔట్‌గా తేలేది. అప్పుడు టెస్టుల్లో ఎక్కువ మ్యాచ్‌లు కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిపోతాయి’’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.

రాంచీ మైదానం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌ తరఫున ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు. ఓపెనర్లతోపాటు వన్‌డౌన్ బ్యాటర్‌ను ఆకాశ్‌ ఔట్‌ చేశాడు. అయితే, జో రూట్ (106*) శతకంతో ఇంగ్లాండ్‌ను కాపాడాడు. తొలి రోజు ఆట ముగిసేసమయానికి పర్యటక జట్టు ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని