Rishabh Pant: రిషభ్‌ పంత్‌.. నువ్వెప్పుడూ తలొంచకూడదని కోరుకుంటా: గావస్కర్

హైదరాబాద్‌ చేతిలో ఓటమితో దిల్లీ కెప్టెన్ రిషభ్‌ పంత్ నిరాశకు గురయ్యాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడిన తీరే దీనికి నిదర్శనం. ఈ క్రమంలో సునీల్ గావస్కర్‌ అతడికి ధైర్యం చెప్పాడు.

Published : 21 Apr 2024 10:23 IST

ఇంటర్నెట్ డెస్క్: అరుణ్‌జైట్లీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీపై హైదరాబాద్‌ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 267 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ 199 పరుగులకు ఆలౌటైంది. సొంత మైదానంలో భారీ ఓటమిని చవిచూడటంతో ఆ జట్టు కెప్టెన్ రిషభ్‌ పంత్ నిరాశకు గురయ్యాడు. మ్యాచ్‌ అనంతరం సునీల్ గావస్కర్‌తో అతడు మాట్లాడాడు.  

‘‘హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌కు మాకు ప్రధాన తేడా పవర్‌ ప్లే. వారు దూకుడుగా ఆడటంతో మాపై ఒత్తిడి మ్యాచ్‌ చివరి వరకూ కొనసాగింది. మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించాం. వారి బౌలింగ్‌ జట్టును పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. బ్యాటింగ్‌లో కనీసం వారిని 230 లోపు కట్టడి చేసి ఉంటే మ్యాచ్‌ను గెలిచే అవకాశాలు ఎక్కువ. మేం 260+ లక్ష్య ఛేదనకు దిగాల్సి వచ్చింది. సెకండ్‌ బ్యాటింగ్‌ సమయంలో మ్యాచ్‌ జరిగే కొద్దీ పిచ్‌ నెమ్మదించింది. మేం అనుకున్న విధంగా బంతి రాలేదు. ఫ్రేజర్ ఇచ్చిన శుభారంభాన్ని చివరి వరకూ కొనసాగించలేకపోయాం. తీవ్ర ఒత్తిడిలోనూ అతడి ఆటతీరు ఆకట్టుకుంది’’ అని పంత్ వ్యాఖ్యనించాడు. 

వ్యాఖ్యాత గావస్కర్ స్పందిస్తూ ‘‘పంత్‌.. నీ తలను ఎప్పుడూ దించొద్దని నేను కోరుకుంటా. ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. తప్పకుండా మీ జట్టు పుంజుకుంటుందని ఆశిస్తున్నా. ఎప్పుడూ నవ్వుతూనే ఉండు’’ అని చెప్పాడు. ‘‘థ్యాంక్యూ సర్. తప్పకుండా ప్రయత్నిస్తా’’ అంటూ పంత్ సమాధానం ఇచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని