Sunil Gavaskar: ఎంఎస్‌ ధోనీ.. ఇలాంటి కెప్టెన్‌ భవిష్యత్తులో కష్టమే: గావస్కర్‌

భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. ధోనీ లాంటి కెప్టెన్‌ ఇప్పటివరకూ లేరని, భవిష్యత్తులోనూ ఉండరని పేర్కొన్నారు.

Published : 17 Apr 2023 14:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni)పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించారు. ధోనీ లాంటి కెప్టెన్‌ భవిష్యత్తులో ఉండరని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌ సీజన్లలో (IPL) చెన్నై సూపర్‌కింగ్స్‌ (CSK) సారథిగా.. జట్టును కఠినమైన పరిస్థితుల నుంచి గట్టెక్కిచ్చిన తీరును కొనియాడారు. 

‘‘గడ్డు పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు బాగా తెలుసు. కానీ, అది కేవలం ధోనీ సారథ్యంలోనే సాధ్యపడుతుంది. 200 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా కష్టం. ఎక్కువ మ్యాచులకు సారథ్యం వహించడం భారమే కాక అతడి ప్రదర్శననూ ప్రభావితం చేస్తుంది. కానీ, ధోనీ ప్రత్యేకమైన ఆటగాడు, విభిన్నమైన కెప్టెన్. ధోనీ వంటి కెప్టెన్‌ ఇప్పటివరకు ఎవరూ లేరు. భవిష్యత్తులోనూ ఉండరు’’ అని గావస్కర్‌ పేర్కొన్నారు. ధోనీ సారథ్యంలో చెన్నై జట్టు నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఐదు సార్లు ఫైనల్స్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచింది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) స్టార్‌ విరాట్‌కోహ్లీ (Virat Kohli) ని కూడా గావస్కర్‌ కొనియాడారు. ‘‘ప్రతి మ్యాచ్‌లోనూ విరాట్‌ కోహ్లీ ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభాలను అందిస్తున్నాడు. ఆర్సీబీ ఎక్కువ పరుగులు సాధించడానికి ప్రధాన కారణం.. మ్యాచ్‌ ఆరంభంలో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడటమే. ఈ విషయంలో అతడికి చాలా క్రెడిట్‌ దక్కుతుంది’’ అని అన్నారు

ఐపీఎల్‌-16 (IPL-2023)లో భాగంగా నేడు సీఎస్‌కే ఆర్సీబీతో చిన్నస్వామి స్టేడియంలో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఇరుజట్లకు చాలా కీలకం. మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా టాప్‌ 4లోకి దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఆర్సీబీపై సీఎస్‌కే (20-10)నే ఎక్కువ విజయాలు నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని