World Cup 2023: వన్డే ప్రపంచకప్‌.. నాలుగో స్థానం కోసం ఆ ఇద్దరి మధ్య పోటీ: సునీల్ గావస్కర్

అక్టోబర్ 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ (world cup 2023) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో టీమ్‌ఇండియా తుది జట్టులో నాలుగో స్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ మధ్య పోటీ ఉండొచ్చని భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు.

Published : 07 Sep 2023 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఇటీవల భారత జట్టును ఎంపిక చేసింది. గాయాల కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer), కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)లకు జట్టులో చోటు దక్కింది. శ్రేయస్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తీసుకోగా.. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లను వికెట్ కీపర్లుగా తీసుకున్నారు. అయితే, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగు, ఐదు స్థానాల్లో ఎవరెవరూ ఆడతారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) ఐదో స్థానంలో ఆకట్టుకోగా.. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. గాయం తర్వాత కేఎల్‌ రాహుల్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. ఆసియా కప్‌ సూపర్‌-4లో అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఈ అంశంపై భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) మాట్లాడాడు. వన్డే ప్రపంచకప్‌లో నాలుగో స్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ మధ్య పోటీ ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు.

సూపర్‌-4లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌.. అభిమానులకు గుడ్‌న్యూస్‌

‘‘నాలుగో స్థానం కోసం శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మధ్య పోటీ ఉండొచ్చు. ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ ఐదో స్థానంలో ఆడటం ఖాయం. కేఎల్ రాహుల్ తుది జట్టులో లేకపోతే ఇషాన్‌ వికెట్ కీపింగ్ చేస్తాడు. ఒకవేళ ఇద్దరూ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటే  ఇషాన్‌ వికెట్ కీపింగ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే రాహుల్ గాయం పాలై శస్త్రచికిత్స చేయించుకుని జట్టులోకి వచ్చాడు. కాబట్టి.. ఇషాన్‌ వికెట్ కీపింగ్ చేయడం సమంజసం’’ అని సునీల్ గావస్కర్‌ వివరించాడు. భారత్ వన్డే ప్రపంచకప్‌ వేట అక్టోబర్‌ 8న (ఆస్ట్రేలియాతో, చెన్నై) మొదలవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని