Rajasthan Vs Bengaluru: ‘ఎలిమినేటర్‌’ ఫలితమూ ఏకపక్షమే.. మరోలా జరిగితే ఆశ్చర్యమే: గావస్కర్

బెంగళూరు వరుస విజయాలకు బ్రేక్‌ పడుతుందా? రాజస్థాన్‌ ఓటముల నుంచి బయటపడుతుందా? అనేది ఇవాళ అహ్మదాబాద్‌ వేదికగా జరగబోయే మ్యాచ్‌తో తేలిపోనుంది.

Updated : 22 May 2024 10:57 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌ లీగ్‌ స్టేజ్‌ సెకండాఫ్‌లో బెంగళూరు వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకొచ్చింది. మరోవైపు ఆరంభమంతా విజయాలతో సాగిన రాజస్థాన్‌ చివరికి వచ్చేసరికి ఓటములతో డీలాపడింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్‌ పోరు జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు.. రెండో క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌ ఫలితంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర విశ్లేషణ చేశాడు. ఫలితం ఏకపక్షమే అవుతుందని వ్యాఖ్యానించాడు. 

‘‘ఈ సీజన్‌లో ఆర్సీబీ అద్భుతం చేసిందనే చెప్పాలి. మొదట్లో ఆ జట్టును చూసిన వారెవరూ ఇలా ఆడతారని ఊహించలేదు. అందుకే, ఆ జట్టుకు ఫ్యాన్స్‌ నుంచి క్రేజ్‌ మామూలుగా దక్కలేదు. ఫాఫ్‌ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ సహా ఇతర సీనియర్లు బాధ్యతతో ఆడుతూనే కుర్రాళ్లను ముందుండి నడిపిస్తున్నారు. ఓపెనింగ్‌ జోడీ అదరగొడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తోంది. మరోవైపు రాజస్థాన్‌ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. గత ఐదింట్లో నాలుగు మ్యాచుల్లో ఓడింది. ఒకటి రద్దైంది. వారికి సరైన సాధన లేదనిపిస్తోంది. కోల్‌కతా తొలి క్వాలిఫయర్‌లో చేసిన మ్యాజిక్‌నే ఆర్‌ఆర్‌ చేస్తేనే విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. అలాకాకపోతే మరోసారి ఏకపక్ష మ్యాచ్‌ను చూస్తామనిపిస్తోంది. అయితే దూకుడు మీదున్న ఆర్సీబీనే ఆధిపత్యం చూపే అవకాశం ఉంది. అలా జరగకపోతే మాత్రం ఆశ్చర్యకరమే’’ అని గావస్కర్ వెల్లడించాడు. 

గత రెండుసార్లు ఏమైందంటే? 

రాజస్థాన్-బెంగళూరు (Rajasthan Vs Bengaluru) జట్లు ప్లేఆఫ్స్‌లో ఇప్పటి వరకు రెండు సార్లు తలపడ్డాయి. 2015లో ఆర్సీబీ విజయం సాధించగా.. 2022 సీజన్‌లో ఆర్‌ఆర్‌ గెలిచింది. ముచ్చటగా మూడోసారి తలపడుతుండటంతో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడగా.. బెంగళూరు 15, రాజస్థాన్‌ 13 మ్యాచుల్లో విజయం సాధించాయి. ప్రస్తుత సీజన్‌ లీగ్‌ స్టేజ్‌లో ఆర్సీబీపై ఆర్‌ఆర్‌ గెలిచింది. ఆ ఓటమికి ఈసారి బెంగళూరు ప్రతీకారం తీర్చుకొనేందుకు ఎదురు చూస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని