Virat Kohli: ఇంకెంతకాలం విరాట్‌ ఒక్కడే ఆడాలి.. మీరేం చేస్తున్నారు?: గావస్కర్

విరాట్ కోహ్లీ ఒక్కడిపైనే బ్యాటింగ్ భారం మోపడం సరైంది కాదని.. మిగతా వారూ సహకరిస్తే బెంగళూరు పరిస్థితి విభిన్నంగా ఉంటుందని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు.

Published : 30 Mar 2024 10:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెన్నైపై 21.. పంజాబ్‌పై 77.. కోల్‌కతాపై 83.. విరాట్ కోహ్లీ (Virat Kohli) చేసిన పరుగులు. తొలి మ్యాచ్‌ మినహా ప్రతి దాంట్లో అతడే టాప్‌ స్కోరర్. టాప్‌ ఆర్డర్‌ దారుణంగా విఫలమైంది. గత సీజన్లలో అదరగొట్టిన కెప్టెన్‌ డుప్లెసిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, రజత్ పటీదార్‌తోపాటు కొత్తగా వచ్చిన కామెరూన్ గ్రీన్ ప్రదర్శన ఇప్పుడు ఘోరంగా ఉంది. దీంతో బెంగళూరు బ్యాటింగ్‌ యూనిట్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇంకెంతకాలం టాప్‌ఆర్డర్‌లో విరాట్ ఒక్కడిపైనే జట్టు ఆధారపడుతుందో తెలియడం లేదని వ్యాఖ్యానించాడు. కప్‌ను సాధించాలనే కల నెరవేరాలంటే సమష్ఠిగా రాణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.

‘‘విరాట్ కోహ్లీ ఇంకెంతకాలం ఒక్కడే జట్టును లాక్కొని రాగలడు. ఎవరో ఒకరు అతడికి సహకారం అందించాలని మీకు (బెంగళూరు బ్యాటర్లను ఉద్దేశించి) అనిపించడం లేదా? కోల్‌కతాతో మ్యాచ్‌లో ఎవరైనా క్రీజ్‌లో ఉండుంటే.. 83 పరుగులు కాకుండా కనీసం 120 రన్స్‌ చేసేవాడు. క్రికెట్‌ జట్టుగా ఆడే ఆట. కేవలం ఒక్కరి వల్లే మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించడం కష్టం. కోహ్లీకి సరైన మద్దతు దొరకడం లేదు’’ గావస్కర్ వ్యాఖ్యానించాడు. 

గంభీర్‌ సీనియర్‌ ఆటగాడు: ఇర్ఫాన్‌ పఠాన్‌

బెంగళూరు - కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా విరాట్ కోహ్లీ - గౌతమ్ గంభీర్ ఆలింగనం చేసుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. గత సీజన్‌లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా చూశారు. కానీ, వీరిద్దరూ నవ్వుతూ కరచాలనం చేసుకున్న వీడియోలు వైరల్‌గా మారాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘గౌతమ్‌ గంభీర్‌ సీనియర్‌ ఆటగాడు. కోహ్లీ కరచాలనం ఇవ్వడానికి వచ్చినప్పుడు గంభీర్‌ ముందుకు రావడం అభినందనీయం. ఒక్కోసారి ఆటలో పరిధిని దాటుతుంటారు. వీరిద్దరి మధ్య జరిగింది కూడా గతమే. ఇప్పుడు వారిద్దరూ ఇలా కలుసుకోవడం బాగుంది’’ అని పఠాన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని