IND vs ENG: తాము లేకపోతే గెలవడం కష్టమనే వారికి ఇదొక హెచ్చరిక: సునీల్ గావస్కర్‌

ఇంగ్లాండ్‌పై సిరీస్‌ విజయాన్ని 2021లో ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో పోలుస్తూ సునీల్‌ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

Published : 03 Mar 2024 14:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను (IND vs ENG) భారత్ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఎక్కువగా యువకులతో కూడిన టీమ్‌ఇండియా బలమైన ఇంగ్లిష్‌ జట్టును సునాయాసంగా ఓడించడం విశేషం. సీనియర్లు విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా, రహానె, కేఎల్ రాహుల్ (తొలి టెస్టు మినహా) లేనప్పటికీ భారత్ గెలిచింది. సర్ఫరాజ్ ఖాన్‌, రజత్‌ పటీదార్‌, ఆకాశ్ దీప్‌, ధ్రువ్‌ జురెల్ ఈ సిరీస్‌లోనే అరంగేట్రం చేశారు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విజయం తప్పకుండా కొందరికి హెచ్చరిక అని పేర్కొన్నాడు. తాము లేకపోతే భారత్ గెలవలేదని అనుకొనే వారికి ఇదొక బలమైన సందేశమని వ్యాఖ్యానించాడు.

‘‘మూడేళ్ల కిందట.. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ కోసం కొందరు సీనియర్‌ క్రికెటర్లు మిస్‌ అయ్యారు. అయినా,  భారత్ అద్భుత విజయం సాధించింది. కేవలం 36 పరుగులకే (అడిలైడ్) ఆలౌటైన తర్వాత మెల్‌బోర్న్‌ టెస్టులో విజయం.. సిడ్నీ మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగాం. సిడ్నీలోనూ రిషభ్‌ పంత్‌ మరో అర్ధ గంటపాటు క్రీజ్‌లో ఉంటే భారత్‌ గెలిచేదేమో. అప్పుడు యువ క్రికెటర్లు చూపించిన తెగువ.. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ కనిపిస్తోంది. అందుకే, నేనెప్పుడూ చెబుతూ ఉంటా.. కేవలం పెద్ద స్టార్లు అవసరం లేదు. ఇకనుంచి ఎవరైనా ‘స్టార్లు’ తాము లేకపోతే భారత్‌ గెలవడం కష్టమని భావించే వారికి ఇది హెచ్చరికలాంటిది. క్రికెట్ అనేది జట్టుగా పోరాడేది. కేవలం ఒకరిద్దరి మీదనే ఆధారపడి ఉండదు. 

ఇంగ్లాండ్‌పై సిరీస్‌ విజయంలో కీలక పాత్ర కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు  కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌దే. వారిద్దరే కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. వారికి తగ్గట్గుగా మార్చుకున్నారు. ప్రోత్సాహం అందించి సహజసిద్ధమైన ఆటను బయటకు తీశారు. అందుకే, జట్టులో పెద్ద స్టార్లు లేకపోయినా.. పెద్ద మనసు ఉంటే చాలు విజయాలు సాధించడానికి అని నిరూపించారు. స్వదేశంలోనే సిరీస్‌ కాబట్టి గెలిచిందనే అభిప్రాయమూ కొందరిలో ఉంటుంది. కానీ, బజ్‌బాల్‌తో ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని భావించే ఇంగ్లాండ్‌ను అడ్డుకోవడం వంటి కఠిన సవాల్‌ను భారత యువ జట్టు తట్టుకోగలిగింది’’ అని గావస్కర్‌ వెల్లడించారు. భారత్ - ఇంగ్లాండ్‌ జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్‌ మార్చి 7న ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని