Pat Cummins: ఎక్కడో ఉన్న టీమ్‌ పైపైకి..అదే కమిన్స్‌ స్పెషల్‌’

గతేడాది ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచి నిరాశపర్చిన హైదరాబాద్‌.. ఈ సారి పాట్ కమిన్స్‌ (Pat Cummins) సారథ్యంలో ఏకంగా ఫైనల్స్‌కు దూసుకొచ్చింది. 

Updated : 27 May 2024 11:15 IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. మామూలుగా ఈ టీమ్‌ పాయింట్ల పట్టికలో ఎక్కడుంది అంటే ఆఖరి నుంచి చూడాలి అని జోకులు వేసేవారు. ఆ టీమ్‌ ప్రదర్శన కూడా ఇంచుమించు అలానే ఉండేది లెండి. అలాంటి టీమ్‌ను ఈ సారి ఏకంగా ఫైనల్‌కు చేర్చాడు పాట్ కమిన్స్‌ (Pat Cummins). తన కెప్టెన్సీతో బలమైన జట్లను సైతం బోల్తా కొట్టించి మెగా టోర్నీల్లో జట్టును రన్నరప్‌గా నిలిపాడు. కప్‌ గెలవనప్పటికీ.. ఆ జట్టు దూకుడు వెనక కమిన్స్‌దే కీలక పాత్ర. అతడిలో అంత స్పెషలేంటి? జట్టును ఎక్కడో అడుగు నుంచి టాప్‌లోకి ఎలా తీసుకొచ్చాడు?

స్టార్‌ ప్లేయర్లు ఉన్నారు.. కానీ కప్‌ గెలవరు. హైదరాబాద్‌ గురించి క్రికెట్‌ విశ్లేషకులు ఈ మాటే చెబుతుండేవారు. వారికి లక్‌ మిస్‌ అవుతుందేమో అనుకునేవారు ఇన్నాళ్లు. అయితే మిస్‌ అయ్యింది లక్‌ కాదు.. వీళ్లను నడిపించే నాయకుడు అని టీమ్‌ యాజమాన్యం భావించింది. అందుకే రూ..20.50 కోట్లకు మినీ వేలంలో పాట్‌ కమిన్స్‌ను కొనుగోలు చేసింది. అతనికి అంత అవసరమా? అని ప్రశ్న వేసినవాళ్లు జట్టును నడిపించిన తీరు చూసి ఇతనికి ఎంతైనా ఇవ్వొచ్చు అని మెచ్చేసుకున్నారు. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించగానే కమిన్స్‌ జట్టులో భారీ మార్పులు చేశాడు. యాజమాన్యం కూడా అతడికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో సరైన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. తెలివైన కెప్టెన్సీతో టీమ్‌ను ఫైనల్‌కు తీసుకొచ్చి తాను దక్కించుకున్న భారీ ధరకు వంద శాతం న్యాయం చేశాడు కమిన్స్‌. 

అదే సక్సెస్ మంత్ర  

ఆటగాడిగా ప్రతి క్రికెటర్‌ ఏదొక సమయంలో సహనాన్ని కోల్పోయి కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఐపీఎల్‌లో మొదటిసారి కెప్టెన్సీ చేపట్టిన కమిన్స్‌ ఎక్కడా భావోద్వేగాలను ప్రదర్శించలేదు. కూల్‌గా తన ప్రణాళికలను అమలు చేశాడు. కొన్నిసార్లు అవి విఫలమైనా తర్వాతి మ్యాచ్‌ల్లో కొత్త వ్యూహాలు అమలు చేసి సక్సెస్ అయ్యాడు. కమిన్స్‌ ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతాడు. అలాంటప్పుడే ప్లేయర్స్‌ మరింత ఆత్మవిశ్వాసంతో మెరుగైన ప్రదర్శన చేస్తారు అని నమ్ముతాడు. కమిన్స్‌ సక్సెస్ మంత్ర ఇదే అంటుంటారు విశ్లేషకులు. ఆస్ట్రేలియా జట్టులోని సహచర ఆటగాడు ట్రావిస్ హెడ్‌ సామర్థ్యమేంటో తెలిసిన కమిన్స్‌.. అతనికి యువ ఆటగాడు అభిషేక్ శర్మను జోడీగా పంపి మంచి ఫలితం రాబట్టాడు. విధ్వంసకర ఆటతో రికార్డు స్థాయి ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు నెలకొల్పిందీ జోడీ. తద్వారా విజయాలూ తెచ్చి పెట్టింది.

సరైన సమయంలో కీలక నిర్ణయాలు 

సీనియర్‌ ఆటగాళ్లు విఫలమవుతున్నా మరో ఛాన్స్‌ అంటూ ఇచ్చీ ఇచ్చీ ఇబ్బందిపడిన కెప్టెన్లను ఈ ఐపీఎల్‌లో చూసే ఉంటారు. కానీ కమిన్స్‌ అలా చేయలేదు. మయాంక్ అగర్వాల్‌, ఐదెన్‌ మార్‌క్రమ్‌ లాంటి సీనియర్‌ ఆటగాళ్లు వరుసగా విఫలమవడంతో పక్కన పెట్టాడు. యంగ్‌ ప్లేయర్‌, ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డికి అవకాశాలిచ్చి ప్రోత్సహించాడు. నితీశ్ నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇక తమది కాని రోజున వేగంగా వికెట్లు పడిన సందర్భాల్లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తెలివైన మార్పులు చేశాడు కమిన్స్. నితీశ్‌ను ముందుగా ఆడించి పవర్‌ హిట్టర్‌ క్లాసెన్‌ను చివరి ఓవర్లలో క్రీజులో ఉండేలా చూసుకున్నాడు.

ఇక సీజన్‌ చివర్లో రాహుల్ త్రిపాఠిని తుది జట్టులోకి తీసుకొచ్చి సక్సెస్ కొట్టాడు కమిన్స్‌. మార్‌క్రమ్‌ కూడా ఇలా వచ్చి మంచి ఇన్నింగ్స్‌ ఆడి మెప్పించాడు. ఎవరిని ఎప్పుడు తీసుకురావాలో కమిన్స్‌కు బాగా తెలుసు అనడానికి మరో ఉదాహరణ అభిషేక్‌ శర్మ బౌలింగ్‌. చెన్నై పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తుందని గ్రహించి అభిషేక్‌కు బంతి ఇచ్చి 2 వికెట్ల తీయించి జట్టును గెలిపించేలా చేశాడు. ఇక రెండో క్వాలిఫయర్‌లోనే షాబాజ్‌ అహ్మద్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకోవడం వెనుక ఉన్న మాస్టర్‌ మైండ్స్‌లో కమిన్స్‌ కూడా ఉన్నాడు. 

ఆటగాడిగానూ అదుర్స్‌ 

ఓ వైపు ప్రత్యర్థి జట్టును ఎలా చిత్తు చేయాలనే దాని గురించి ప్రణాళికలు రచిస్తూనే ఆటగాడిగా అదరగొడుతున్నాడు కమిన్స్‌. కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ అవతలి జట్టును దెబ్బతీస్తున్నాడు. ఇప్పటివరకు 18 వికెట్లు తీశాడు. జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటర్‌గానూ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో 147.37 స్ట్రెక్‌రేట్‌తో 136 పరుగులు చేశాడు. ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని చవిచూసినా.. ఇక్కడి వరకు చేరిన ఆ జట్టు పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 

- ఇంటర్నెట్ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని