Aiden Markram: మేం గెలవాలన్న కసితో ఆడలేదు.. SRH బ్యాటర్లపై మార్‌క్రమ్‌ అసహనం

Eenadu icon
By Sports News Team Updated : 25 Apr 2023 10:49 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

హైదరాబాద్‌: ఐపీఎల్‌ (IPL 16)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)కు మళ్లీ పరాభవం తప్పలేదు. బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యంతో చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడిపోయింది. వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. మ్యాచ్‌ అనంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ మార్‌క్రమ్‌ (Aiden Markram) దీనిపై స్పందిస్తూ బ్యాట్స్‌మెన్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ బ్యాటింగ్‌ దళం ఏ మాత్రం ఉత్సాహంగా ఆడలేదని అసహనం ప్రదర్శించాడు. (SRH vs DC)

‘‘మేం (జట్టును ఉద్దేశిస్తూ) బ్యాట్‌తో మళ్లీ విఫలమయ్యాం. కసిగా ఆడలేకపోయాం. దురదృష్టవశాత్తూ.. మేం గెలవాలన్న ఉద్దేశంతో ఆడుతున్న జట్టులా కన్పించట్లేదు. అయితే దీన్నుంచి మేం పాఠాలు నేర్చుకోవాలి. ఛేదన మరింత ఉత్తమంగా ఎలా చేయాలి.. జట్టులో ఆటగాళ్లంతా మరింత స్వేచ్ఛగా, ఐకమత్యంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. మా జట్టులో చాలా మంచి ఆటగాళ్లు, బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. కానీ, ఉత్తమంగా ఆడాలన్న శ్రద్ధ లేకపోవడం వల్లే మేం నిరాశ చెందాల్సి వస్తుంది. ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన చేసేందుకు మరింత శ్రమించాల్సి ఉంది’’ అని మార్‌క్రమ్‌ (Aiden Markram) తెలిపాడు.  ఇక.. ఈ ఓటమికి బౌలర్లు ఏ మాత్రం కారణం కాదని, పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు ఉత్తమంగా బౌలింగ్‌ చేశారని కెప్టెన్‌ ప్రశంసించాడు.

వార్నర్‌ సెలబ్రేషన్స్‌ వైరల్‌..

బౌలర్ల పోరాటంతో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals).. అయిదు ఓటముల తర్వాత వరుసగా రెండో విజయాన్నందుకుంది. అదీ హైదరాబాద్‌పై గెలవడం దిల్లీకి మరింత ప్రత్యేకమనే చెప్పాలి. దిల్లీ కెప్టెన్‌ వార్నర్‌ (David Warner).. గతంలో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించి విభేదాలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత రాత్రి హైదరాబాద్‌పై గెలవగానే వార్నర్‌ ఆనందంతో చిందులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్ చేయగా.. వార్నర్‌ రియాక్షన్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. దిల్లీ విజయంపై వార్నర్‌ స్పందిస్తూ.. ‘‘ఐదు ఓటముల తర్వాత మేం పుంజుకున్నాం. వరుసగా మూడో విజయాన్ని కూడా అందుకుంటామని ధీమాగా ఉన్నాం. దిల్లీ తర్వాతి మ్యాచ్‌ మళ్లీ హైదరాబాద్‌తోనే. అది కూడా గెలుస్తాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు.


Tags :
Published : 25 Apr 2023 10:43 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు