ODI WC 2023: లేక లేక ఛాన్స్ వస్తే.. అనుకోకుండా జట్టులోకి వచ్చి అదరహో

కొందరు ఆటగాళ్లు అనుకోకుండా ఒక అవకాశం దక్కితే దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు. అదిరే ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తున్నారు.

Updated : 30 Oct 2023 19:26 IST

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ఒక ఆసక్తికర ట్రెండ్ నడుస్తోంది. టీమ్‌మేనేజ్‌మెంట్ శీత కన్నేయడంతోనో, మరో కారణంతోనో తుది జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లు.. అనుకోకుండా ఒక అవకాశం దక్కితే దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు. అదిరే ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తున్నారు. మ్యాచ్ విన్నర్లుగా మారి.. ఇన్నాళ్లూ వాళ్లను పక్కన పెట్టినందుకు టీమ్ మేనేజ్మెంట్ చింతించేలా చేస్తున్నారు. ఆ ఆటగాళ్లెవ్వరో చూద్దాం పదండి.

మంచి వేగం, బౌలింగ్‌లో కచ్చితత్వం, అనుభవం.. అన్నీ ఉన్నా సరే టీమ్‌ఇండియా సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమి.. ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకోలేకపోయాడు. ప్రపంచకప్‌ ముంగిట ఆస్ట్రేలియాపై అయిదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టినా సరే.. అతణ్ని కాదని శార్దూల్ ఠాకూర్‌నే తుది జట్టులో ఆడిస్తూ వచ్చారు. ఐతే న్యూజిలాండ్‌తో మ్యాచ్ ముంగిట హార్దిక్ పాండ్య గాయపడి జట్టుకు అందుబాటులో లేకుండా పోవడంతో షమిని తుది జట్టులో ఆడించింది భారత్. అతను అయిదు వికెట్లతో అదరగొట్టాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ రెచ్చిపోయి బౌలింగ్ చేసిన షమి.. నాలుగు వికెట్లతో ఆ జట్టు నడ్డి విరిచాడు. ఇంత గొప్ప బౌలర్‌ను ఇన్నాళ్లూ ఎందుకు పక్కన పెట్టారా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు షమి.

మన కుల్‌దీప్ యాదవ్ లాగే చైనామన్ స్పిన్నర్ అయిన తబ్రేజ్ షంసి కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికా జట్టులో ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా ఉంటున్నాడు. ఐతే ప్రపంచకప్ జరుగుతోంది స్పిన్ పిచ్‌లకు నెలవైన భారత గడ్డ మీద అయినా.. కేశవ్ మహరాజ్ ఒక్కడినే తుది జట్టులో ఆడిస్తూ షంసిని పక్కన పెట్టింది దక్షిణాఫ్రికా. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో అతణ్ని ఆడించలేదు. ఐతే ఆస్ట్రేలియాతో లఖ్‌నవూలో జరిగిన మ్యాచ్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనాతో షంసిని కూడా తుది జట్టులోకి తీసుకున్నారు. ఆ మ్యాచ్‌లో అతను రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక చెన్నైలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అయితే షంసి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. నాలుగు కీలక వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దక్షిణాఫ్రికాను గెలిపించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

నాలుగు రోజుల ముందు వరకు శ్రీలంక ప్రపంచకప్ జట్టులో సభ్యుడే కాదు సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్. ఐతే ఫాస్ట్‌బౌలర్ పతిరన గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతడికి అనుకోకుండా అవకాశం దక్కింది. టోర్నీ మధ్యలో జట్టులోకి వచ్చిన మాథ్యూస్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఇంగ్లాండ్‌పై రెండు కీలక వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో అతడికి అవకాశం రాలేదు కానీ.. వస్తే అందులో కూడా అదరగొట్టేవాడేమో. ఇదే మ్యాచ్‌లో మూడు వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన లహిరు కుమార కూడా ముందు టీమ్ మేనేజ్మెంట్ నిరాదరణకు గురైనవాడే. కొంచెం లేటుగా అతణ్ని తుది జట్టులోకి తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌పై అతను అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాడు.

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ దళం ఉన్న జట్టు ఏదంటే అఫ్గానిస్థాన్‌ పేరే చెప్పాలి. రషీద్ ఖాన్, ముజీబ్ రెహ్మాన్, మహ్మద్ నబి లాంటి ప్రమాదకర స్పిన్నర్లతో అఫ్గాన్ ఎంత పెద్ద జట్టుకైనా సవాలు విసిరే స్థితిలో ఉంది. ఐతే ఈ ముగ్గురూ తుది జట్టులో కచ్చితంగా ఉండాల్సిన ఆటగాళ్లు కావడంతో మరో యువ ప్రతిభావంతుడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. అతనే.. నూర్ అహ్మద్. అండర్-19 స్థాయి నుంచే అదరగొడుతూ అఫ్గాన్ జాతీయ జట్టులోకి వచ్చేశాడు ఈ మిస్టరీ స్పిన్నర్. ఇప్పటికే ఐపీఎ‌ల్‌లో కూడా ఆడేసిన ఈ కుర్రాడికి ప్రపంచకప్‌లో కొంచెం లేటుగా అవకాశం దక్కింది. చెన్నైలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడిస్తే రషీద్, ముజీబ్‌ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన చోట మూడు కీలక వికెట్లతో అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో అఫ్గాన్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ఇప్పటిదాకా ప్రపంచకప్‌లో ఆడకపోవడానికి సెలక్టర్లు లేదా టీమ్ మేనేజ్మెంట్ శీతకన్నేయడం కారణం కాదు. అతను గాయం వల్ల టోర్నీలో సగం వరకు జట్టుకు అందుబాటులో లేడు. ఫిట్‌నెస్‌ సాధించి తుది జట్టులోకి రావడం ఆలస్యం.. తన దూకుడు చూపించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మెరుపు శతకం (67 బంతుల్లో 109) సాధించాడు. ఇదే మ్యాచ్‌లో ఆకట్టుకున్న న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ (ఒక వికెట్, 58 పరుగులు) కూడా ఇన్నాళ్లూ తుది జట్టుకు దూరంగా ఉన్నవాడే. ఆలస్యంగా వచ్చిన అవకాశాన్ని అతను కూడా సద్వినియోగం చేసుకుని త‌న విలువ‌ను చాటి చెప్పాడు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు