IPL 2024: వారికి పార్టీలు ఎక్కువ.. అందుకే ఒక్క టైటిలూ లేదు: సురేశ్‌ రైనా

చెన్నై జట్టు విజయవంతంగా కొనసాగడంలో సురేశ్‌ రైనా కూడా కీలక పాత్ర పోషించాడు. ధోనీ తర్వాత ఆ జట్టు అభిమానులు ఎక్కువగా ఇష్టపడేది క్రికెటర్ రైనానే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు.

Updated : 22 Apr 2024 11:46 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు కొన్ని జట్లు ఒక్క టైటిల్‌నూ నెగ్గలేదు. ఆ జాబితాలో బెంగళూరు, పంజాబ్, దిల్లీ ఉన్నాయి. కొత్తగా వచ్చిన లఖ్‌నవూ కూడా సాధించలేదు. ముంబయి, చెన్నై ఐదేసి సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. స్టార్‌ క్రికెటర్లు ఉన్నా పైనాలుగు జట్లకు టైటిల్ కల మాత్రం నెరవేరలేదు. దీనికి కారణం ఏంటనే దానిపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా (Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రైనా చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.  

‘‘కొన్ని జట్లు ఎక్కువగా పార్టీలు ఇస్తుంటాయి. ఐపీఎల్‌లో రెండు, మూడు టీమ్‌లే ఇప్పటి వరకు టైటిల్‌ సాధించలేదు. చెన్నై ఎప్పుడూ పార్టీలు ఇవ్వలేదు. అందుకే, ఆ జట్టు ఐపీఎల్‌లో అత్యంత విజయవంతంగా కొనసాగుతోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. రెండు సార్లు సీఎల్‌టీ (ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీ)ని సొంతం చేసుకుంది. ముంబయి కూడా ఇలా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. లేట్ నైట్‌ పార్టీల వల్ల చాలా నష్టం కలుగుతుంది. ఆలస్యంగా నిద్రపోతే.. మరుసటి రోజు ఎలా ఆడతారు? మే, జూన్‌లో ఎండలు తీవ్రంగా వుంటాయి. అలాంటప్పుడు మధ్యాహ్నం జరిగే మ్యాచుల్లో చురుగ్గా ఉండాలంటే తగినంత విశ్రాంతి అవసరం. రాత్రంతా పార్టీలు చేసుకుంటే ఎలా? భారత జట్టు తరఫున ఆడేటప్పుడూ ఇలాంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సరిగ్గా ఆడకపోతే కెప్టెన్‌ మనల్ని ఎందుకు జట్టులో ఉంచుతాడు? ఇప్పుడు నేను క్రికెట్‌ నుంచి బయటికొచ్చా. ఎప్పుడైనా పార్టీ చేసుకోవచ్చు (నవ్వుతూ)’’ అని రైనా వ్యాఖ్యానించాడు. 

డుప్లెసిస్‌ వ్యాఖ్యలు సరికాదు

కోల్‌కతాతో మ్యాచ్‌లో మయాంక్‌ దగర్ ఓవర్‌లో 20 పరుగులు రావడంపై బెంగళూరు కెప్టెన్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడి ఓవర్‌ తర్వాత తమపై ఒత్తిడి పెరిగిందని డుప్లెసిస్‌ వ్యాఖ్యానించడంపై రైనా స్పందించాడు. ‘‘మ్యాచ్‌ అనంతరం ఓ జూనియర్‌ ఆటగాడిని ఇలాంటి మాటలు అనకూడదు. కెప్టెన్‌గా నువ్వు కూడా పరుగులు చేయలేదు. నేను అతడితో చాలాకాలం కలిసి ఆడా. నాకు మంచి స్నేహితుడు. కానీ, యువ క్రికెటర్లను ప్రోత్సహించాలి. రోహిత్‌ శర్మ ఇలా ఎప్పుడూ మాట్లాడడు’’ అని రైనా అన్నాడు. ఈ సందర్భంగానే భారత జట్టుకు రోహిత్ తర్వాత కెప్టెన్‌ అయ్యే అవకాశాలు గిల్‌కు అధికంగా ఉన్నాయని రైనా తెలిపాడు.

నా తొలి అకాడమీ కశ్మీర్‌లోనే..

‘‘నా తొలి క్రికెట్ అకాడమీని జమ్ముకశ్మీర్‌లోనే ప్రారంభించాలని కోరుకున్నా. అక్కడ అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌లోకి నాణ్యమైన ఆటగాళ్లు వస్తారు. అంతేకాకుండా.. అక్కడి చిన్నారులు ఓ పక్క బంతి-బ్యాట్‌.. మరోవైపు ఏకే 47లు చూస్తున్నారు. క్రికెట్‌ వారికి మంచి ఎంపిక కావాలి. అక్కడక్కడా రాళ్లు విసిరే ఘటనలు జరిగినా.. నేను మాత్రం వారిని బ్యాట్ పట్టించేందుకే ప్రయత్నిస్తా’’ అని రైనా తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని