IND vs PAK: ‘మిస్టర్ 360’ కాదు.. అతడు ఉండటమే భారత్‌కు ప్లస్‌: సూర్య చిన్ననాటి కోచ్

టీమ్‌ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో ఆడనుంది. ఇప్పటికే ఐర్లాండ్‌ను చిత్తు చేసిన భారత్‌ సమరోత్సాహంతో ఉంది.

Updated : 09 Jun 2024 17:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇప్పుడు క్రికెట్ అభిమానుల కళ్లన్నీ భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌పైనే. టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) దాయాదుల పోరు చూసేందుకు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. టీమ్‌ఇండియా నుంచి ఎవరు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్, విరాట్, సూర్య.. ఇలా టాప్‌ ఆర్డర్‌ దంచి కొట్టాలనేది భారత అభిమానుల ఆకాంక్ష. అయితే, టీమ్‌ఇండియాకు అదనపు బలం మాత్రం రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) అని ‘మిస్టర్ 360’ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ (Suryakumar Yadav) చిన్ననాటి కోచ్ అశోక్ అశ్వాల్కర్ వ్యాఖ్యానించారు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని వచ్చి చక్కటి ప్రదర్శన చేయడం సాధారణ విషయం కాదన్నారు.

‘‘భారత జట్టుకు అతిపెద్ద ప్లస్‌ పాయింట్‌ పంత్. ఆ ఘటన నుంచి కోలుకుని ఇక్కడికి రావడం అద్భుతం. అతడి మైండ్‌సెట్‌ దృఢమైంది. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగి ఐపీఎల్‌లో సత్తా చాటాడు. ఇప్పుడు యూఎస్‌ఏలోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేస్తున్నాడు. అతడు క్రీజ్‌లో ఉంటే చాలు మ్యాచ్‌ మన చేతుల్లో ఉన్నట్లే. పాక్‌తో మ్యాచ్‌లో మాత్రం రోహిత్ - విరాట్ మంచి పునాది వేస్తే తిరుగుండదు. వీరిద్దరి నుంచి మంచి ఇన్నింగ్స్‌ రాకపోతే ఇతర బ్యాటర్లపై ఒత్తిడి పెరగడం ఖాయం’’ అని అశోక్‌ వ్యాఖ్యానించారు.

రోహిత్ - ఆమిర్‌ మధ్య పోటీ చూడాలనుంది: యువరాజ్‌

‘‘భారత్ - పాక్‌ మ్యాచ్‌ అంటే ఓ ఎమోషన్‌. ఇరు జట్ల మధ్య పోరుకు చాలా చరిత్ర ఉంది. పాక్‌కు చాలా మంచి బౌలర్లు ఉన్నారు. ఆ జట్టుతో పోలిస్తే మన బ్యాటింగ్‌ లైనప్ బలంగా ఉంటుంది. అందుకే, రోహిత్ VS మహమ్మద్ ఆమిర్ మధ్య పోరును చూడాలనుకుంటున్నా. షహీన్ - కోహ్లీలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరమే’’ అని భారత మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని