Surya Kumar yadav: ప్రపంచకప్‌ కోసం 15 కిలోలు తగ్గి

టీ20 ప్రపంచకప్‌ కోసం ఉత్సాహంగా సిద్ధమైన టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav) మునుపెన్నడూ లేనంత ఫిట్‌గా కనిపిస్తున్నాడు.

Updated : 02 Jun 2024 05:42 IST

న్యూయార్క్‌: టీ20 ప్రపంచకప్‌ కోసం ఉత్సాహంగా సిద్ధమైన టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav) మునుపెన్నడూ లేనంత ఫిట్‌గా కనిపిస్తున్నాడు. స్పోర్ట్స్‌ హెర్నియా శస్త్రచికిత్స తర్వాత పెరిగిన బరువును అతను తగ్గించుకోవడమే అందుకు కారణం. ఈ ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని సూర్య 15 కిలోల బరువు తగ్గాడు. అందుకు కఠినమైన ఆహార నియమాలను పాటించాడు. నిరుడు డిసెంబర్‌లో చీలమండ శస్త్రచికిత్స చేయించుకున్న సూర్యకు ఆ తర్వాత స్పోర్ట్స్‌ హెర్నియా శస్త్రచికిత్స కూడా అవసరమైంది. దీని కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఈ సమయంలో పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఈ టీ20 నంబర్‌వన్‌ బ్యాటర్‌ చాలా కష్టపడ్డాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకున్న అతను కసరత్తులు చేయడంతో పాటు ప్రత్యేక ఆహార నియమాలను పాటించాడు.

అన్నం మొత్తానికే తినలేదు. గోధుమలతో కాకుండా ఇతర పిండితో చేసిన రొట్టెలు తిన్నాడు. ప్రోటీన్లు అధికంగా లభించే గుడ్లు, మాంసం, చేపలు తీసుకున్నాడు. పాల ఉత్పత్తుల జోలికే వెళ్లలేదు. కూరగాయలు, నట్స్, అవకాడోను ఆహారంలో భాగం చేసుకున్నాడు. ‘‘ఇప్పుడు సూర్య కాస్త బక్కగా, మరింత బలంగా, కండలతో కనిపిస్తున్నాడు. ప్రత్యేక ఆహార నియమాలతో ఈ లక్ష్యాన్ని చేరుకున్నాం. శస్త్రచికిత్స తర్వాత ఔషధాల కారణంగా అతని బరువు పెరిగింది. అతను 15 కిలోలు తగ్గాడు. ఇందులో 13 కిలోలు కొవ్వే ఉంది. అతని కోసం కఠినమైన ఆహార నియమాలను రూపొందించాం. ఎన్‌సీఏతో సమన్వయం చేసుకుని పనిచేశాం. కోలుకునే దశలో ఉన్న అథ్లెట్లు అధిక క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందుకే సూర్యకు గుడ్లు, మాంసం, చేపలు, కూరగాయలు, నట్స్, అవకాడో తదితర ఆహారాన్ని అందించాం’’ అని బరువు తగ్గేందుకు సూర్యతో కలిసి పనిచేసిన పోషకాహార నిపుణురాలు శ్వేత భాటియా వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని