Suryakumar Yadav: త్వరలో ఫీల్డింగ్‌కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య

‘ఇంపాక్ట్‌’ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్‌ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్‌లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్‌లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు.

Published : 19 Apr 2024 13:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ‘మిస్టర్ 360’ బ్యాటర్, టీ20ల్లో టాప్‌ ర్యాంకర్‌ సూర్యకుమార్‌ యాదవ్ (Surya Kumar Yadav) మరోసారి హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. మడమ, స్పోర్ట్స్‌ హెర్నియా శస్త్రచికిత్స కారణంగా ఐపీఎల్‌ 17వ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు అతడు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఫిట్‌నెస్‌ సాధించిన ఈ ముంబయి బ్యాటర్ కేవలం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే  బరిలోకి దిగాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. పంజాబ్‌పై 78 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తన ఫిట్‌నెస్‌పై అతడు స్పందించాడు.  

‘‘ఫిట్‌నెస్‌పరంగా వందశాతం సిద్ధమయ్యే దిశగా సాగుతున్నా. ఫీల్డింగ్‌ కోసం నెమ్మదిగా ట్రైనింగ్‌ మొదలెట్టా. తప్పకుండా త్వరలోనే 40 ఓవర్లపాటు (బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ కలిపి) మైదానంలో ఉండేందుకు ప్రయత్నిస్తా. జీవితంలో ఆటుపోట్లు సహజం. వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలి. ఇక నా బ్యాటింగ్‌ శైలిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గను. టీ20 ఫార్మాట్‌లో దూకుడు ఉండాల్సిందే. మేనేజ్‌మెంట్‌ కూడా దీనిపై ప్రత్యేకంగా సూచనలు చేయదు. ఈ మ్యాచ్‌కు ముందు రోజు బ్యాటర్ల మీటింగ్‌ జరిగింది. టాప్‌ ఆర్డర్‌లో కనీసం ఒక్కరైనా 17 ఓవర్ల వరకు క్రీజ్‌లో ఉండాలనుకున్నాం.  పిచ్‌ కఠినంగా ఉందనే భావనతో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశాం. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచితేనే బౌలర్లకు తేలికవుతుంది. పంజాబ్‌పై నేను క్రీజ్‌లో ఎక్కువ సమయం ఉండేందుకు ప్రయత్నించా. రోహిత్ ఔటైన తర్వాత ఆ బాధ్యతను నేను స్వీకరించా. నా బ్యాటింగ్‌ తీరులో మాత్రం ఎలాంటి మార్పులేదు’’ అని సూర్య తెలిపాడు. 

ఆఖరి ఓవర్‌కు రోహిత్‌ కెప్టెన్సీ!

చివరి ఓవర్‌లో 12 పరుగులు చేయాల్సిన క్రమంలో.. రోహిత్ శర్మ ముంబయి బౌలర్‌కు కీలక సూచనలు చేస్తూ కనిపించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ.. జట్టుకు అవసరమైన వేళ అతడు ముందుండి నడిపించాడని అభిమానులు ఖుషీ అయ్యారు. ఆకాశ్‌ మధ్వాల్‌ బంతినందుకోవడంతో.. రోహిత్‌ అతడి వద్దకు వచ్చి ఫీల్డింగ్‌ను సెట్‌ చేశాడు. బంతిని ఎలా వేయాలనేదానిపై సూచనలూ ఇచ్చాడు. పాండ్య కూడా అక్కడే ఉన్నాడు. మధ్వాల్ కట్టుదిట్టంగా బంతులేయడంతో ముంబయి 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని