Suryakumar Yadav: ఒమన్‌ ఎలా ఆడిందంటే...: సూర్యకుమార్‌ యాదవ్‌

Eenadu icon
By Sports News Team Updated : 20 Sep 2025 16:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా కప్‌లో (Asia cup) భాగంగా శుక్రవారం అబుదాబీ వేదికగా టీమ్‌ ఇండియా (Team India), ఒమన్‌ తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 189 పరుగుల విజయలక్ష్యాన్ని ఒమన్‌ దాదాపు ఛేదించినంత పని చేసింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు బాగా ఆడిందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) అన్నాడు. అలాగే హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌ తమవంతు పాత్ర పోషించారని పేర్కొన్నాడు. హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) రనౌట్‌ గురించి కూడా మాట్లాడాడు. 

‘మొదటి రెండు మ్యాచ్‌లు బెంచ్‌కే పరిమితమై.. మూడో మ్యాచ్‌లో వెంటనే రిథమ్‌లోకి రావాలంటే కాస్త కష్టమే. అయినప్పటికీ హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌ చక్కగా తమ వంతు పాత్ర పోషించారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌ బాగా జరిగింది. ఒమన్‌ గొప్పగా ఆడింది. వాళ్ల కోచ్‌ సులక్షణ్‌ కులకర్ణిలో పట్టుదల చాలా ఎక్కువ. అది ఒమన్‌ జట్టు ఆటలో కనిపించింది. వారు అద్భుతంగా ఆడారు. నేను వారి బ్యాటింగ్‌ను ఆస్వాదించా’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ అన్నాడు.

అలాగే తాను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చాలా దిగువకు వెళ్లిపోవడం గురించి కూడా అతడు మాట్లాడాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అసలు బ్యాటింగ్‌కు రాలేదు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) కంటే కూడా దిగువకు వెళ్లాడు. ‘నేను తర్వాతి మ్యాచ్‌లో నం.11 కంటే ముందు బ్యాటింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తాను’ అని ఈ విషయమై సూర్యకుమార్‌ యాదవ్‌ చమత్కరించాడు. హార్దిక్‌ పాండ్య రనౌట్‌ కావడం దురదృష్టకరమన్నాడు. 

సంజు శాంసన్‌ (Sanju Samson) కూడా ఒమన్‌ జట్టు బాగా ఆడిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా వారి బౌలర్లను ప్రశంసించాడు. ‘మైదానంలో చాలా వేడిగా ఉంది. గత కొన్ని వారాలుగా నేను నా ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టాను. మేము ఇప్పుడే కొత్త ట్రైనర్‌ని తీసుకొని బ్రాంకో టెస్ట్ చేశాం. ఒమన్‌ ఆటగాళ్లు నిజంగా బాగా బౌలింగ్ చేశారు. పవర్‌ప్లేలో కూడా వారు చక్కగా బంతులు సంధించారు. స్వింగ్‌ కూడా రాబట్టారు’ అని సంజుశాంసన్‌ అన్నాడు.

టీమ్‌ఇండియా సూపర్‌-4లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా తలపడనుంది. గ్రూప్‌ స్టేజీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్‌-4లో టీమ్‌ఇండియా సత్తా చాటాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. 

Tags :
Published : 20 Sep 2025 16:06 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు