IPL 2024: అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!

ఐపీఎల్‌లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్‌ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది.

Updated : 18 Apr 2024 16:18 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌ సాఫీగా సాగిపోతోంది. గతంలో వలే స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతాలు మళ్లీ చోటు చేసుకోకుండా బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు కఠిన చర్యలు చేపట్టారు. దీని కోసం బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్‌ (ACU) కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నలుగురు అనుమానిత బుకీలను ఏసీయూ అధికారులు గుర్తించినట్లు వార్తలొస్తున్నాయి. వారిని లగ్జరీ బాక్స్‌ల నుంచి బయటకు తీసుకొచ్చి స్థానిక పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. మరో ఇద్దరిని పొరపాటుగా గుర్తించినట్లు తేలడంతో వదిలేశారు. అయితే, అధికారికంగా ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

ఆ రెండు మ్యాచ్‌ల సందర్భంగా.. 

మార్చి 28న జైపుర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం వేదికగా రాజస్థాన్‌-దిల్లీ మధ్య మ్యాచ్‌ జరిగింది. కార్పొరేట్‌ బాక్స్‌లో ఇద్దరు అనుమానితులను యాంటీ కరప్షన్ బృందం గుర్తించింది. వారిని పోలీసులకు అప్పగించడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇక రెండో ఘటన.. ముంబయిలోని వాంఖడే మైదానంలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 1న రాజస్థాన్‌తో ముంబయి తలపడింది. ఇక్కడా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. అయితే, వారి ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి అనుమానించదగిన సమాచారం లభించకపోవడంతో వదిలేశారు. వారు తిరిగి ఎంసీఏ ప్రెసిడెంట్‌ బాక్స్‌ వద్దకు చేరుకొన్నారు. కానీ,  అక్కడి నుంచి వెళ్లాలని మ్యాచ్‌ నిర్వాహకులు వారికి సూచించారు. ఈ బాక్స్‌లోని టికెట్లు కేవలం ఆహ్వానితుల కోసమే.. సాధారణ అభిమానులకు కేటాయించరు. 

మైదానంలో నుంచి ఏం చేస్తారు? 

2013లో స్పాట్ ఫిక్సింగ్‌తో భారత క్రికెటర్‌ శ్రీశాంత్‌తోపాటు విదేశీ ఆటగాడు అజిత్ చండిలాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాజస్థాన్‌, చెన్నై జట్లపై రెండేళ్లపాటు నిషేధం విధించారు. ఇప్పుడు అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఈ రెండు సందర్భాల్లోనూ రాజస్థాన్‌ జట్టు ఉండటం గమనార్హం. అయితే, ఫిక్సింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇబ్బందేం లేదు. బుకీలు మాత్రం లైవ్‌లో మ్యాచ్‌ను చూసి దానిని అడ్వాంటేజ్‌గా తీసుకొని బెట్టింగ్‌లకు పాల్పడేందుకు అవకాశం ఉంది. మైదానంలో మ్యాచ్‌కు.. టీవీలో ప్రసారమయ్యే లైవ్‌ స్ట్రీమింగ్‌కు మధ్య సమయంలో వ్యత్యాసం ఉంటుంది. అనైతిక బెట్టింగ్‌ల ద్వారా లాభాలను ఆర్జించడానికి ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి బీసీసీఐ గట్టి చర్యలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని