WI vs IND: విండీస్‌తో టీ20 సిరీస్‌.. పొట్టి కప్‌కు బాట.. కుర్రాళ్ల సత్తాకు పరీక్ష!

విండీస్‌ పర్యటనలో (WI vs IND) భారత్ చివరి సిరీస్‌ను ఆడేందుకు సిద్ధమైంది. గురువారం నుంచి వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ తలపడనుంది.

Updated : 02 Aug 2023 15:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రయోగాలు చేసి మరీ విండీస్‌పై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా (Team India) రెండు రోజుల వ్యవధిలోనే మరో సిరీస్‌కు సిద్ధమైంది. అయితే, ఈసారి వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో (WI vs IND) తలపడనుంది. హార్దిక్‌ పాండ్య నాయకత్వంలోని భారత్‌ బరిలోకి దిగుతుండగా.. కీలక ఆటగాళ్లను ఎంపిక చేసుకుని మరీ విండీస్‌ సిద్ధమైంది. కుర్రాళ్లకు సదావకాశం వచ్చిన ఈ సిరీస్‌ను వినియోగించుకుంటే వచ్చే ఏడాది జరిగే పొట్టి కప్‌ సంగ్రామంలో ఆడే అవకాశం రావడం ఖాయం. ఎందుకంటే ఇక్కడే టీ20 మెగా టోర్నీ జరగనుంది. అయితే, ఈలోగా వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ గురించి మాట్లాడుకుందాం..

గత తొమ్మిదేళ్లుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: సంజూ శాంసన్

టెస్టు, వన్డే సిరీస్‌లను గెలిచిన ఆనందంలో ఉన్న టీమ్‌ఇండియాను ఎదుర్కోవడం వెస్టిండీస్‌కు తేలికైన విషయం కాదు. కానీ, ఆ జట్టులోనూ  డేంజరస్‌ టీ20 బ్యాటర్లు ఉన్నారు. దీంతో భారత బౌలింగ్‌ VS విండీస్ బ్యాటర్లకు మధ్య సమరం ఆసక్తికరంగా ఉండనుంది. యువ బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్‌ ఖాన్, ముకేశ్‌ కుమార్, చాహల్, రవి బిష్ణోయ్‌, అక్షర్ పటేల్‌తో కూడిన భారత బౌలింగ్‌ దళం బరిలోకి దిగనుంది. రోవ్‌మన్ పావెల్, కేల్ మేయర్స్, రోస్టన్ ఛేజ్, హెట్‌మయెర్, పూరన్, హోల్డర్‌ వంటి హేమాహేమీలైన టీ20 బ్యాటర్లను తట్టుకొని పరుగులు నియంత్రించాలంటే కచ్చితంగా శ్రమించాల్సిందే. 

యశస్వి - ఇషాన్‌ .. ఎక్కడ వస్తారో..?

భారత జట్టులో యువ క్రికెటర్లకు ఉన్న పోటీ మరెక్కడా లేదు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను మేనేజ్‌మెంట్ పక్కన పెట్టేసింది. హార్దిక్‌ పాండ్యకు  కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. టీ20ల్లో టాప్‌ ర్యాంకర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను డిప్యూటీగా నియమించింది. అలాగే ఐపీఎల్‌లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, తిలక్‌ వర్మను ఎంపిక చేసింది. ఇషాన్‌, శుభ్‌మన్‌ గిల్, సంజూ శాంసన్‌ ఉండనే ఉన్నారు. అయితే, తుది జట్టు ఎంపిక క్లిష్టంగా మారే అవకాశం ఉంది. శుభ్‌మన్‌ గిల్‌కు తోడుగా ఓపెనర్‌గా ఎవరు వస్తారు? ఎందుకంటే యశస్వి జైస్వాల్, ఇషాన్‌ కిషన్‌ ఎడమచేతి వాటం బ్యాటర్లు. వీరిద్దరూ ఓపెనర్లుగా ఐపీఎల్‌లో రాణించారు. సంజూ శాంసన్‌ను కాదని తిలక్‌ వర్మను తీసుకుంటారనేది సందిగ్ధమే. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్ ఒక్కడే జట్టులో ఉండటం అతడికి కలిసొచ్చే అవకాశం.

మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇలా.. 

  • తొలి టీ20:  ఆగస్ట్‌ 3 (గురువారం)
  • రెండో టీ20: ఆగస్ట్‌ 6 (ఆదివారం)
  • మూడో టీ20: ఆగస్ట్‌ 8 (మంగళవారం)
  • నాలుగో టీ20: ఆగస్ట్ 12 (శనివారం)
  • ఐదో టీ20: ఆగస్ట్‌ 13 (ఆదివారం)

ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి.

జట్లు (అంచనా):  

భారత్: హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (వైస్‌కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌.

విండీస్‌: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కేల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్‌ ఛార్లెస్‌, రోస్టన్ ఛేజ్, షిమ్రోన్ హెట్‌మయెర్, నికోలస్‌ పూరన్, రొమారియో షెఫర్డ్, ఒషానె థామస్‌, జాసన్ హోల్డర్, అకీల్ హుసేన్, అల్జారీ జోసెఫ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని