Sanju Samson: గత తొమ్మిదేళ్లుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: సంజూ శాంసన్

ఆసియా కప్‌ టోర్నీకి ముందు భారత్‌ (Team India) చివరి వన్డే సిరీస్‌ ఆడేసింది. విభిన్న ప్రయోగాలు చేసి ఫలితాలు రాబట్టింది. రెండు మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్‌ (Sanju Samson) ఒక దాంట్లో హాఫ్ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు.

Published : 02 Aug 2023 12:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మెగా టోర్నీల్లో ఆడాలంటే జట్టులో స్థానం దక్కాలి. అలా జరగాలంటే వచ్చిన ఛాన్స్‌లను సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్రమంలో చివరి అవకాశంగా వచ్చిన మ్యాచ్‌లో భారత ఆటగాడు సంజూ శాంసన్ (Sanju Samson) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. విండీస్‌తో జరిగిన (WI vs IND) మూడో వన్డేలో 51 పరుగులు చేసి రాణించాడు. రెండో మ్యాచ్‌లో త్వరగా పెవిలియన్‌కు చేరి విమర్శలపాలైన సంజూ.. ఈసారి మాత్రం ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్‌లోకి 2013లో అడుగుపెట్టిన అతడు మరో రెండేళ్లకు భారత టీ20 జట్టులోకి వచ్చాడు. అయితే, ఆ తర్వాత అడపాదడపా జట్టులో స్థానం సంపాదిస్తున్నాడే కానీ.. నిలకడైన ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమయ్యాడు.

తాజాగా విండీస్‌తో మూడో వన్డే అనంతరం సంజూ మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో భారత జట్టులో స్థానం కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ‘‘భారత క్రికెటర్‌గా ఎప్పుడూ సవాళ్లు ఉంటాయి. గత తొమ్మిదేళ్లుగా టీమ్‌ఇండియా (Team India) తరపున, దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూనే ఉన్నా. అంతర్జాతీయంగా ఆడేటప్పుడు విభిన్న స్థానాల్లో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఎన్ని ఓవర్లు వస్తాయనేది చెప్పలేని పరిస్థితి. అయితే, దానికి తగ్గట్టుగా సన్నద్ధం కావాల్సిందే. మూడో వన్డేలో కాసేపు కుదురుకోవడానికి సమయం తీసుకున్నా. ఇలా చేయడం వల్ల బంతి గమనంపై అంచనా వచ్చింది. దీంతో భారత్‌ తరఫున మంచి ఇన్నింగ్స్‌ ఆడే అవకాశం లభించింది. ప్రత్యర్థి బౌలర్‌ను బట్టి నా ప్రణాళికలు వేరుగా ఉంటాయి. బౌలర్ల లెంగ్త్‌ను డామినేట్‌ చేయడానికి నా పాదాల కదలికను మారుస్తూ ఉంటా.

బాగానే ఆడా.. కానీ నాకైతే సంతోషంగా లేదు

రెండో వన్డే ఆడిన పిచ్‌కు ఇప్పుడు ట్రినిడాడ్‌లోని పిచ్‌కు వ్యత్యాసం ఉంది. ఇక్కడ కొత్త బంతి చాలా చక్కగా బ్యాట్‌ మీదకు వచ్చింది. పరుగులు చేయడానికి వీలు కలిగింది. అయితే, బంతి పాతబడటం ప్రారంభించినప్పటి నుంచి బౌలర్లకు అనుకూలంగా మారింది. మరీ ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ మిడిలార్డర్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో భారత్‌ భారీ స్కోరు చేయగలిగింది’’ అని సంజూ వెల్లడించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు