T20 League : ధోనీ సూపర్‌ ఫినిషింగ్‌.. బట్లర్‌ సెంచరీల మోత.. చాహల్ హ్యాట్రిక్‌ జోరు

మార్చి 26 నుంచి అభిమానులను అలరిస్తోన్న టీ20 లీగ్‌లో ఇప్పటి వరకు ..

Updated : 25 Apr 2022 15:48 IST

టీ20 లీగ్‌ టోర్నీ సగం మ్యాచుల్లో విశేషాలు ఇవీ..

ఇంటర్నెట్ డెస్క్‌: మార్చి 26 నుంచి అభిమానులను అలరిస్తున్న టీ20 లీగ్‌లో ఇప్పటి వరకు 37 మ్యాచ్‌లు ముగిశాయి. దాదాపు అన్ని మ్యాచులూ ఉత్కంఠభరితంగానే సాగాయి. ఇప్పటికే పలు సంచలనాలు నమోదు కాగా.. ఛాంపియన్‌ జట్ల ఫలితాలు తలకిందలయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో హైలైట్స్‌ ఓసారి చూద్దాం..

 1. ఫామ్‌లోకి ధోనీ: సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైను కోల్‌కతా ఓడించి సంచలనం సృష్టించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికి గత రెండు సీజన్లలో పెద్దగా రాణించని ఎంఎస్ ధోనీ ఈసారి తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ కొట్టడం విశేషం. మిగతా మ్యాచుల్లో విలువైన ఇన్నింగ్స్‌లను ఆడాడు. ముంబయితో మ్యాచ్‌లో చివరి నాలుగు బంతులకు 16 పరుగులు అవసరం కాగా.. తనదైన ‘ఫినిషింగ్‌ టచ్‌’ ఇచ్చి చెన్నైకి విజయం కట్టబెట్టాడు.
 2. ఇషాన్‌కు ఇదే సూపర్‌ ఇన్నింగ్స్‌: మెగా వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న ఇషాన్‌ కిషన్‌ (రూ. 15.25 కోట్లు) ముంబయి ఆడిన సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే 81 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే, ఈ మ్యాచ్‌లో దిల్లీ విజయం సాధించింది. ఇలా టీ20 లీగ్‌ ఛాంపియన్లకు (ముంబయి, చెన్నై) తమ తొలి మ్యాచుల్లోనే ఓటమి ఎదురైంది.
 3. భారీ లక్ష్య ఛేదన: టీ20ల్లో రెండు వందలకుపైగా లక్ష్యాన్ని ఛేదించడం సాధారణ విషయం కాదు. అయితే, అలాంటి దానిని పంజాబ్‌ సుసాధ్యం చేసింది. బెంగళూరుతో జరిగిన మూడో మ్యాచ్‌లో 206 పరుగుల టార్గెట్‌ను ఛేదించేసింది.
 4. జోస్ బట్లర్ శతకాల జోరు: సీజన్‌లో ఒక సెంచరీ కొట్టడమే గగనం. అలాంటిది మంచి ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌.. మూడు శతకాలు బాదేశాడు. ముంబయితో మ్యాచ్‌లో 68 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రాను మినహా ఇతర బౌలర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన బట్లర్‌.. అతడి బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డయ్యాడు. కోల్‌కతా, దిల్లీ జట్లపై మిగిలిన రెండు శతకాలు నమోదు చేశాడు.
 5. రాహుల్‌ డబుల్‌: లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ముంబయితో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెరో ఇన్నింగ్స్‌లో అతడు 103 పరుగులే సాధించి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో తన జట్టును ముందుండి నడిపించడమే కాకుండా అత్యధిక పరుగుల జాబితాలో 368 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. బట్లర్‌ 491 పరుగులతో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు.
 6. డేంజరస్‌ దినేశ్ కార్తిక్‌: డెత్‌ ఓవర్లలో తానెంత ప్రమాదకర బ్యాటర్‌నో దినేశ్ కార్తిక్‌ మరోసారి నిరూపించాడు. బెంగళూరు మ్యాచ్‌ ఓడిపోతుందని భావించినప్పుడు దినేశ్‌ తన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. రాజస్థాన్‌ మీద గెలిపించిన కార్తిక్.. చెన్నైపైనా పోరాడాడు.
 7. కాస్తలో శతకం మిస్‌: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్‌ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ (96) సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలో శతకం చేసే అవకాశాన్ని కాస్తలో చేజార్చుకున్నాడు. ఇలానే చెన్నై బ్యాటర్‌ శివమ్‌ దూబే (95), బెంగళూరు కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (96) ఈ సీజన్‌లో త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నారు.
 8. దూసుకొచ్చిన హైదరాబాద్‌: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై విమర్శలు ఎదుర్కొన్న హైదరాబాద్‌.. మూడో మ్యాచ్‌ నుంచి అదరగొట్టింది. చెన్నై, బెంగళూరు, గుజరాత్‌, పంజాబ్‌, కోల్‌కతా జట్లపై అనూహ్య విజయాలతో చెలరేగింది. 
 9. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ తొలి విక్టరీ: టోర్నీలో 22వ మ్యాచ్‌లోగానీ చెన్నై తొలి విజయం సాధించలేదు. ఇది జడ్డూ సేనకు ఐదో మ్యాచ్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బెంగళూరు కూడా మెరుగ్గానే ఆడింది. అయితే చివరికి 193/9 స్కోరుకే పరిమితం కావడంతో చెన్నైకు తొలి విజయం లభించింది. 
 10. హార్దిక్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ : తొలిసారి టీ20 లీగ్‌లో పోటీ పడుతున్న గుజరాత్‌కు సారథిగా వ్యవహరిస్తున్న హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌ ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపిస్తున్నాడు. ఆరు మ్యాచుల్లో 295 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లను మాత్రమే తీసినప్పటికీ ఎకానమీ రేటు (7.57) ఫర్వాలేదనిపించాడు.
 11. ఇద్దరి మధ్యే పోటీ: టీ20 లీగ్‌లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించడంలో ఇద్దరి మధ్యే పోటీ ఉంది. 150 కి.మీపైగా వేగంతో అత్యధిక బంతులను సంధించిన బౌలర్‌గా హైదరాబాద్‌ ఆటగాడు ఉమ్రాన్‌ మాలిక్‌ నిలిచాడు. ఆ తర్వాత గుజరాత్‌ బౌలర్‌ లాకీ ఫెర్గూసన్ ఘనత సాధించాడు. అయితే, ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా లాకీ ఫెర్గూసన్‌ కొనసాగుతున్నాడు. 153.9 కి.మీ వేగంతో బంతిని సంధించి రికార్డు సృష్టించాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఈ మెరుపు బంతిని విసిరాడు. ఉమ్రాన్ మాలిక్ అత్యుత్తమం 153.3 కి.మీ (గుజరాత్‌పై).
 12. ఒకే మ్యాచ్‌లో రెండు ఘనతలు: ఈ సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో సెంచరీతోపాటు హ్యాట్రిక్‌ వికెట్లు ప్రదర్శన జరిగింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ (30వ మ్యాచ్‌)లో రాజస్థాన్‌ ఓపెనర్ జోస్ బట్లర్‌ (103: 61 బంతుల్లో) శతకం సాధించాడు. దీంతో రాజస్థాన్‌ 217 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా కూడా మెరుగ్గానే బ్యాటింగ్‌ చేసింది. అయితే, శ్రేయస్‌ అయ్యర్ (85), శివమ్‌ మావి, ప్యాట్ కమిన్స్‌ వికెట్లను వరుస బంతుల్లో తీసి యుజ్వేంద్ర చాహల్‌ హ్యాట్రిక్‌ కొట్టాడు. దీంతో 210 పరుగులకే పరిమితమై కేవలం ఏడు పరుగుల తేడాతో కోల్‌కతా ఓటమిపాలైంది.
 13. అత్యధిక స్కోరిదే: ప్రస్తుత సీజన్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రాజస్థాన్‌ రికార్డు సృష్టించింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రెండు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లోనే జోస్ బట్లర్‌ (116) మరో శతకం నమోదు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లోనూ దిల్లీ గట్టిగా పోరాడింది. 207/8 స్కోరు చేసి గెలుపు అంచుల వరకూ వెళ్లింది. ఇక్కడే ‘నో బాల్’ వివాదం చెలరేగినా అంపైర్లు సర్ది చెప్పడంతో సద్దుమణిగింది.
 14. బెంగళూరు కుదేలు: వరుసగా విజయాలను నమోదు చేస్తున్న హైదరాబాద్‌ మరోసారి మ్యాజిక్‌ చేసింది. బెంగళూరును కేవలం 68 పరుగులకే కుప్పకూల్చి సంచలనం సృష్టించింది. ప్రస్తుతానికి ఈ సీజన్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా బెంగళూరు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ కేవలం 8 ఓవర్లలోనే లక్ష్యం సాధించి మరో 72 బంతులు ఉండగానే విజయం నమోదు చేసింది. వరుసగా విరాట్ కోహ్లీ రెండు సార్లు గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.
 15. ముంబయి పని పూర్తి: ఇక ఏప్రిల్ 24న లఖ్‌నవూతో ఆడిన ఎనిమిదో మ్యాచ్‌లోనూ ముంబయి ఓటమిపాలవ్వడంతో ఈ సీజన్‌లో ఆ జట్టు ఇక ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతైనట్లే. ఇకపై మిగిలిన 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించినా ఆ జట్టు ప్లేఆఫ్స్‌ చేరేందుకు అవసరమైన పాయింట్లు దక్కించుకోలేదు. దీంతో ప్రస్తుత టోర్నీలో ఆ జట్టు నామమాత్రంగా ఆడాలి. కానీ, ఇది సాధించే ఫలితాలను బట్టి ఇతర జట్ల ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని