T20 world cup 2024: టీ20 ప్రపంచకప్‌.. ఆస్ట్రేలియా అదరహో.. ఇంగ్లాండ్‌పై ఘన విజయం

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Updated : 09 Jun 2024 02:17 IST

బార్బడోస్: టీ20 ప్రపంచకప్‌ 2024 (T20 World Cup 2024)లో ఆస్ట్రేలియా రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. గ్రూప్‌ బిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్‌ 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌కు శుభారంభం దక్కినా తర్వాత దూకుడుగా ఆడలేక ఓటమి చవిచూసింది. 20 ఓవర్లలో 165/6 స్కోరుకు పరిమితమైంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (37; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (42; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేదు. విల్ జాక్స్‌ (10), జానీ బెయిర్‌స్టో (7) విఫలమయ్యారు. మొయిన్‌ అలీ (25; 15 బంతుల్లో 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. లివింగ్‌స్టోన్ (15), హ్యారీ బ్రూక్‌ (20*) పరుగులు చేశారు.  ఆసీస్‌ బౌలర్లలో పాట్ కమిన్స్‌ 2, ఆడమ్ జంపా 2, హేజిల్‌వుడ్, స్టాయినిస్‌ తలో వికెట్ పడగొట్టారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా ఒక్క బ్యాటరూ అర్ధ శతకం చేయకపోయినా భారీ స్కోరు సాధించింది. దాదాపు ఆసీస్‌ బ్యాటర్లంతా క్రీజులో ఉన్నంతసేపు ఎడాపెడా బౌండరీలు బాదారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (34; 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (39; 16 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వా్యం నెలకొల్పి శుభారంభం అందించారు. తర్వాత వచ్చిన కెప్టెన్ మిచెల్ మార్ష్‌ (35; 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (28; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), మార్కస్‌ స్టాయినిస్‌ (30; 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ ఆటతో అలరించారు. టిమ్‌ డేవిడ్ (11) రన్స్‌ చేయగా.. మాథ్యూ వేడ్ (17; 10 బంతుల్లో 3 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ 2, మొయిన్‌ అలీ, జోఫ్రా అర్చర్, అదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు