T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌.. ఉత్కంఠ పోరులో ఐర్లాండ్‌పై కెనడా విజయం

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కెనడా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 07 Jun 2024 23:37 IST

న్యూ యార్క్: టీ20 ప్రపంచకప్ 2024లో కెనడా బోణీ కొట్టింది. గ్రూప్‌ ఎలో ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. నికోలస్‌ కిర్టోన్‌ (49) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్  125/7 స్కోరుకు పరిమితమైంది. ఆండ్రూ బాల్‌బిర్నీ (17) ఫర్వాలేదనిపించగా..  పాల్ స్టిర్లింగ్ (9), టక్కర్ (10), టెక్టార్ (7), క్యాంఫర్ (4), డెలానీ (3) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఐరిష్ జట్టు 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడి ఘోర పరాజయం దిశగా సాగింది. ఈ దశలో జార్జ్ డాక్రెల్ (30*; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్‌ అడైర్ (34; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో ఐర్లాండ్ విజయం సాధించేలా కనిపించింది. చివర్లో కెనడా పుంజుకుని గట్టెక్కింది. కెనడా బౌలర్లలో డిల్లాన్ హేలిగర్ 2, జెరెమీ గోర్డాన్ 2, జునైద్ సిద్ధిఖీ, సాద్ బిన్ జాఫర్ తలో వికెట్ పడగొట్టారు. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా బ్యాటర్లలో ఓపెనర్లు ఆరోన్‌ జాన్సన్ (14), నవనీత్‌ ధలివాల్‌ (6) నిరాశపర్చగా పర్‌గత్‌ సింగ్‌ (18) ఫర్వాలేదనిపించాడు. నికోలస్‌తోపాటు శ్రేయస్‌ మొవ్వ (37) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో క్రెయిగ్ యంగ్‌, బేరీ మెకార్తీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. డెలానీ, మార్క్‌ అడైర్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని