IND vs PAK: కళ్లన్నీ అటే

22 గజాల పిచ్‌.. రెండు దేశాల క్రికెట్‌ సమరం. ఇది కేవలం ఆట మాత్రమే కాదు అంతకుమించి!    ఓ మ్యాచ్‌ జరుగుతుందంటే ఇరు దేశాల అభిమానులే ఆసక్తిగా చూస్తారు. కానీ ఈ రెండు జట్లు ఆడుతుంటే.. క్రికెట్‌ ప్రపంచమే ఆగిపోతుంది! తెరలకు కళ్లను అప్పగించి.. మనసును మైదానానికి అర్పించే పోరుకు సమయం సిద్ధమైంది.

Updated : 09 Jun 2024 04:32 IST

నేడే భారత్, పాకిస్థాన్‌ పోరు
పొంచి ఉన్న వరుణుడు
రాత్రి 8 నుంచి

22 గజాల పిచ్‌.. రెండు దేశాల క్రికెట్‌ సమరం. ఇది కేవలం ఆట మాత్రమే కాదు అంతకుమించి!    ఓ మ్యాచ్‌ జరుగుతుందంటే ఇరు దేశాల అభిమానులే ఆసక్తిగా చూస్తారు. కానీ ఈ రెండు జట్లు ఆడుతుంటే.. క్రికెట్‌ ప్రపంచమే ఆగిపోతుంది! తెరలకు కళ్లను అప్పగించి.. మనసును మైదానానికి అర్పించే పోరుకు సమయం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఆదివారమే. సూపర్‌ ఓవర్లు.. సంచలన విజయాలతో సాగుతున్న టీ20 ప్రపంచకప్‌ జోష్‌ను మరింత పెంచేందుకు.. క్రికెట్‌ మత్తులో యుఎస్‌ను ఊపేసేందుకు ఈ దాయాది జట్లు సై అంటున్నాయి. 

న్యూయార్క్‌

టీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమెంiది. భారత్, పాకిస్థాన్‌ మధ్య గ్రూప్‌- ఎ పోరు ఆదివారమే. ఈ మ్యాచ్‌ రెండు జట్లకూ కీలకమే. ఐర్లాండ్‌పై గెలిచి బోణీ కొట్టిన టీమ్‌ఇండియా.. పాక్‌పై నెగ్గి సూపర్‌- 8కు చేరువ కావాలని చూస్తోంది. అస్థిరత, అనిశ్చితితో కూడిన పాక్‌ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో సూపర్‌ ఓవర్లో అనూహ్య పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు రోహిత్‌ సేన చేతిలోనూ ఓడితే ఆ జట్టుకు సూపర్‌- 8 చేరే దారి క్లిష్టమవుతుంది. కానీ అమెరికా చేతిలో ఓడిందని పాక్‌ను తక్కువ అంచనా వేయలేం. విజయం పాక్‌కు అత్యవసరం కాబట్టి తెగించి ఆడే అవకాశముంది. అయితే గురువారమే న్యూయార్క్‌కు వచ్చిన బాబర్‌ బృందానికి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు పరిమిత సమయం మాత్రమే దొరికింది. ఇది మనకు లబ్ధి చేకూర్చేదే. పరిస్థితులు, ఫామ్, రికార్డులు.. ఇలా ఎలా చూసినా ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌.

బ్యాటర్లు vs పేసర్లు

ప్రధానంగా పాకిస్థాన్‌ బౌలర్లు, టీమ్‌ఇండియా బ్యాటర్ల మధ్య పోరు అమితాసక్తి రేపుతోంది. పిచ్‌ కూడా పేసర్లకు సహకరించేదే. షహీన్‌ షా అఫ్రిది, నసీం షా, హారిస్‌ రవూఫ్, మహమ్మద్‌ అమీర్‌తో ప్రత్యర్థి పేస్‌ దళం సవాలు విసిరేందుకు సిద్ధమైంది. ఈ కఠిన పరీక్షలో డిస్టింక్షన్‌లో పాసయేందుకు భారత్‌కు అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. ఓపెనర్లు రోహిత్, కోహ్లితో పాటు పంత్, సూర్యకుమార్, శివమ్‌ దూబె, హార్దిక్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ దుర్భేద్యంగా ఉంది. స్పిన్‌ ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్‌తో లోతు కూడా ఎక్కువే. ఐర్లాండ్‌పై అర్ధశతకం చేసిన రోహిత్, ఆకట్టుకున్న పంత్‌తో పాటు కోహ్లి, సూర్యకుమార్‌ పరుగుల వేటలో పడితే భారత్‌ను ఆపడం ఏ బౌలింగ్‌కైనా కష్టమే. మన పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్, హార్దిక్‌ కూడా జోరుమీదున్నారు. ఐర్లాండ్‌పై అదరగొట్టారు. స్పిన్‌ విభాగంలోనూ పైచేయి మనదే. ఐర్లాండ్‌పై జడ్డూ, అక్షర్‌లను ఆడించిన భారత్‌.. పాక్‌పై ఓ స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ను తీసుకునే అవకాశముంది. అక్షర్‌ స్థానంలో అతను రావొచ్చు. కానీ ఎడమ చేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్‌లో బాబర్‌ స్ట్రైక్‌రేట్‌ 112 మాత్రమే కావడంతో బ్యాటింగ్‌పైనా దృష్టి పెట్టి అక్షర్‌ను కొనసాగించే అవకాశాలనూ కొట్టిపారేయలేం. కెప్టెన్‌ బాబర్‌తో పాటు రిజ్వాన్, ఉస్మాన్, ఫకర్‌ జమాన్‌ బ్యాటింగ్‌లో రాణించాలని పాక్‌ ఆశలు పెట్టుకుంది.

పిచ్‌ ఏం చేస్తుందో?

భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కంటే కూడా ఆడే పిచ్‌ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలోని డ్రాప్‌ఇన్‌ పిచ్‌లు బ్యాటింగ్‌కు ప్రమాదకరంగా మారడమే అందుకు కారణం. అస్థిర బౌన్స్, స్వింగ్‌తో బంతిని అంచనా వేయలేక బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గాయాల పాలవుతున్నారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో భుజానికి బంతి బలంగా తాకడంతో రోహిత్‌ శర్మ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రమాదకర పిచ్‌పై అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహించడం సరికాదంటూ ఇప్పటికే మాజీలు విమర్శిస్తున్నారు. ఇక్కడ శ్రీలంక- దక్షిణాఫ్రికా, భారత్‌- ఐర్లాండ్‌ మ్యాచ్‌ల్లో స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ కూడా ఇలా చప్పగా సాగితే అసలు కిక్కే ఉండదు. ఏప్రిల్‌లో అమర్చిన నాలుగు డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు ఇంకా కుదురుకోలేదు. తాము అనుకున్నట్లు పిచ్‌లు స్పందించడం లేదని ఐసీసీ కూడా పేర్కొంది. కొత్త పిచ్‌పై జరిగే ఈ మ్యాచ్‌లో మరోసారి బ్యాటర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. మరోవైపు వరుణుడి ముప్పూ పొంచిఉంది. మ్యాచ్‌ ఆరంభమైన అరగంట తర్వాత వర్షం పడేందుకు 51 శాతం అవకాశమున్నట్లు అంచనా. యుఎస్‌ఏలో ఉదయం మ్యాచ్‌ కావడంతో ఆట కొనసాగించేందుకు ఎక్కువ అవకాశాలే ఉన్నాయి. కానీ పూర్తి 20 ఓవర్ల మ్యాచ్‌ చూస్తామా అన్నదే ప్రశ్న.

మనదే జోరు

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియాదే మెరుగైన రికార్డు. ఇప్పటివరకూ ఈ పొట్టికప్‌ల్లో దాయాదితో 7 మ్యాచ్‌లాడగా కేవలం ఒక్కదాంట్లోనే భారత్‌ ఓడింది. అంతకుముందు వరుసగా అయిదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్‌కు 2021లో పాక్‌ షాకిచ్చింది. కానీ 2022లో పాక్‌తో పోరులో కోహ్లి (53 బంతుల్లో 82 నాటౌట్‌) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తిరిగి జట్టును గెలుపు బాట పట్టించాడు. 

కట్టుదిట్టమైన భద్రత

ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడ జరిగిన అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కార్యక్రమం కంటే కూడా ఇప్పుడీ మ్యాచ్‌కు ఎక్కువ మంది భద్రత సిబ్బందిని కేటాయించినట్లు నాసా కౌంటీ పోలీస్‌ కమిషనర్‌ పాట్రిక్‌ రైడర్‌ పేర్కొన్నాడు.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లి, పంత్, సూర్యకుమార్, హార్దిక్, శివమ్‌ దూబె, జడేజా, అక్షర్‌/కుల్‌దీప్, బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్‌.

పాకిస్థాన్‌: రిజ్వాన్, బాబర్‌ (కెప్టెన్‌), ఉస్మాన్, ఫకర్‌ జమాన్, షాదాబ్‌ ఖాన్, ఇఫ్తికర్‌ అహ్మద్, ఇమాద్‌ వసీం, షహీన్‌ షా అఫ్రిది, హారిస్‌ రవూఫ్, మహమ్మద్‌ అమీర్, నసీం షా. 


6

టీ20 ప్రపంచకప్‌ల్లో పాక్‌తో ఆడిన 7 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయాలు. ఒక దాంట్లో ఓడిపోయింది.


11

పాకిస్థాన్‌తో టీ20ల్లో హార్దిక్‌ తీసిన వికెట్లు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్, ఉమర్‌ గుల్‌తో సమానంగా ఉన్నాడు. 


12

భారత్, పాక్‌ ఇప్పటివరకూ ఆడిన టీ20లు. ఇందులో టీమ్‌ఇండియా 9 గెలవగా.. పాక్‌ మూడు నెగ్గింది. 


488

పాకిస్థాన్‌తో 10 టీ20ల్లో కోహ్లి చేసిన పరుగులు. అతని సగటు 81.33 కావడం విశేషం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు