IPL 2024: 200+ స్కోరు... చాలడం లేదు బాసూ!

ఐపీఎల్ 17వ సీజన్‌లో మ్యాచ్‌లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు.

Updated : 22 Apr 2024 11:00 IST

ఒకప్పుడు టీ20ల్లో 180 పరుగులు చేస్తే భారీ స్కోరు చేసినట్లే. ఇప్పుడు 200+ టార్గెట్‌ నిర్దేశించినా గెలుస్తామనే భరోసా లేదు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌ల ఫలితాలను చూస్తే అలాగే ఉంది. ఒకటా.. రెండా.. తొమ్మిది మ్యాచుల్లో ఇలాంటి పరిస్థితే. అందులో మూడు హైదరాబాద్‌ ఆడినవే. రికార్డు స్కోరు చేసినా ఒకదశలో ఆ జట్టుకూ ఓటమి భయం తప్పలేదు మరి. 

ఐపీఎల్‌లో జట్టు అత్యధిక స్కోరు అంటే.. మొన్నీమధ్య వరకు 11 ఏళ్ల క్రితం నాటి గణాంకాలు చెప్పేవాళ్లు. ఈ ఏడాది ఆ రికార్డును సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ రెండు సార్లు బద్దలుకొట్టింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు 17వ సీజన్‌లో పరుగుల వరద ఎలా పారుతోందో. ఆ జట్టు ఈ సీజన్‌లో 277.. 287.. 266.. 204 పరుగులు చేసింది. ముంబయి 246.. 234 స్కోర్లతో అదరగొట్టగా... బెంగళూరు ఓసారి 262 పరుగులు చేసింది. రాజస్థాన్‌ 224 కొట్టగా... కోల్‌కతా 272.. 223.. 208 చేసింది. చెన్నై ఓసారి 206 పరుగులు కొట్టగా.. పంజాబ్‌ ఓసారి 200 చేసింది. దిల్లీ కూడా 205 పరుగులతో 200+ క్లబ్‌లో చేరింది. ఇలా 8 జట్లు 16 సార్లు 200కిపైగా పరుగులు చేశాయి. 

కారణాలు ఇవేనా...

  • ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధనతో అదనంగా మరొక బ్యాటర్ జట్టులోకి వస్తున్నాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో జోస్ బట్లర్ ‘ఇంపాక్ట్‌’ ప్లేయర్‌గా వచ్చి శతకంతో జట్టును గెలిపించాడు. అలా ఈ రూల్‌ భారీ స్కోర్లకు ఓ కారణం అని చెప్పొచ్చు.
  • పిచ్‌లు ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం కూడా మరో కారణం. అదేదో సినిమాలో చెప్పినట్లు కొడితే బౌండరీ అనేలా కొన్ని పిచ్‌లు రూపొందిస్తున్నారు. దీంతో బౌలర్లు చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి. 
  • మరోవైపు బెంగళూరు లాంటి కొన్ని జట్లు పేలవమైన బౌలింగ్‌తో ఇబ్బందిపడటమూ భారీ స్కోర్లకు ఆజ్యం పోస్తోంది. పరుగులు నియంత్రణలో ఆ జట్టు తడబడుతోంది. 
  • బంతి ఎక్కడేసినా... మైదానం నలువైపులా బౌండరీ దాటించగలిగే నైపుణ్యాలను కొత్త కుర్రాళ్లు మెరుగుపర్చుకున్నారు. విభిన్నమైన షాట్లతో 360 డిగ్రీ ప్లేయర్లు అనిపించుకునే పనిలో పడ్డారు.   
  • చిన్న మైదానాలు, బౌండరీ డైమన్షన్లు కూడా కొండంత స్కోర్లకు కారణంగా చెబుతున్నారు. కౌ కార్నర్‌ను లక్ష్యంగా చేసుకుని షాట్లు ప్రాక్టీస్‌ చేసి.. భారీ షాట్లతో స్కోర్లు పెంచేస్తున్నారు.
  • బౌలర్లకు వరంగా ఉంటుందనుకున్న ‘రెండు బౌన్సర్ల’ రూల్‌ బెడిసికొడుతోంది. షార్ట్‌ బంతులతో వారిని ఇబ్బంది పెడదామని భావించిన బౌలర్లకు అప్పర్‌ కట్‌లు, సూప్లా షాట్లతో ఆ బంతుల్ని బౌండరీలు దాటిస్తున్నారు. 

ఇక్కడో విషయం ఏంటంటే.. ఇన్నేసి పరుగులు చేసినా ఆ టీమ్‌లు భయపడ్డాయి అనే చెప్పాలి. ఎందుకంటే లక్ష్యఛేదనలో చివరి వరకు వచ్చి కొన్ని జట్లు ఆ లక్ష్యం అంత పెద్దదేమీ కాదు అనేలా ఆడాయి. కోల్‌కతా 208 చేస్తే.. హైదరాబాద్‌ 204 వరకు వచ్చేసింది. 277 పరుగుల రికార్డు స్కోరు చేసిన హైదరాబాద్‌కు ముంబయి సమాధానం 246. ఇక హైదరాబాద్‌ విసిరిన 283 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు 262 వరకు వచ్చి వణికించింది. కోల్‌కతా 223 కొడితే.. రాజస్థాన్‌ అలవోకగా 224 కొట్టేసింది. అలాగే కోల్‌కతాపై బెంగళూరు 221 పరుగులు చేసి ఒక్క రన్‌ తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఐపీఎల్‌లో 200+ స్కోరు కొట్టినా.. విజయం మీద నమ్మకం అంతంత మాత్రమే అని అంటున్నారు క్రికెట్‌ పరిశీలకులు. 

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని