Indian Captains won Asia Cup: టీమ్‌ఇండియాకు ఆసియా కప్‌ను అందించిన కెప్టెన్లు వీరే..

ఆసియా కప్‌ను ఇప్పటివరకు 15సార్లు నిర్వహించగా.. భారత్ ఏడుసార్లు విజేతగా నిలిచింది. మరి టీమ్‌ఇండియా (Team India) కు ఆసియా కప్‌లను అందించిన కెప్టెన్లు ఎవరో ఓ లుక్కేద్దాం.

Updated : 01 Sep 2023 12:20 IST

క్రికెట్‌లో ప్రపంచకప్‌ల తర్వాత అతిపెద్ద టోర్నీ ఏదైనా ఉందంటే ఆసియా కప్‌ మాత్రమే. దాదాపు 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ మినీ టోర్నీని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ నిర్వహిస్తోంది. ఆసియా కప్‌ (Asia Cup) 1984లో ప్రారంభమై ఇప్పటివరకు 15 సీజన్లను పూర్తి చేసుకుంది. భారత్ అత్యధికంగా ఏడుసార్లు (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018) విజేతగా నిలిచింది. శ్రీలంక గతేడాది ఛాంపియన్‌గా అవతరించి ఆరో టైటిల్‌ను సొంతం చేసుకుంది. మరి భారత్‌కు ఆసియా కప్‌లను అందించిన కెప్టెన్లు ఎవరెవరంటే?

సన్నీదే బోణీ 

భారత్‌కు మొట్టమొదటి ఆసియా కప్‌ను అందించిన కెప్టెన్ సునీల్ గావస్కర్‌(Sunil Gavaskar). 1984లో నిర్వహించిన ఆసియా కప్‌ (Asia Cup) మొదటి ఎడిషన్‌లో భారత్, పాకిస్థాన్‌, శ్రీలంక పాల్గొన్నాయి. ఈ సీజన్‌లో మూడే మ్యాచ్‌లు నిర్వహించగా.. సునీల్ గావస్కర్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా (Team India) ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి కప్‌ను ఎగరేసుకుపోయింది. శ్రీలంకపై 10 వికెట్లతో ఘన విజయం సాధించిన భారత్.. తర్వాతి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 54 పరుగుల తేడాతో మట్టికరిపించి టైటిల్‌ను ముద్దాడింది. 

రెండోది సర్కార్‌ సారథ్యంలో 

1986లో జరిగిన రెండో ఎడిషన్‌లో భారత్‌ పాల్గొనలేదు. క్రికెట్‌ సంబంధిత వ్యవహారాలతోపాటు సివిల్‌ వార్‌ దెబ్బకు టీమ్‌ఇండియా లేకుండానే టోర్నీ జరిగింది. 1988లో జరిగిన తర్వాతి ఎడిషన్‌లో భారత్‌ పాల్గొని రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. దిలీప్‌ వెంగ్ సర్కార్‌ (Dilip Vengsakar) సారథ్యంలోని టీమ్‌ఇండియా.. లీగ్‌ దశలో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లపై విజయం సాధించగా.. శ్రీలంక చేతిలో 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫైనల్‌లో అదే శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ సొంతం చేసుకోవడంతోపాటు లీగ్ దశలో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంది. 

అజహరుద్దీన్‌ ‘డబుల్’ 

హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ (Mohammad Azharuddin) టీమ్‌ఇండియాకు వరుసగా రెండు ఆసియా కప్‌లు (1990, 1995) అందించాడు. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సియాచిన్‌ విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 1990 ఆసియా కప్‌లో పాక్ ఆడలేదు. దీంతో మూడు జట్లతోనే (శ్రీలంక, భారత్, బంగ్లాదేశ్) టోర్నీ నిర్వహించారు. లీగ్‌ దేశలో శ్రీలంకతో చేతిలో పరాజయంపాలైన భారత్.. ఫైనల్‌లో లంకను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను మూడో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. 1995లో నిర్వహించిన ఆసియా కప్‌నకు కూడా అజహరుద్దీనే కెప్టెన్‌గా ఉన్నాడు. 1995లోనూ భారత్‌ ఆసియా కప్‌ ఛాంపియన్‌గా నిలవగా.. ప్రత్యర్థి శ్రీలంకే కావడం గమనార్హం.

‘కెప్టెన్ కూల్’ ఎన్నంటే?

మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) కూడా కెప్టెన్‌గా భారత్‌కు రెండు ఆసియా కప్‌లు అందించాడు. ధోనీ నాలుగు ఆసియా కప్‌లకు సారథ్యం వహించగా.. 2010, 2016లో టీమ్‌ఇండియాను విజేతగా నిలిపాడు. 2008లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2010లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో భారత్ 81 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. 2016లో ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరగ్గా.. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్‌లో ధోనీసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆరోసారి ఆసియా కప్‌ విజేతగా అవతరించింది.

కోహ్లీ ఆడకపోవడంతో రోహిత్‌కు ఛాన్స్‌

భారత్ చివరసారిగా ఆసియా కప్‌ను గెలిచింది 2018లో. అప్పుడు రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli)ని వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఆసియా కప్‌నకు విశ్రాంతినిచ్చారు. దీంతో కోహ్లీ స్థానంలో సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ (Rohit Sharma) భారత్‌ను విజేతగా నిలిపాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్‌ (48) రాణించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 2022 ఆసియా కప్‌లోనూ రోహిత్‌ సారథ్యంలోనే బరిలోకి దిగిన భారత్.. సూపర్‌-4 దశలోనే ఇంటి ముఖం పట్టింది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో కూడా రోహిత్‌ శర్మే భారత కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సారి హిట్‌మ్యాన్‌ సారథిగా ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో చూడాలి మరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని