Team India: బౌలర్లు అప్పుడు సత్తా చాటారు.. ఇప్పుడేం చేస్తారో?

విండీస్ - యూఎస్‌ఏ సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న వరల్డ్‌ కప్‌లో భారత బౌలింగ్ విభాగం సత్తా చాటేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Updated : 20 Jun 2024 16:47 IST

బ్యాటింగ్‌తో ఒకటీ అరా మ్యాచ్‌లను గెలవొచ్చేమో.. అదే బౌలింగ్‌ కూడా బాగుంటే టైటిళ్లను సొంతం చేసుకోవచ్చు.. ఇది స్టేట్‌మెంట్ కాదు. క్రికెట్‌లో అపారమైన అనుభవం కలిగిన మాజీలు చెప్పిన మాట. 

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ఫార్మాట్‌లో బౌలింగ్‌ అత్యంత కీలకమని ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌ స్పష్టం చేసింది. భారీ స్కోర్లు చేసినా ప్రత్యర్థిని కట్టడి చేయకపోతే ఓటమి తప్పదు. ఆ విషయం భారత బౌలర్లకు బాగా తెలుసు. ఈసారి పొట్టి కప్‌లో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోపాటు నలుగురు ఆల్‌రౌండర్లతో ఫుల్‌ ప్యాక్‌గా బరిలోకి దిగింది. మెగా లీగ్‌ మధ్యలో ఉండగా వరల్డ్‌ కప్ కోసం జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి మన బౌలర్ల సత్తా ఎలా ఉందో చూద్దాం.. 

  • జస్‌ప్రీత్ బుమ్రా: ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న పేసర్ బుమ్రా. ఈసారి వరల్డ్‌ కప్‌లో అతడు  కీలకమవుతాడని అభిమానుల అంచనా. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 20 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్‌ కప్‌ కోసం జట్టును ప్రకటించిన తర్వాత ఐదు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీశాడు. పరుగులు ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు.
  • సిరాజ్: షమీ గైర్హాజరీలో అవకాశం దక్కించుకున్న బౌలర్ సిరాజ్. ఈ ఐపీఎల్ సీజన్‌లో మొదట్లో ఒక మ్యాచ్‌కు రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. 14 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. అనూహ్యంగా వరల్డ్‌ కప్‌ జట్టుకు ఎంపికైన తర్వాత చెలరేగిపోయాడు. ఆరు మ్యాచుల్లో ఏకంగా 10 వికెట్లు తీయడం విశేషం. ఇందులో జట్టును గెలిపించిన బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. ప్రతిసారి వికెట్‌ తీసి సత్తా చాటాడు. 
  • అర్ష్‌దీప్‌ సింగ్: పంజాబ్ విజయాలు సాధించడంలో వెనుకబడినప్పటికీ.. ఆ జట్టు బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ మాత్రం ఈ టోర్నీ ఆసాంతం నిలకడగా బౌలింగ్‌ చేశాడు. ఓ వైపు హర్షల్ పటేల్ (24)తో పోటీగా అర్ష్‌దీప్ చెలరేగాడు. తాను ఆడిన 14 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి వరల్డ్ కప్‌లోకి ఘనంగా అడుగు పెట్టాడు. ప్రపంచ కప్‌ కోసం జట్టును ఎంపిక చేయకముందు 9 మ్యాచుల్లో 12 వికెట్లు తీయగా.. అదే జోష్‌ను కొనసాగిస్తూ ఆఖరి ఐదు మ్యాచుల్లో 7 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో అతడు 50 ఓవర్లు వేశాడు. 
  • కుల్‌దీప్‌ యాదవ్: దిల్లీ విజయాల్లో కుల్‌దీప్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 11 మ్యాచులు ఆడిన అతడు 16 వికెట్లు తీశాడు. స్లో డెలివరీలతో ప్రత్యర్థులను కట్టడి చేసిన కుల్‌దీప్‌ ఈసారి వరల్డ్ కప్‌లో ‘స్పెషలిస్ట్‌’ స్పిన్‌ కోటాలో స్థానం దక్కించుకున్నాడు. అయితే, టీమ్‌కు ఎంపికైన తర్వాత.. మాత్రం గొప్ప ప్రదర్శన చేయలేదు. చివరి నాలుగు ఐపీఎల్ మ్యాచుల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. అనూహ్యంగా ఒక మ్యాచ్‌లో 35 పరుగులు చేయడం విశేషం.
  • యుజ్వేంద్ర చాహల్: రాజస్థాన్‌ తరఫున బరిలోకి దిగిన చాహల్.. ఆరంభంలో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. వరల్డ్‌ కప్‌ కోసం జట్టును ప్రకటించక ముందు అతడు 9 మ్యాచ్‌లు ఆడాడు. అప్పటికే 13 వికెట్లు తీసేశాడు. ఎప్పుడైతే టీమ్‌ అనౌన్స్‌ అయిందో.. చాహల్ ప్రదర్శన కూడా దిగజారిపోయింది. చివరి ఆరు మ్యాచుల్లో (ఒకటి రద్దు) కేవలం ఐదు వికెట్లను మాత్రమే తీశాడు. యూఎస్ఏ - విండీస్‌ పిచ్‌లపై స్పిన్ కీలకమవుతుందనే అంచనాల నేపథ్యంలో అతడి ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరమే. 
  • రవీంద్ర జడేజా: టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్ ఈసారి ఐపీఎల్‌లో తన అత్యుత్తమ ఫామ్‌ ప్రదర్శించలేదు. బ్యాటింగ్‌లో మెరుపులు (267 పరుగులు) ఉన్నా.. బౌలింగ్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. 14 మ్యాచుల్లో కేవలం 8 వికెట్లే తీశాడు. వరల్డ్ కప్‌ కోసం ఎంపికైన తర్వాత ఆడిన ఐదు మ్యాచుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా అతడు వరల్డ్‌ కప్‌ కోసం తుది జట్టులో ఉండటం ఖాయమే.
  • అక్షర్ పటేల్: ఈ ఎడమచేతివాటం స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు బ్యాకప్‌గా ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 235 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో జడ్డూ కంటే కాస్త మెరుగ్గానే ఉన్నాడు. మొత్తం 11 వికెట్లు తీశాడు. వరల్డ్‌ కప్‌ కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత హాఫ్ సెంచరీ సాధించి దిల్లీని గెలిపించేందుకు ప్రయత్నించాడు. పరుగులను కట్టడి చేసినప్పటికీ వికెట్లను ఎక్కువగా తీయలేకపోయాడు. 
  • ఖలీల్ అహ్మద్ (ట్రావెల్ రిజర్వ్): జాతీయ జట్టులోకి పునరాగమనం చేసేందుకు తీవ్రంగా కష్టపడిన బౌలర్లలో ఖలీల్ అహ్మద్ ఒకడు. ఈసారి 14 మ్యాచుల్లో 17 వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్రధాన జట్టులో లేకపోయినా ట్రావెల్‌ రిజర్వ్‌గా ఎంపిక కావడానికి ఇదొక కారణం. వరల్డ్‌ కప్‌ కోసం జట్టును ఎంపిక చేసిన తర్వాత ఐదు మ్యాచ్‌లు ఆడిన ఖలీల్ ఏడు వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ కూడా 10 లోపే ఉంది. 
  • అవేశ్‌ ఖాన్‌ (ట్రావెల్ రిజర్వ్‌): ప్రపంచ కప్‌ కోసం భారత సెలక్టర్లు ఖలీల్‌తోపాటు అవేశ్‌ ఖాన్‌ను ట్రావెల్ రిజర్వ్‌ పేసర్లుగా ఎంపిక చేశారు. ఐపీఎల్ 17వ సీజన్‌లో అవేశ్‌ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ప్రపంచ కప్‌ కోసం రిజర్వ్‌ ఆటగాడిగా ఎంపికైన తర్వాత మరింత విజృంభించాడు. రాజస్థాన్‌ నాకౌట్‌ దశలో రెండో క్వాలిఫయర్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 16 మ్యాచుల్లో 19 వికెట్లు తీశాడు. తానాడిన చివరి రెండు మ్యాచుల్లో 5 వికెట్లు తీయడం విశేషం. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని