World Cup 2023: టీమ్‌ఇండియా.. ఇదే కావాలయ్యా.. ప్రపంచకప్‌లో భారత్‌ జోరు

ప్రపంచకప్‌కు ఎంపిక చేసే జట్టుపై సందిగ్ధత.. కీలక ఆటగాళ్లకు గాయాలు.. ఫామ్‌ లేమితో మరికొంత మంది క్రికెటర్లు. పైగా ఈ మెగా టోర్నీ జరిగేది స్వదేశంలో. దీంతో జట్టుపై ఎన్నో అంచనాలు. జట్టు ఎంపికపై ఎన్నో విమర్శలు. చివరి క్షణంలో అనూహ్యంగా జట్టులో మార్పు. ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులు.. సందేహాల మధ్య ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా (Team India) అడుగుపెట్టింది.

Published : 16 Oct 2023 15:35 IST

ప్రపంచకప్‌కు ఎంపిక చేసే జట్టుపై సందిగ్ధత.. కీలక ఆటగాళ్లకు గాయాలు.. ఫామ్‌ లేమితో మరికొంత మంది క్రికెటర్లు. పైగా ఈ మెగా టోర్నీ జరిగేది స్వదేశంలో. దీంతో జట్టుపై ఎన్నో అంచనాలు. జట్టు ఎంపికపై ఎన్నో విమర్శలు. చివరి క్షణంలో అనూహ్యంగా జట్టులో మార్పు. ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులు.. సందేహాల మధ్య ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా (Team India) అడుగుపెట్టింది. కానీ ఇప్పుడు.. మూడు మ్యాచ్‌లు ఆడేసరికి పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా నంబర్‌వన్‌. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొడుతూ.. అద్భుత విజయాలతో సాగుతోంది. ఇప్పుడందరికీ జట్టుపై భరోసా. ఇదే జోరుతో సాగితే కప్పు మనదేనన్న ఆశ. హ్యాట్రిక్‌ విజయాలతో.. కప్పు వేటలో దూసుకెళ్తోన్న టీమ్‌ఇండియా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇదే కదా.. అభిమానులకు కావాల్సింది. ఇలాగే కదా.. టీమ్‌ఇండియా ఆడాల్సింది. 

సొంతగడ్డపై టైటిల్‌ ఫేవరెట్‌గా ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా అదరగొడుతోంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో విజయాలతో అలరించింది. ఇందులో రెండు పెద్ద గండాలను భారత్‌ అలవోకగా అధిగమించడం ఇక్కడ విశేషం. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై సాధికారిక విజయంతో టోర్నీని మొదలెట్టిన రోహిత్‌ సేన.. రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను చిత్తుచేసింది. ఇక పాకిస్థాన్‌తో పోరులో భారత్‌ రెచ్చిపోయి.. ప్రత్యర్థిని మట్టికరిపించింది. ప్రస్తుతానికి మూడు మ్యాచ్‌ల్లో విజయాలతో 6 పాయింట్లతో.. మెరుగైన నెట్‌ రన్‌రేట్‌తో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

బ్యాటింగ్‌లో ఇలా..

జట్టుకు ఎంతో కీలకమైన బుమ్రా, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ శస్త్ర చికిత్సల నుంచి కోలుకుని వచ్చారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్‌లో వీళ్లు ఎలా రాణిస్తారోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పునరాగమనంలో తగినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండానే ఎలాంటి ప్రదర్శన చేస్తారేమోనని భయాలు వ్యక్తమయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై 200 పరుగుల ఛేదనలో రెండు పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి. రోహిత్, ఇషాన్, శ్రేయస్‌ సున్నాకే వెనుదిరిగారు. దీంతో బ్యాటింగ్‌పై సందేహాలు మరింత పెరిగాయి. కానీ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ నిలబడి జట్టును గెలిపించారు. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడిలోనూ ఛేదనలో వీళ్లు చూపించిన బ్యాటింగ్‌ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక అఫ్గానిస్థాన్‌తో పోరులో రోహిత్, ఇషాన్, విరాట్‌ మెరిశారు. పాకిస్థాన్‌పై రోహిత్, శ్రేయస్‌ అయ్యర్‌ సత్తాచాటారు. దీంతో కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌పై పెట్టుకున్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రపంచకప్‌లో జట్టుకు మూల స్తంభాలైన రోహిత్, విరాట్‌ అంచనాలకు తగ్గట్లుగా ఆడుతూ.. కప్పు కల దిశగా జట్టును నడిపిస్తున్నారు. మొత్తానికి మన బ్యాటింగ్‌ బలంగా మారి ప్రత్యర్థి బౌలర్లకు సవాలు విసురుతోంది. 

బౌలింగ్‌ అలా.. 

ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ భారత్‌ సాధించిన విజయాల్లో బౌలర్లదే కీలక పాత్ర అని చెప్పొచ్చు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 199కే ఆలౌట్‌ చేసినా.. పాకిస్థాన్‌ను 191కే కట్టడి చేసినా ఆ ఘనత మన బౌలర్లకే దక్కుతోంది. ప్రధాన పేసర్‌గా తనపై ఉన్న బాధ్యతలను బుమ్రా సమర్థంగా నిర్వహిస్తుండటం జట్టుకు ఎంతగానో మేలు చేస్తోంది. ఆసీస్‌పై 2 వికెట్లు పడగొట్టిన అతను.. అఫ్గాన్‌పై 4 వికెట్లతో విజృంభించాడు. పాక్‌తో పోరులోనూ రెండు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. మొత్తానికి 8 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ప్రస్తుతం బుమ్రా నంబర్‌వన్‌గా ఉన్నాడు. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ కూడా పదునైన బౌలంగ్‌తో రెచ్చిపోతున్నాడు. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బ్యాటర్లను కట్టిపడేస్తున్నాడు. హార్దిక్‌ కూడా పేస్‌తో రాణిస్తున్నాడు. స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా ప్రత్యర్థి బ్యాటర్లను బుట్టలో పడేస్తున్నారు. ఆసీస్‌తో మ్యాచ్‌లో కుల్‌దీప్‌ 2, జడేజా 3 వికెట్లు పడగొట్టారు. పాక్‌పై చెరో రెండు వికెట్లు సాధించారు. దాయాదితో మ్యాచ్‌లో బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో 155/2తో ఉన్న పాక్‌ ఒక్కసారిగా కుప్పకూలి 191కే పరిమితమైంది. 

భళా నాయక.. 

ప్రపంచకప్‌ అంటే చాలు బ్యాటింగ్‌లో రెచ్చిపోయే రోహిత్‌ శర్మ (Rohit Sharma) తనదైన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. అఫ్గానిస్థాన్‌పై మెరుపు శతకం బాదిన అతను.. పాక్‌పై 86 పరుగుల ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ లాగేసుకున్నాడు. మరోవైపు సారథిగానూ రోహిత్‌ ఆకట్టుకుంటున్నాడు. తన నాయకత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తున్న వాళ్లకు అతను దిమ్మదిరిగే సమాధానమిస్తున్నాడు. ముఖ్యంగా పాక్‌తో పోరులో రోహిత్‌ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. ఆరంభంలో సిరాజ్‌ పరుగులిస్తున్నా అతనితో బౌలింగ్‌ కొనసాగించి రోహిత్‌ ఫలితం రాబట్టాడు. వెంటనే హార్దిక్‌ను దించాడు. మధ్యలోనూ సరైన సమయాల్లో బౌలింగ్‌ మార్పులతో పాకిస్థాన్‌ కుప్పకూలేలా చేశాడు. మరోవైపు పిచ్‌ను, పరిస్థితులను బట్టి సరైన జట్టు కూర్పుతో టీమ్‌ఇండియా బరిలో దిగుతోంది. స్పిన్‌కు అనుకూలంగా ఉంటే అశ్విన్‌ను తీసుకుని ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతోంది. అదే పేస్‌కు సహకరించేలా పిచ్‌ కనిపిస్తే శార్దూల్‌ను మూడో పేసర్‌గా ఆడిస్తోంది. జట్టు ఇలాగే మంచి వ్యూహాలతో సాగుతూ.. ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తే నవంబర్‌ 19న కప్పును ముద్దాడుతుందనడంలో సందేహం లేదు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని