Rohit Sharma: కోహ్లీ అండ్‌ కో వస్తే.. ఏం చేయాలో మాకు తెలుసు: రోహిత్ శర్మ

ఇంగ్లాండ్‌పై నాలుగో టెస్టులో భారత్‌ అద్భుత విజయం సాధించింది. యువ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేశారని.. రోహిత్ శర్శ అభినందించాడు.

Published : 27 Feb 2024 01:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యువ జట్టుతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నాలుగో టెస్టు అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందని.. సీనియర్లు మళ్లీ జట్టులోకి వచ్చినా మేం ఒత్తిడికి గురికాకుండా నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నాడు. కఠిన పరిస్థితులను ఎదుర్కొని అద్భుతంగా ఆడిన ధ్రువ్‌ జురెల్‌పై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. 

‘‘సవాళ్లు విసిరిన టెస్టు సిరీస్‌లో అద్భుత పోరాటంతో మా యువకులు తమ సత్తా చాటారు. మరో మ్యాచ్‌ మిగిలిఉండగానే టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ప్రత్యర్థి జట్టు నుంచి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొన్న తీరు బాగుంది. మైదానంలో మేం ఎలా ఆడాలని భావించామో.. అదే తీరులో ఆధిపత్యం ప్రదర్శించాం. కుర్రాళ్లు చాలా శ్రమించారు. దేశవాళీ క్రికెట్‌ ఆడి నేరుగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్లేయర్లూ తమ సత్తా చాటారు. ఇక్కడ నేను, ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ చేసిందొకటే. యువ క్రికెటర్లకు స్వేచ్ఛ ఇచ్చి ఆడేలా చేయగలిగాం. వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయడమే మా కర్తవ్యంగా భావించాం. 

రెండో టెస్టు ఆడుతున్న ధ్రువ్ జురెల్ ఏ ఒత్తిడికి గురికాకుండా గొప్ప పరిణితి ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసి జట్టు విజయంలో ముఖ్యభూమిక పోషించాడు. గిల్‌ కూడా తన ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఈ సిరీస్‌లోనే అరంగేట్రం చేసి సత్తా చాటాడు. ఇక సీనియర్లు విరాట్ కోహ్లీతో సహా ఇతరులు వచ్చినప్పుడు జట్టులో మార్పుల గురించి మాపై ఒత్తిడి లేదు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. కుర్రాళ్లు ఎప్పుడు అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. గత మూడు టెస్టుల్లో మా ఆటతీరుకు ఇదే నిదర్శనం. చివరి మ్యాచ్‌లోనూ ఉత్సాహంగా బరిలోకి దిగుతాం’’ అని రోహిత్ వెల్లడించాడు. 

ఇది గొప్ప టెస్టు మ్యాచ్‌: బెన్‌ స్టోక్స్‌

‘‘తప్పకుండా ఇది గొప్ప టెస్టు మ్యాచ్‌ అవుతుంది. ఒకసారి స్కోరు బోర్డు చూస్తే అర్థమవుతుంది. కేవలం ఐదు వికెట్ల తేడాతోనే భారత్ గెలిచింది. ప్రతి రోజు ఎత్తుపల్లాలు చవిచూశాం. మా జట్టులో పెద్దగా అనుభవం లేని స్పిన్నర్లు ఉన్నారు. కానీ, వారు రాణించిన తీరు అద్భుతం.  వారి నుంచి ఇంకేం ఆశించలేను. నా కెప్టెన్సీలో యువకులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం ఆనందంగా ఉంది. భారత్‌లో అశ్విన్‌, కుల్‌దీప్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లను ఎదుర్కొని పరుగులు చేయడం సులువేం కాదు. జో రూట్‌పై వచ్చిన విమర్శలను నేను పట్టించుకోను. అతడు టెస్టుల్లో 12వేలకుపైగా పరుగులు చేశాడు. మేం ఈ టెస్టులో విజయం కోసం చివరివరకూ పోరాడాం’’ అని ఇంగ్లాండ్‌ కెప్టెన్ స్టోక్స్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని