IRE vs IND: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. కళ్లన్నీ వారిపైనే.. మూడో కెప్టెన్‌గా బుమ్రా!

యువ జట్టుతో ఐర్లాండ్‌ పర్యటనకు (IRE vs IND) వెళ్లిన భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఎలాంటి ఫలితాలను సాధిస్తాడనేది ఆసక్తికరంగా మారినా.. తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకొని తిరిగి గాడిలో పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Updated : 17 Aug 2023 16:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆగస్ట్ 18 నుంచి ఐర్లాండ్‌తో మూడు టీ20ల (IRE vs IND) సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇదేంటి ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ వంటి టోర్నీల ముంగిట ఇలా పొట్టి ఫార్మాట్‌ ఎందుకు అనే సందేహం చాలా మందికి రావడం సహజం. అయితే, ఈ సిరీస్‌ను కూడా భారత జట్టు తన ప్రయోగాలకు వేదికగా మార్చుకుంది. అలాగే కొందరి ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోవడానికి ఉపయోగించుకోనుంది. ఆసియా గేమ్స్‌లో పాల్గొనబోయే రుతురాజ్‌ గైక్వాడ్‌ నాయకత్వంలోని జట్టు సభ్యులకు మరింత అనుభవం వచ్చేందుకు ఈ సిరీస్‌ సహాయ పడనుంది. 

వన్డేల్లోకి తిరిగొచ్చిన బెన్‌స్టోక్స్‌.. అసలెందుకు అతడిపై భారీ అంచనాలు?

దాదాపు ఏడాది తర్వాత మైదానంలోకి దిగేందుకు సిద్ధమైన జస్ప్రీత్ బుమ్రాకు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీత నిర్ణయం తీసుకుంది. అతడి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి ఇదే సరైన వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగు ఓవర్ల కోటా అయినప్పటికీ బౌలింగ్‌లో రిథమ్‌ను అందుకొనేందుకు ఉపయోగపడటం ఖాయం. అలాగే మరో పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. అతడూ తన సత్తాను నిరూపించుకుంటే ఆసియా కప్‌ సహా వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. విండీస్‌ పర్యటనలో మెప్పించలేకపోయిన సంజూ శాంసన్‌కు మరో ఛాన్స్‌ ఈ ఐర్లాండ్‌ సిరీస్‌తో వచ్చింది. తుది జట్టులోకి వచ్చి ఉత్తమ ప్రదర్శన చేస్తేనే భవిష్యత్తులో స్థానం దక్కే అవకాశం ఉంది. 

మూడో సారథిగా బుమ్రా.. 

టీమ్‌ఇండియా 2018 నుంచి ఇది మూడో పర్యటన కావడం విశేషం. తొలిసారి 2018లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో రెండు టీ20ల్లో ఐర్లాండ్‌తో తలపడింది. ఆ రెండింట్లోనూ టీమ్ఇండియానే గెలిచింది. ఆ తర్వాత 2022లో హార్దిక్‌ పాండ్య సారథ్యంలో రెండు టీ20లు ఆడింది. ఇక్కడా మనదే విజయం. ఇప్పుడు బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగనుడటం గమనార్హం. తొలుత 2009 టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లూ తలపడ్డాయి. అక్కడా గెలుపు భారత్‌దే. అయితే, ఐర్లాండ్‌ ఓడిపోయినంత మాత్రాన తక్కువగా అంచనా వేయకూడదు. టీ20ల్లో భారత్‌పైనే 221/5 భారీ స్కోరు సాధించిన విషయాన్ని ఆటగాళ్లు మరువకూడదు. 

ఐర్లాండ్‌ - భారత్ సిరీస్‌లకు సంబంధించి మరికొన్ని విశేషాలు..

  • కుల్‌దీప్‌ సూపర్బ్ బౌలింగ్: తొలిసారి (2018లో) ఐర్లాండ్‌ సిరీస్‌కు  వెళ్లినప్పుడు రోహిత్ శర్మ (97), శిఖర్ ధావన్‌ (74) విజృంభించారు. వీరిద్దరి ధాటికి తొలి మ్యాచ్‌లో 208/5 స్కోరు చేసింది. అనంతరం భారత బౌలర్లు ఐర్లాండ్‌ను 132/9 స్కోరుకే పరిమితం చేశారు.  కుల్‌దీప్ యాదవ్ (4/21) అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేయడంతో ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. చాహల్ (3/38), బుమ్రా (2/19) అండగా నిలిచారు. 
  • భారీ తేడాతో..: ఇదే సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ 200+ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (70), సురేశ్‌ రైనా (69) హాఫ్ సెంచరీలు సాధించడంతో టీమ్ఇండియా 213/4 స్కోరు చేసింది. అనంతరం కుల్‌దీప్‌ యాదవ్ (3/16), చాహల్ (3/21) విజృంభణతో 70 పరుగులకే ఐర్లాండ్‌ కుప్పకూలింది. దీంతో 143 పరుగుల భారీ తేడాతో భారత్‌ గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా కేఎల్ రాహుల్, ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’గా చాహల్‌ నిలిచారు. 
  • 12 ఓవర్ల మ్యాచ్:  హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో (2022లో) రెండు టీ20లను ఆడేందుకు ఐర్లాండ్‌కు భారత్ వెళ్లింది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా 12 ఓవర్లకే మ్యాచ్‌ జరిగింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ చాహల్‌ (1/11) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలుత ఐర్లాండ్‌ 108/4 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దీపక్‌ హుడా (47*), ఇషాన్ కిషన్ (26), హార్దిక్‌ (24) రాణించడంతో 9.2 ఓవర్లలోనే 111/3 స్కోరు చేసి విజయం సాధించింది. 
  • దీపక్ హుడా సెంచరీ: ఇదే సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో మాత్రం ఐర్లాండ్‌నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ 225/7 స్కోరు చేసింది. దీపక్ హుడా (104) సెంచరీ సాధించాడు. సంజూ శాంసన్‌ (77) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే, బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్‌పై ఐర్లాండ్‌ కూడా దూకుడుగా ఆడింది. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (60), పాల్‌ స్టిర్లింగ్‌ (40), టారీ టెక్టర్ (39), జార్జ్‌ డాక్రెల్ (34*), మార్క్‌ ఐదెర్ (23*) ధాటికి ఛేదన దిశగా సాగింది. కానీ, కీలక సమయంలో పరుగులను నియంత్రించడంతో భారత్ కేవలం 4 రన్స్‌ తేడాతో మాత్రమే విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా సెంచరీ హీరో దీపక్ హుడా నిలిచాడు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని