Greg Chappell: పేరూ పోయె.. డబ్బులూ లేవు... తీవ్ర ఇబ్బందుల్లో గ్రెగ్ చాపెల్

గ్రెగ్‌ చాపెల్‌ (Greg Chappell) పేరు చెప్పగానే టీమ్‌ ఇండియా గతంలో ఎదుర్కొన్న ఇబ్బందికర రోజులు గుర్తొస్తాయి. భారత జట్టుకు కోచ్‌గా చేసిన గ్రెగ్‌ ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు.

Published : 27 Oct 2023 14:19 IST

గ్రెగ్ చాపెల్.. ఈ పేరు వింటేనే భారత క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. టీమ్‌ఇండియా కోచ్‌గా ఉన్న రెండేళ్లలో మన జట్టును అతను కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఈ ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు.. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా.. గొప్ప బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా రిటైరైన చాపెల్ (Greg Chappell).. ఇప్పుడు విరాళాల సేకరణ మీద ఆధారపడ్డాడన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాపెల్ ఈ పరిస్థితుల్లో ఉండటం స్వయంకృతమే అన్న చర్చ జరుగుతోంది.

డాన్ బ్రాడ్‌మన్‌ను ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప బ్యాటర్లలో ఒకడిగా పేర్కొంటారు. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక టెస్టు పరుగులతో (6996) బ్రాడ్‌మన్ నెలకొల్పిన రికార్డును తాను రిటైరయ్యే ముందే గ్రెగ్ చాపెల్ (7110) బద్దలు కొట్టాడు. టెస్టులతో పాటు వన్డేల్లోనూ తన పేస్ బౌలింగ్‌తో ఆ కాలంలో మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. 47 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించిన గ్రెగ్.. 21 విజయాలు అందించి ఉత్తమ కెప్టెన్‌గానూ పేరు సంపాదించాడు. ఐతే గణాంకాల పరంగా గొప్ప ఆటగాడే అయినా వ్యక్తిత్వ పరంగా గ్రెగ్‌కు అంత మంచి పేరేమీ లేదు. 

1981లో న్యూజిలాండ్‌తో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌‌లో జట్టును గెలిపించడం కోసం తన తమ్ముడు ట్రెవర్ చాపెల్‌తో అండర్ ఆర్మ్ బౌలింగ్ చేయించి క్రికెట్ ప్రపంచంతో ఛీ కొట్టించుకున్నాడు గ్రెగ్ చాపెల్. ఈ ఉదంతం అతడి కెరీర్లో చెరగని మచ్చగా మిగిలిపోయింది. ఇక కెరీర్‌కు గుడ్‌బై చెప్పాక కోచ్‌గా, సెలక్టర్‌గా గ్రెగ్ తెచ్చుకున్న చెడ్డు పేరు అంతా ఇంతా కాదు. ఇప్పుడు గ్రెగ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటానికి ఒక రకంగా ఆ చెడ్డ పేరు కూడా ఒక కారణమే.

ఇక్కడే కాదు అక్కడ కూడా..

2005 ప్రాంతంలో గ్రెగ్ చాపెల్‌కు భారీ జీతం ఇచ్చి ఏరికోరి కోచ్‌గా నియమించుకుంది బీసీసీఐ. అతడి నియామకంలో అప్పటి కెప్టెన్ సౌరభ్ గంగూలీది కూడా కీలక పాత్ర. అయితే తాను కోచ్ అయ్యాక గంగూలీనే తీవ్రంగా ఇబ్బంది పెట్టి జట్టు నుంచి సాగనంపాడు గ్రెగ్. మరో దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్‌ను సైతం అతను తిప్పలు పెట్టాడు. సచిన్ బ్యాటింగ్ స్థానం మార్చి అసౌకర్యాన్ని కలిగించాడు. సెహ్వాగ్ సైతం గ్రెగ్ వల్ల ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా కోచ్‌గా ఉన్న రెండేళ్ల కాలంలో భారత జట్టులో ఒక అలజడి సృష్టించి జట్టు తిరోగమనంలో పయనించేలా చేశాడు. ఫలితమే 2007 వన్డే ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం, జట్టులో లుకలుకలు. సౌరభ్ గంగూలీ చాలా ముందే రిటైర్మెంట్ ప్రకటించడానికి కూడా గ్రెగ్ పరోక్షంగా కారణమయ్యాడు. 

భారత కోచ్ పదవి నుంచి తప్పుకొన్నాక కూడా గ్రెగ్ ట్రాక్ రికార్డు గొప్పగా ఏమీ లేదు. 2011-12లో అతను ఆస్ట్రేలియా సెలక్టర్‌గా ఉన్నాడు. ఆ సమయంలో ఆసీస్ పేలవ ప్రదర్శన చేసింది. ఆటగాళ్లతో గ్రెగ్‌కు విభేదాలు తలెత్తి.. అతను డ్రెస్సింగ్ రూంకి రాకూడదని షరతు పెట్టే పరిస్థితి వచ్చింది. ఏడాది తిరిగేసరికే గ్రెగ్‌ను సెలక్టర్ పదవి నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించాల్సి వచ్చింది. భారత కోచ్‌గా తప్పుకొన్నాక కొన్నాళ్లు రాజస్థాన్ రాయల్స్‌ కోచింగ్ బృందంలోనూ పని చేశాడు కానీ.. అక్కడా అతడికి పొసగక ఆస్ట్రేలియాకు వెళ్లిపోవాల్సి వచ్చింది. తన దుందుడుకు స్వభావం, వివాదాస్పద తీరుతో కోచ్, ఇతర బాధ్యతలు వేటిలోనూ గ్రెగ్ కుదురుకోలేకపోయాడు. దీంతో చాలా ఏళ్ల నుంచి ఇంటిపట్టున ఉండాల్సి వస్తోంది. అందుకే గ్రెగ్‌ను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని అంటున్నారు. 

గ్రెగ్ సోదరుల్లో ఒకరైన ఇయాన్ చాపెల్ వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా స్థిరపడ్డాడు. ట్రెవర్ చాపెల్ సైతం అనేక జట్లకు కోచ్‌గా పని చేశాడు. కానీ గ్రెగ్ మాత్రం ఎక్కడగా నిలకడగా పని చేయలేకపోయాడు. ఇప్పుడు తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు మీడియాకు చెబుతూ.. ఇప్పటి క్రికెటర్లతో పోలిస్తే పాతతరం క్రికెటర్లకు ప్రయోజనాలు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఒకరకంగా అసూయలా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. గ్రెగ్ ఈ పరిస్థితిలో ఉండటానికి తన వివాదాస్పద వైఖరే కారణమన్న చర్చ నడుస్తోంది. అతను కోచ్‌గా తన అనుభవాన్ని, నైపుణ్యాలను సరిగ్గా ఉపయోగించి ఉంటే బోలెడంత సంపాదించి ఉండేవాడని.. కానీ ప్రతి చోటా వివాదాస్పద వైఖరితో అన్ని పదవులనూ దూరం చేసుకున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా గ్రెగ్‌ను ఆదుకోవడం కోసం అతడి స్నేహితులు విరాళాల సేకరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకోసం స్పెషల్ డిన్నర్లు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాలు అతడికి ఎంతమేర ప్రయోజనం చేకూరుస్తాయో చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని